తీవ్రమైన చిరంజీవి-గరికపాటి వివాదం

0
1328

బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కూడా హాజరయ్యారు. గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి రావడంతో ఆయనతో ఫొటోలు తీసుకోడానికి అక్కడివారు పోటీలు పడ్డారు. దాంతో గరికపాటి అసహనం వ్యక్తం చేస్తూ, చిరంజీవి ఫొటో షూట్ ఆపితేనే తాను ప్రసంగిస్తానని అన్నారు. దాంతో చిరంజీవి వెంటనే వేదికపైకి వచ్చి గరికపాటికి అభివాదం చేసి కార్యక్రమం కొనసాగేలా చూశారు. “చిరంజీవి గారూ.. మీ ఫోటో సెషన్ ఆపేయండి.. లేదంటే నాకు సెలవియ్యండని” అన్నారు. దీంతో అంతా గరికపాటి వైపు తిరిగారు. గరికపాటి చెప్పిన తర్వాత చిరంజీవి ఆయన దగ్గరకు వచ్చి మరీ పలుకరించారు. చాలాసేపు ఆయన పక్కనే కూర్చుని మాట్లాడారు.

గరికపాటి నరసింహరావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆయన పేరు ప్రస్తావించకుండా ”ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటేనన్నారు”. నాగబాబు చేసిన వ్యాఖ్యలకు ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ స్పందించింది. ”ఆహార్యానికి అవధానానికి తేడా తెలియని మాయారంగం, నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాదికి, సమాజంతో నటనా వ్యాపారం తప్ప సమాజహితాన్ని మరచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందారనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే.. చిడతలు కొట్టే వాడు కూడా సంగీత విద్వాంసులమని ట్వీట్లలో కూనిరాగాలాపన చేస్తే ఎలా?” అంటూ పేరు ప్రాస్తావించకుండానే ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి విషయంలో గరికపాటి వ్యవహరించిన తీరుపై మెగా అభిమానులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్… గరికపాటితో ఫోన్ లో మాట్లాడారు. చిరంజీవి పట్ల గరికపాటి వ్యవహరించిన వైనం తమకు బాధ కలిగించిందని, అభిమానుల్లో ఆగ్రహం కలిగినా వారిని తాము శాంతింపజేశామని తెలిపారు. అందుకు గరికపాటి స్పందిస్తూ, ఎవరూ తనను ఇబ్బందిపెట్టలేదన్నారు. చిరంజీవి ఎంతో సహృదయుడని, ఈ విషయంపై ఆయనతో మాట్లాడతానని గరికపాటి వివరణ ఇచ్చారు.