More

  చైనా స్కూళ్లలో జిన్‎పింగ్ పాఠాలు..!

  మన పిల్లలకు అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ.. అంటూ విద్యాబోధన ప్రారంభవుతుంది. కానీ, అక్కడ మాత్రం ప్రాథమికస్థాయి నుంచే.. ఓ తాత గురించి పాఠాలు బోధిస్తారు. అదెక్కడో కాదు.. మన పక్కలో బల్లెం చైనాలో. ఆ తాత ఎవరో కాదు.. ఆ దేశాధ్యక్షుడు షీ జింపింగ్. సాధారణంగా ప్రాథమికస్థాయి నుంచి పిల్లలకు అవసరమైన ప్రాథమికాంశాలను బోధిస్తారు. మంచి, మర్యాద, నైతిక విలువలు నేర్పిస్తారు. అయితే, చైనా మాత్రం చిన్నారుల మెదళ్లలో ‘సోషలిజం’ భావజాలాన్ని ఎక్కించేందుకు సిద్ధం చేసింది.

  బుధవారం చైనాలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘జిన్‎పింగ్ థాట్’ పాఠ్యాంశంతో కూడిన కొత్త పాఠ్యపుస్తకాలను అందించారు. ఆ పుస్తకాల కవర్ పేజీలను జిన్‎పింగ్ సూక్తులతో పాటు.. ఆయన నవ్వుతున్న ఫొటోలతో అందంగా తీర్చిదిద్దారు. ప్రాథమిక విద్యార్ధుల కోసం వాటిలో చైనా నాగరికత, సాధించిన విజయాలపై పాఠాలను వండివార్చారు. అంతేకాదు, పేదరిక నిర్మూలనలో కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలను, తాజాగా కరోనావైరస్‎పై చైనా పోరాటాన్ని ఏకరువుపెట్టారు.

  అంతేకాదు, జిన్‎పింగ్ పాఠాలను ఆకర్షణీయంగా రూపొందించింది చైనా విద్యాశాఖ. ‘‘జిన్‎పింగ్ తాత తన పనుల్లో ఎప్పుడూ బిజీగా వుంటారు. కానీ, ఆయన ఎంత బిజీగా వున్నా.. మీ అభివృద్ధికోసం పాటుపడతారు’’ అంటూ.. జిన్‎పింగ్‎ను పిల్లలకు చైనా జాతిపిత రేంజిలో చూపించారు. ఇలాంటి భావజాలాన్ని పిల్లలకు బోధించాల్సిందిగా తమ స్కూల్ టీచర్లకు మార్గదర్శకత్వం చేసింది చైనా. ‘‘మనం అమితంగా ప్రేమించే పార్టీ గురించి, దేశం గురించి, సోషలిజం గురించి అంశాలను యువ హృదయాల్లో నింపాలి’’ అని కొత్త స్కూల్ కరిక్యులమ్‎లో సూచనలు చేసింది. ఇలా చిన్నతనం నుంచే పిల్లల్లో కమ్యూనిస్టు భావాలు నాటుకునేలా ‘‘జిన్‎పింగ్ థాట్’’ విధానాన్ని ప్రవేశపెట్టింది చైనా విద్యా మంత్రిత్వ శాఖ.

  కమ్యూనిస్ట్ భావజాలానికి సంబంధించిన 14 ప్రధాన అంశాలతో జిన్‎పింగ్ థాట్‎ రూపొందించింది చైనా విద్యాశాఖ. ఇందులో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీ చేసిన సంస్కరణలను పొందుపరిచారు. ఇవి పిల్లల్లో నూతన ఆలోచనలను ప్రేరేపిస్తాయని కమ్యూనిస్టు నాయకులు చెప్పుకుంటున్నారు. ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’, ‘మాతృభూమి’తో పునరేకీకరణ వంటి భావనలను ఇది నొక్కి చెబుతుందంటున్నారు. ఏదేమైనా ఈ కొత్త వ్యవస్థ పిల్లలకు రోల్ మోడల్‎గా నిలుస్తుందని చైనా భావిస్తుంది.

  చైనా సామ్యవాదంపై షీ జిన్‌పింగ్‌ ఆలోచనలను పుస్తకాల్లో బోధించనున్నారు. దేశం సంకల్పాన్ని ప్రతిబింబించేలా పాఠ్యపుస్తకాలు ఉంటాయని, భవిష్యత్తులో ప్రతిభను పెంపొందించే దిశ, దాని నాణ్యతను ఇవి ప్రభావితం చేయనున్నాయని జాతీయ పాఠ్యపుస్తకాల కమిటీ వెల్లడించింది. ఈ కొత్త వ్యవస్థను చైనా మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ ఆకాశానికెత్తింది. ప్రాథమిక స్థాయిలో దేశం, సీపీసీ, సామ్యవాదాల పట్ల ప్రేమను కలిగించేలా పాఠ్యపుస్తకాలు ఉంటాయని తెలిపింది. మాధ్యమిక స్థాయిలో విద్యార్థులు తమవైన రాజకీయ అభిప్రాయాలను ఏర్పర్చుకునేలా ప్రోత్సాహం అందిస్తాయని, కళాశాల స్థాయిలో సైద్ధాంతిక ఆలోచనలపై చర్చిస్తాయని పేర్కొంది.

  చైనాలో తన ఏకఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మావో అడుగుజాడల్లో నడుస్తున్న నియంతృత్వ నేత షీ జిన్‎పింగ్.. భవిష్యత్తులోనూ తన పట్టును కొనసాగించేలా పావులు కదుపుతున్నాడు. ఇందులో భాగంగానే.. చిన్నపిల్లల మెదళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే కమ్యూనిస్టు భావజాలాన్ని నింపుతున్నాడు.

  జిన్‎పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తైవాన్, హాంకాంగ్‎లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. వీగర్ ముస్లింల హక్కులు కాలరాస్తున్నారు. సరిహద్దుల్లో విస్తరవాదాన్ని పెంచిపోషిస్తున్నాడు జిన్‎పింగ్. మరి, ఇన్ని నియంతృత్వ పోకడలున్న ఓ వ్యక్తి గురించి.. పిల్లల మెదళ్లలో విషం ఎక్కిస్తున్నా.. కనీసం ఇది తప్పు కదా..! అని మాట్లాడేందుకు మనదగ్గర ఓ కమ్యూనిస్టు మేధావి కూడా ముందుకు రాడు.

  ప్రజస్వామ్యానికి, నియంత్రుత్వానికి చాలా తేడావుంటుంది. ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు, సామ్యవాద చైనాకు ఎంతో తేడా వుంది. కమ్యూనిస్టు పార్టీ కనుసన్నల్లో అక్కడ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. కానీ, అక్కడి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తీసుకొచ్చి ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఆపాదిస్తూ.. కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడి కమ్యూనిస్టులు. అశేషభారతావని మద్దతుతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మోదీ.. ఒకవేళ తన జీవిత చరిత్రను పాఠశాలల్లో పెట్టిస్తే.. ఇక్కడి లెఫ్ట్ మేధావులు, ల్యూటియెన్స్ మీడియా ఊరుకుంటుందా..? చేతనైనంత దుష్ప్రచారం చేస్తుంది.

  కానీ, మన కమ్యూనిస్టుల ఓన్లీ ఫాదర్ ల్యాండ్ అయిన చైనాలో జిన్‎పింగ్ చేస్తున్న అరాచకాలపై పల్లెత్తు మాటమాట్లాడరు. విలువలకు విఘాతం అని వాదిస్తారు. ప్రజాధనం లూటీ అవుతుందని గగ్గోలు పెడతారు. స్వీయ ప్రచారం చేసుకుంటున్నారని రాద్ధాంతం చేస్తారు. మరి, వారు ఆరాధించే నియంతృత్వ నాయకుడు మాత్రం ఏకంగా తన జీవిత చరిత్రనే పిల్లలకు బోధిస్తే మాత్రం అది తప్పు కనపడదు. ఇది లెఫ్ట్ లిబరల్ వాదుల ద్వంద్వవైఖరికి నిదర్శనం.

  Trending Stories

  Related Stories