భారత ప్రభుత్వం.. భారతీయులందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్లను అందించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకే పలు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం అనుమతులను ఇస్తోంది. ఇప్పటికే మూడు వ్యాక్సిన్లకు భారతదేశంలో అనుమతులు రాగా.. ఇక మోడెర్నా కోవిద్-19 వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవడానికి ఫార్మాస్యూటికల్ కంపెనీ సిప్లాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి లభించింది. మోడెర్నా వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవటానికి, మార్కెటింగ్ చేయడానికి మంగళవారం నాడు సిప్లా డిజిసిఐ అనుమతి కోరింది. భారతదేశంలో కరోనా వైరస్ కోసం ప్రస్తుతం రెండు స్వదేశీ వ్యాక్సిన్లు ఉన్నాయి. కొవాగ్జిన్, కొవిషీల్డ్ కాగా రష్యాకు చెందిన స్పుత్నిక్ వి ని కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ఇక మోడెర్నా కూడా దేశంలో వాడుకలోకి రాబోతూ ఉండడంతో అనుమతులు లభించిన నాల్గవ వ్యాక్సిన్ గా నిలవనుంది. మోడెర్నా ఒక మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఇది 90 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు పరీక్షల్లో తేలింది. ఈనేపథ్యంలోనే భారత్‌లో అత్యవసర వినియోగ అనుమతులపై నేడు నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. మోడెర్నా ధర భారత్ లో ఎంత ఉంటుందనే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.
అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరయ్యాయి. ఇప్పటివరకు భారత్ లో అనుమతి పొందిన కరోనా టీకాలలో మోడెర్నా నాలుగవది. ఇప్పటివరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లకు భారత్ లో గ్రీన్ సిగ్నల్ లభించగా, తాజాగా మోడెర్నా వ్యాక్సిన్ కూడా వాటి సరసన చేరింది. ఈ క్రమంలో భారత ఫార్మా సంస్థ సిప్లాకు మోడెర్నా వ్యాక్సిన్ డోసులు దిగుమతి చేసుకునేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం తెలిపింది.
భారత్‌లోనూ కొత్త టీకాలను అందుబాటులోకి తెచ్చేలా ఇటీవల డిసిజిఐ అనుమతి ప్రక్రియల్లో కొన్ని మార్పులు చేసింది. విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలు దేశంలో క్లినికల్ ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పడంతో మరిన్ని వ్యాక్సిన్లు భారత్ లో అందుబాటులోకి రానున్నాయి.