చర్చి ఫండ్స్ విషయంలో గొడవలు.. రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు..!

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చర్చి నిధుల విషయంలో సభ్యుల మధ్య చోటు చేసుకున్న గొడవ రక్తపాతానికి దారితీసింది. చర్చి ఫండ్స్ విషయంలో దుర్వినియోగం జరిగిందంటూ చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) కమిటీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. సమావేశం జరుగుతూ ఉండగానే కొంతమంది సభ్యులు ఇతర వర్గానికి చెందిన వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇరు వర్గాలు ఒకరి మీద మరొకరు దూషణలకు దిగారు. ఆ తర్వాత కొట్టుకోవడం దాకా వెళ్ళింది. దీంతో న్యాయవాది, కమిటీ సభ్యుడు అయిన నేసామెర్లిన్పై దాడి చేశారు.
కొంతమంది సభ్యులు నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై చర్చించడానికి రేస్ కోర్సులోని సిఎస్ఐ బిషప్ అప్పసామి కాలేజీలో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం కాస్తా హింసాత్మకంగా మారింది. ఇంతలో ఓ వర్గం నెసామెర్లిన్పై దాడి చేసింది. అతని తలపై దెబ్బ తగిలింది. ఈ సంఘటనను కొంతమంది సభ్యులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఘటన అనంతరం నెసామెర్లిన్ తనపై దాడి చేసిన వారిపై రేస్ కోర్సు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చార్లెస్ జాకబ్, పరమానందం మరియు మరికొందరిపై ఐపిసి సెక్షన్ 147 (అల్లర్లకు శిక్ష), 148 (ఘోరమైన ఆయుధంతో ఆయుధాలు కలిగిన అల్లర్లు), 323 (స్వచ్ఛందంగా బాధ కలిగించినందుకు శిక్ష), 324 (ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా స్వచ్ఛందంగా గాయపడటం), 307 (హత్యాయత్నం), సెక్షన్ 448 మరియు 506 (ii) (క్రిమినల్ బెదిరింపు)ల కింద కేసులను నమోదు చేశారు. ఇంతకూ చర్చికి వస్తున్న నిధులు కాజేసింది ఎవరు.. ఎంత వరకూ వినియోగించారు వంటి విషయాలేవీ స్పష్టంగా తెలియకుండా సమావేశం ముగిసిపోయింది. గొడవల కారణంగా పోలీసులు కేసులను నమోదు చేశారు.