ఆదివారం నాడు పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్ నగరంలో ఉన్న మదీనా మార్కెట్‌లో క్రైస్తవ పాస్టర్‌ను దుండగులు కాల్చి చంపారు. గుల్బహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని ఆల్ సెయింట్స్ చర్చ్‌కు చెందిన పాస్టర్ విలియం సిరాజ్‌గా గుర్తించారు. రెవరెండ్ ప్యాట్రిక్ నయీమ్ అనే మరో పాస్టర్ కూడా తుపాకీ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. పాస్టర్లు వ్యక్తిగత పనుల నిమిత్తం రింగ్‌రోడ్డుపై వ్యాన్‌లో వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. సిరాజ్ అక్కడికక్కడే మృతి చెందగా, పాస్టర్ నయీమ్ ను లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాస్టర్ నయీమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పాస్టర్ సిరాజ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. క్రైం స్పాట్‌లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. నిందితులని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడిని పలువురు సోషల్ మీడియాలో ఖండించారు. పెషావర్ డియోసెస్ మతాధికారులపై కాల్పులు జరిపి, పాస్టర్ విలియం సిరాజ్‌ను అక్కడే హతమార్చారని.. రెవ్ పాట్రిక్ నయీమ్‌ను గాయపరిచారని.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పాకిస్థాన్ బిషప్ చర్చ్ ప్రెసిడెంట్ ఆజాద్ మార్షల్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం క్రైస్తవులకు రక్షణ కల్పించమని కోరుతున్నాము.
పాస్టర్లు ఆల్ సెయింట్స్ చర్చ్ ఆఫ్ పెషావర్‌కు చెందినవారని.. 1883 నుండి చర్చిలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. చర్చిపై సెప్టెంబర్ 2013లో ఘోరమైన ఉగ్రవాద దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 75 మందికి పైగా మరణించారు. పాకిస్తాన్ తాలిబాన్‌కు చెందిన ఇద్దరు ఇస్లామిక్ ఆత్మాహుతి బాంబర్లు ఈ దాడికి పాల్పడ్డారు. పాకిస్తాన్‌లోని వాయువ్య గిరిజన ప్రాంతాలలో యుఎస్ డ్రోన్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ దాడికి పాల్పడ్డామని ఇస్లామిక్ సంస్థ తెలిపింది.