తెలంగాణ ప్రభుత్వం సినిమా థియేటర్లు తెరచుకోడానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చినప్పటికీ కొన్ని కారణాల వలన ఇప్పటి వరకూ సినిమాల ప్రదర్శన జరగలేదు. తాజాగా తెలంగాణలో సినిమా ప్రదర్శనలపై ప్రభుత్వం ఆంక్షలు తొలగించింది. 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. కొత్త చిత్రాలను ఈ నెల 23 నుంచి ప్రదర్శించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శనలు పునః ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఫిలించాంబర్ ప్రతినిధులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసానిని కలిసి థియేటర్ల ఓపెనింగ్ పై వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఫిలిం చాంబర్ ప్రతినిధుల విజ్ఞప్తుల పట్ల తలసాని సానుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసిన వారిలో సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, కిశోర్ బాబు, అభిషేక్ నామా, బాల గోవిందరాజు ఉన్నారు. థియేటర్లకు ప్రకటించిన రాయితీలపై ఉత్తర్వులు జారీ చేయాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
గత కొద్ది నెలల నుంచి మూతబడ్డ సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఆదివారం నుంచి థియేటర్లను తెరవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మురళీమోహన్, సెక్రటరీ సునీల్ నారంగ్.. ఎగ్జిబిటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి థియేటర్ల ఓపెన్‌పై నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లలో పని చేసే సిబ్బంది ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు.