రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై పుట్టిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ఆయన ఆరోగ్యం నిలకడగా లేదంటూ.. ఆయనకు క్యాన్సర్ అంటూ ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు.
కొన్ని దేశాలు పనిగట్టుకొని మరీ పుతిన్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ రోజుల తరబడి వార్తలను ప్రసారం చేశాయి. పుతిన్ స్థానంలో మరో అధ్యక్షుడు రాబోతున్నాడని కూడా విష ప్రచారం చేశారు. ఇప్పుడు అలాంటి పుకార్లకు అన్నింటికి అమెరికానే చెక్ పెట్టేసింది. పుతిన్ పై అనేక ఆరోపణలు చేసిన అమెరికానే ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని ఇటీవల వార్తలు వచాయి. ఉక్రెయిన్‌పై దాడి ప్రకటన తర్వాత పుతిన్ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ పుతిన్ ఆరోగ్యం గురించి తమ వద్ద ఎటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం లేదని అమెరికాకు చెందిన సీఐఏ తెలిపింది.
ఈ ఏడాది 70వ పడిలోకి ఎంటర్ అవుతున్న పుతిన్.. క్యాన్సర్ నుంచి బాధపడుతున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. కానీ సీఐఏ చీఫ్ విలియమ్ బర్న్స్ తమ వద్ద పుతిన్ ఆధారాలు లేవన్నారు. బహుశా ఆయన ఆరోగ్యంగా ఉండి ఉంటారని కూడా జోకేశారు. పుతిన్ ఆరోగ్యంపై చాలా వరకు పుకార్లు ఉన్నాయని, కానీ తమకు తెలిసినంత వరకు ఆయన నిండు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోందని బర్న్స్ తెలిపారు.