చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా

0
875

చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని విశాఖపట్నం వాసులుగా గుర్తించారు. వీరు విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసు అధికారి మాట్లాడుతూ.. చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిందని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని లారి వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును బయటకు లాగారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.