సాధువు వేషంలో చైనా మహిళ.. తలదాచుకుందా లేక గూఢచర్యమా..?

0
978

సాధువు రూపంలో ఢిల్లీలో తలదాచుకుంటున్న చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్‌లోని ఖాట్‌మాండు ప్రాంతం నుంచి వచ్చానని చెబుతూ వచ్చిన సదరు మహిళ.. ఢిల్లీలోని టిబెట్ శరణార్థుల క్యాంప్‌లో ఆశ్రయం పొందుతోంది. సాధువు రూపంలో ఉన్న ఈ మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. టిబెట్ నుంచి భారత దేశానికి వచ్చిన శరణార్థుల కోసం ఢిల్లీలో మజ్ను కా తిలా పేరుతో ప్రభుత్వం ఓ క్యాంప్ నిర్వహిస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌కు సమీపంలో ఉందీ క్యాంప్. విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో అక్కడి వారితో ఆమె కలిసిపోయింది. విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఆ మహిళ చైనా పౌరురాలని విచారణలో తేలింది. ఆమె అసలు పేరు కై రుయో అని తెలిపింది. 2019లో చైనా నుంచి భారత్‌లో అడుగుపెట్టినట్లు వెల్లడైంది. చైనాలోని కమ్యూనిస్టు లీడర్లతో తనకు ప్రాణభయం ఉందని, అందుకే పేరు మార్చుకుని భారత్‌లో తలదాచుకుంటున్నానని చెప్పింది. ఆ మహిళ బౌద్ధ సన్యాసి డోల్మా లామాగా బతుకుతూ ఉంది. చిన్న హెయిర్‌కట్‌తో సాంప్రదాయ బట్టల్ని ధరించింది. ఆమె గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను పోలీసులు సంప్రదించినప్పుడు.. ఆమె చైనా పౌరురాలని.. 2019 లో భారతదేశానికి వచ్చినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

అక్టోబర్ 17న ఆమెపై సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 420 (మోసం చేయడం మరియు నిజాయితీగా ఆస్తుల పంపిణీని ప్రేరేపించడం), 467 (విలువైన సెక్యూరిటీని ఫోర్జరీ చేయడం).. ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్- ఫారినర్స్ యాక్ట్ ప్రత్యేక సెల్‌లో ఆమె ఉందని పోలీసులు తెలిపారు.