హిజాబ్ వివాదంపై స్పందించిన సీఎం కేసీఆర్.. హిజాబ్ లేకుండా కాలేజీకి వెళ్లేది లేదంటున్న ముస్లిం యువతులు

0
970

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు వేసిన పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సరైనదని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు.. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదని అన్నారు.

హిజాబ్ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. మన దేశానికి ఐటీ క్యాపిటల్ గా బెంగళూరు ఉందని, ఆ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. ఈ రెండు నగరాల్లో విదేశాలకు చెందిన ఎందరో పని చేస్తుంటారని.. బెంగుళూరులో హిజాబ్ పంచాయతీ పెడుతున్నారని… ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు ఏం అభ్యంతరమని ప్రశ్నించారు. మత కలహాలు పెట్టడానికే హిజాబ్ పంచాయతీ పెట్టారని విమర్శించారు. హిజాబ్ లాంటి సమస్యలు, మత కలహాలు ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి వివాదాల వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు.

హిజాబ్ వివాదంలో త‌మ‌కు న్యాయం ద‌క్క‌లేద‌ని క‌ర్ణాట‌క హైకోర్టును ఆశ్ర‌యించిన ముస్లిం యువ‌తులు చెబుతున్నారు. తాము హిజాబ్ లేకుండా కాలేజీకి వెళ్లేది లేద‌ని చెబుతున్నారు. క‌ర్ణాట‌క హైకోర్టు వెలువ‌రించిన తీర్పుపై యువ‌తులు మీడియాతో మాట్లాడారు. హిజాబ్‌పై తాము పోరాటం చేసి తీర‌తామ‌ని కూడా ఆ యువ‌తులు ప్ర‌క‌టించారు. యువ‌తులు ముందుగా హిజాబ్ ధ‌రించాల‌ని, పుస్త‌కాల‌ను కాద‌ని చెప్పారు.

క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ పిటిష‌నర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క‌ర్ణాట‌క హైకోర్టులో ఈ వివాదంపై విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే కొంద‌రు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అప్పట్లో ఈ పిటిష‌న్‌ను తీర‌స్క‌రించిన సుప్రీంకోర్టు దీనిపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్నందున విచార‌ణ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పింది. ఒక‌వేళ హైకోర్టు తీర్పుపై అసంతృప్తి ఉంటే అప్పుడు త‌మ‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌ని తెలిపింది.