‘గో బ్యాక్ చైనా’ అంటూ.. ఆ దేశ ప్రజలందరూ ముందుకు వస్తున్నారు..!

0
769

ఇటీవలి కాలంలో చైనా దేశం వేలు పెడుతున్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. టిబెట్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ దేశాల విషయంలో చైనా చేస్తున్న కుతంత్రాలు అంతా ఇంతా కాదు. కొన్ని దేశ ప్రజలకు చైనా ఓవరాక్షన్ అసలు ఇష్టం లేదు. అంతర్గత వ్యవహారాల్లో కూడా చైనా జోక్యం చేసుకుంటూ ఉంది. మా దేశం మీద మీ పెత్తనం ఏమిటనే ప్రశ్నలు వేస్తున్నారు ఆయా దేశాల ప్రజలు. ఇప్పటికే చైనాకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో నిరసలు తీవ్రమవ్వగా.. ఇప్పుడు నేపాల్ లో కూడా చైనాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి.

నేపాల్‌లోని రాష్ట్రీయ ఏకతా అభియాన్.. బిరత్‌నగర్, మొరాంగ్, ఖబర్‌హబ్‌ ప్రాంతాలలో చైనాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించింది. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో చైనా మితిమీరిన జోక్యం, ఉత్తర సరిహద్దులో వివిధ ప్రదేశాలలో నేపాలీ భూభాగాన్ని ఆక్రమించడాన్ని నేపాల్ పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రీయ ఏకతా అభియాన్ సభ్యులు మహేంద్ర చౌక్ నుండి బిరాట్‌నగర్‌లోని భట్టా చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేశంలోని రాజకీయాల్లో చైనా అనవసర జోక్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చిత్రాలను కూడా నిరసనకారులు దహనం చేశారు.

నేపాలీ వ్యాపారాలను భారీగా దెబ్బతీసే సరిహద్దు పాయింట్ల వద్ద చైనా అనధికారిక దిగ్బంధనాన్ని విధించింది. చైనీస్ విశ్వవిద్యాలయాల నుండి ఇంకా మెడికల్ డిగ్రీలు పూర్తి చేయని నేపాలీ విద్యార్థుల పట్ల చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో చైనా విపరీతమైన జోక్యాన్ని పౌర సమాజంలోకి మరింత వెళ్లేలా, ప్రభుత్వం గ్రహించేలా తాము నిరసనలు చేపట్టామని రాష్ట్రీయ ఏకతా అభియాన్ గ్రూప్ మొరాంగ్ కోఆర్డినేటర్ జితేంద్ర యాదవ్ తెలిపారు.

అక్టోబర్ 2019లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నేపాల్‌ను సందర్శించినప్పటి నుండి నేపాల్‌లో చైనా జోక్యం ఎక్కువైంది. నేపాల్ రాజకీయ, ప్రభుత్వ ఎజెండా విషయంలో బీజింగ్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉందనే విమర్శలు తీవ్రమయ్యాయి. నేపాల్ పై చైనా ఒక నిర్దిష్ట రకమైన పరపతిని కలిగి ఉందని నివేదికలు పేర్కొన్నాయి. జూలై 2021లో ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత చైనా మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నేపాల్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు నిత్యకృత్యంగా మారాయి. అంతకు ముందు జనవరి 13న, రాష్ట్రీయ ఏకతా అభియాన్ ఇలాంటి నిరసనలు నిర్వహించి, ఖాట్మండులో నేపాల్‌లోని చైనా రాయబారి హౌ యాంకీ చిత్రాలను తగులబెట్టింది. ఆందోళనకారులు యాంకీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘గో బ్యాక్ చైనా’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.