చిత్రకూట్ జైలులో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం అన్షు దీక్షిత్ అనే ఖైదీ పిస్టల్ ను చేతబట్టుకుని ముకిమ్ కాలా, మెరాజుద్దీన్ లను కాల్చి చంపాడు. ముకిమ్ కాలా, మెరాజుద్దీన్ లు డాన్ నుండి పొలిటీషన్ గా మారిన ముక్తార్ అన్సారీకి చాలా కావాల్సిన వాళ్లు. ముకిమ్ కాలా కూడా ఒక గ్యాంగ్స్టర్, మెరాజుద్దీన్ తూర్పు యూపీలో ఒక డాన్. అన్షు దీక్షిత్ సీతాపూర్ కు చెందిన ఒక షార్ప్ షూటర్.. ఎక్కడి నుండి తుపాకీ సంపాదించాడో తెలియదు కానీ ముకిమ్ కాలా, మెరాజుద్దీన్ లను చంపేశాడు. ఆ తర్వాత పోలీసులు అన్షు దీక్షిత్ ను కాల్చి చంపారు.

శుక్రవారం ఉదయం పెరేడ్ ముగించుకుని వచ్చిన తర్వాత అన్షు దీక్షిత్ ముకిమ్ కాలా, మెరాజుద్దీన్ లపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత కూడా పలువురిపై కాల్పులు జరిపాడు. అయిదు మంది ఖైదీలని అదుపులోకి తీసుకుని వారిని కూడా చంపేస్తానని జైలు అధికారులను బెదిరించాడు. జిల్లా మేజిస్ట్రేట్, ఎస్.పి. ఘటనా స్థలానికి చేరుకొని లొంగిపోమని అన్షును కోరారు. అయితే అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో అన్షు దీక్షిత్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అన్షు దీక్షిత్ మరణించాడు. అన్షు దీక్షిత్ దగ్గరకు గన్ ఎలా వచ్చింది అనే విషయమై విచారణ చేస్తూ ఉన్నారు.

గ్యాంగ్స్టర్ ముకిమ్ కాలాపై 65 కేసులు ఉన్నాయి. షారన్ పూర్ నుండి చిత్రకూట్ జైలుకు ఇటీవలే బదిలీ అయ్యి ముకిమ్ కాలా వచ్చాడు. మెరాజుద్దీన్ వారణాసి జైలు నుండి చిత్రకూట్ జైలుకు వచ్చాడు. ముకిమ్ కాలా కు దక్షిణ ఉత్తరప్రదేశ్ లో క్రిమినల్ నెట్ వర్క్ ఉంది. డాన్ ముస్తఫా కగ్గా దగ్గర ఒకప్పుడు పని చేసిన ముకిమ్ కాలా ఆ తర్వాత సొంతంగా నేరాలు చేసే స్థాయికి ఎదిగాడు. అన్షు దీక్షిత్ కూడా ఒక క్రిమినల్ అని అధికారులు తెలిపారు. డిసెంబర్ 2019 నుండి చిత్రకూట్ జైలులో ఉన్నాడు అన్షు. ప్రస్తుతం జైలులో పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.