అమెరికాలో తెలుగు యువకుడిని పొట్టనపెట్టుకున్న దొంగలు..!

0
469

అమెరికాలో దుండగుల కాల్పుల్లో తెలుగు యువకుడు మరణించాడు. వెస్ట్‌ కొలంబస్‌లో అర్ధరాత్రి 12.50 నిమిషాలకు జరిగిన ఈ ఘటనలో ఏలూరు వాసి సాయిష్ వీర ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్‌,1000 వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్‌ లో పనిచేస్తున్న వీర.. దోపిడీకి ప్రయత్నించిన దొంగను అడ్డుకున్నాడు. దాంతో దుండగులు వీరపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు.

24 ఏళ్ల సాయిష్ వీర గ్యాస్ స్టేషన్ క్లర్క్ గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున ఫ్రాంక్లింటన్‌లో దోపిడీకి యత్నించే సమయంలో అడ్డుకున్న వీరను చంపేశారని కొలంబస్ పోలీసులు తెలిపారు. 2023లో కొలంబస్‌లో నమోదైన 50వ హత్య ఇది. అయితే గత సంవత్సరంతో పోల్చితే హింస బాగా పెరిగింది. కాల్పుల తర్వాత సాయిష్ వీరను ఓహియోహెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే అతడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కాల్పులు జరిగినప్పుడు గ్యాస్ స్టేషన్‌లోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పలువురు సాక్షులను డిటెక్టివ్‌లు విచారిస్తున్నారు.

కొలంబస్ పోలీసులు గ్యాస్ స్టేషన్ నిఘా కెమెరాల నుండి అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించిన చిత్రాన్ని విడుదల చేశారు. ఆ వ్యక్తి గుర్తింపు లేదా ఆచూకీపై 614-645-4730కి లేదా సెంట్రల్ ఒహియో క్రైమ్ స్టాపర్స్‌కు 614-461-TIPSకి కాల్ చేయాల్సిందిగా కోరారు. వీర మృతదేహాన్ని భారత్ కు పంపడానికి అతడి స్నేహితులు ఆన్‌లైన్ లో నిధుల సేకరణ మొదలు పెట్టారు. వీర ఉన్నత విద్యను అభ్యసించడానికి యునైటెడ్ స్టేట్స్ కు వెళ్ళాడు. మరికొన్ని వారాల్లో పెట్రోల్ బంక్ లో ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని కూడా అనుకున్నాడు. కానీ ఇంతలో ఊహించని ఘటన అతడి ప్రాణాలను తీసేసింది. వీర తండ్రి రెండు సంవత్సరాల కిందట మరణించాడు. ఎంతో మంది మిడిల్ క్లాస్ భారతీయులలాగే మంచి కెరీర్ కోసం వీర కూడా అమెరికాకు వెళ్ళాడు.