మునుగోడులో అవసరం లేకుండా ఉప ఎన్నిక వచ్చిందన్నారు సీఎం కేసీఆర్. ఉప ఎన్నిక ఫలితం కూడా ఎప్పుడో తేలిపోయిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరులో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎలక్షన్స్ వస్తే చాలు కొందరు హడావుడి చేస్తారని, గాయ్..గాయ్, గత్తర్.. గత్తర్ లొల్లి నడుస్తుందని అన్నారు. ఒళ్లు మరిచిపోయి ఓటు వేస్తే ఇల్లు కాలిపోతుందని సెటైర్లు వేశారు సీఎం కేసీఆర్. బావ చెప్పిండనో, డ్యాన్సులు చేశారనో ఓట్లు వేయొద్దని కోరారు. దోపిడి దారులు మాయమాటలు చెబుతూనే ఉంటారని, కరిచే పామును మెడలో వేసుకుంటామా అని ప్రశ్నించారు. ఓటు అనేది మన తలరాత రాసుకునే గొప్ప ఆయుధమన్నారు. ఆలోచించి ఓటు వేస్తే మన బతుకులు బాగుపడతాయని స్పష్టం చేశారు. మునుగోడుకు అండదండగా ఉంటానని, మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే బాధ్యత నాదేనని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.