డ్రాగన్ కంట్రీ దొంగచాటు వ్యవహారాలకు తెర తీసినట్లు తెలుస్తోంది. చైనా తన వద్ద ఉన్న బెలూన్లతో చాలా దేశాలపై నిఘా పెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. డ్రాగన్ దేశ బెలూన్లు ఇండియాను కూడా టార్గెట్ చేసినట్లు ఓ మీడియా కథనం వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం అమెరికా గగనతలంలో ఎగురుతున్న చైనా బెలూన్‌ను ఆ దేశం పేల్చివేసింది. ఈ నేపథ్యంలో తమ మిత్ర దేశాలకు అగ్రరాజ్యం అమెరికా కొన్ని రహస్య అంశాలను తెలియజేసింది. ఆ మీటింగ్‌లో ఇండియాతో పాటు సుమారు 40 దేశాలకు చెందిన ఎంబసీ అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ విదేశాంగ మంత్రి వెండీ షేర్‌మాన్ వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో అనేక విషయాలను వెల్లడించారు.
చైనా నిఘా బెలూన్ అనేక సంవత్సరాల పాటు హైనన్ ప్రావిన్సులో ఆపరేషన్‌లో ఉందని.. అనేక దేశాల సైనిక సమాచారాన్ని ఆ బెలూన్లు సేకరించినట్లు అమెరికా తెలిపింది. జపాన్, ఇండియా, వియత్నాం, తైవాన్, పిలిప్పీన్స్‌లో ఉన్న వ్యూహాత్మక కీలక ప్రాంతాలను ఆ బెలూన్లు టార్గెట్ చేసినట్లు ద వాషింగ్టన్ పోస్టు తన కథనంలో చెప్పింది. రక్షణ, ఇంటెలిజెన్స్ అధికారులతో నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా ఆ రిపోర్టును తయారు చేశారు.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోని వైమానిక దళం ఆ నిఘా బెలూన్లను ఆపరేట్ చేస్తోందని, ఇవి అయిదు ఖండాలపై కనిపించినట్లు ఆ కథనంలో తెలిపారు. నిఘా వ్యవహారాల కోసం ఇలాంటి బెలూన్లను చైనా తయారు చేసిందని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు తెలిపింది. ఇటీవల సమయంలో హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువామ్‌లపై నాలుగు బెలూన్లు కనిపించినట్లు ఆ కథనంలో వెల్లడించారు.
మరోవైపు భారత్-చైనాల మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదంపై ఇండియన్ ఆర్మీ డ్రాగన్ కంట్రీకీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. లడఖ్ సెక్టార్‌లో చైనా దూకుడు చర్యలకు పాల్పడితే భారత్ ధీటుగా స్పందించేందుకు రెడీగా ఉందని భారత సైన్యం స్పష్టం చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్‌తో పాటు పలు చర్యలు చేపడుతున్నామని.. దేశ సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఆర్మీ వెల్లడించింది. ఎల్ఏసీ వద్ద యథాతథ స్ధితిని మార్చేందుకు చైనా దళాలకు భారత్ సైన్యం కళ్లెం వేసిందని.. ధీటుగా స్పందించి అడ్డుకట్ట వేసిందని ఆర్మీ నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఎల్ఏసీ వద్ద చైనా ఎలాంటి దుందుడుకు చర్యలకు తెగబడినా త్రివిధ దళాల మధ్య సమన్వయంతో మన సాయుధ బలగాలు డ్రాగన్ చర్యలను దీటుగా తిప్పికొడతాయని చెప్పారు. ఎల్ఏసీపై నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు దౌత్య స్ధాయిలో, అధికారుల స్ధాయిలో చేపట్టాల్సిన చర్యలూ కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎల్ఏసీలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లు, ముప్పును పసిగడుతూ ఎదుర్కొనేందుకు నార్తన్ కమాండ్ సంసిద్దంగా ఉందని లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది తెలిపారు. జాతి ప్రజాస్వామిక పునాదులు, సంప్రదాయాలను కాపాడుతూ దేశ సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. తాము నిరంతరం అప్రమత్తంగా ఉండటంతో పాటు అన్ని పరిణామాలను పసిగడుతూ జాతి ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఐతే ఇలాంటి తరుణంలో చైనా స్పై బెలూన్లు భారత్ పై కూడా నిఘా పెట్టాయనే విషయం వెలుగులోకి రావటంతో కేంద్రం అప్రమత్తమైంది.