More

    అందరికి రైతు బంధుపై కెసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. యాదాద్రి లాగే కొండగట్టు ఆలయం..!

    తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే అనేక రంగాల్లోనే దేశంలో నెంబర్‌ వన్‎గా నిలిచామన్నారు. తెలంగాణ మాదిరిగానే కేంద్రం కూడా పనిచేస్తే.. రాష్ట్ర జీఎస్‎డీపీ 14.5 లక్షల కోట్లు ఉండేదని తెలిపారు.

    బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. టీఆర్‎ఎస్ పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన అనంతరం వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో తెలంగాణలో కారుచీకట్లు ఉండేవి.. కానీ ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామన్నారు.

    అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2016 రూపాయల వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నామని, రైతుబంధు ఇస్తున్నామని తెలిపారు. అయితే, రైతు బంధు అందరికీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారని.. రాష్ట్రంలో 93 శాతం రైతులకు భూమి 5 ఎకరాలలోపే ఉందని తెలిపారు. 25 ఎకరాలకు మించి ఉన్న రైతులు 0.25 మాత్రమే ఉన్నారని.. వివరించారు.

    గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనే ఒకే రాష్ట్రం తెలంగాణ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. మిషన్‌భగీరథ వెనుక చాలా కష్టం ఉందని.. భగీరథ పైప్‌లు 2లక్షల కిలోమీటర్ల మేర ఉన్నాయని తెలిపారు. చైనా, బ్రెజిల్‌ తర్వాత అతి ఎక్కువ అడవుల్ని పెంచామంటూ పేర్కొన్నారు. జీఎస్‎డీపీ రూ.5లక్షల కోట్ల నుంచి రూ.11.5 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.

    మరోవైపు కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్దికి రూ.100 కోట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంజన్న ఆలయానికి ఇప్పటికే 384 ఎకరాలు ఇచ్చామన్న ఆయన.. జగిత్యాల జిల్లాలో గొప్ప ఆధ్మాత్మిక క్షేత్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రఖ్యాత స్తపతులను తీసుకువచ్చి యాదాద్రి క్షేత్రం లాగా కొండగట్టును అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

    Trending Stories

    Related Stories