దేశంలోని జైళ్లలో పెద్ద సంఖ్యలో విచారణ ఖైదీలు ఉండటం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. ఎలాంటి విచారణ లేకుండా దీర్ఘకాలంపాటు వ్యక్తుల నిర్బంధానికి దారితీస్తున్న విధానాలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలోని 6.10 లక్షల మంది ఖైదీల్లో సుమారు 80% మంది అండర్ ట్రయల్ ఖైదీలేనన్నారు. సీజేఐ జైపూర్లో ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ 18వ వార్షిక సదస్సులో ప్రసంగించారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ పాల్గొన్నారు. కారాగారాలను బ్లాక్ బాక్సులుగా పేర్కొన్న సీజేఐ.. ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన ఖైదీల్లో జైలు జీవితం ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు.
విచారణ ఖైదీలను ముందుగా విడుదల చేయడమనే లక్ష్యానికి పరిమితం కారాదని చెప్పారు. నేర న్యాయ వ్యవస్థలో, ప్రక్రియే ఒక శిక్షగా మారిందన్న ఆయన… అడ్డుగోలు అరెస్టులు మొదలు బెయిల్ పొందడం వరకు ఎదురయ్యే అవరోధాలు, విచారణ ఖైదీలను దీర్ఘకాలం పాటు నిర్బంధించే ప్రక్రియపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని ఆయన అన్నారు.
దీంతోపాటు పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, పోలీసులకు శిక్షణ, సున్నితత్వం పెంచడం వంటి వాటి ద్వారా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను మెరుగుపరచవచ్చని అన్నారు. రాజకీయ వైరుధ్యం శత్రుత్వంగా మారడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. వివరణాత్మక చర్చలు, పరిశీలనలు లేకుండా చట్టాలు ఆమోదం పొందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.