బోర్డర్‎కు 4 కి.మీ. దూరంలో చైనా నిర్మాణాలు

0
683

వెనక్కి తగ్గినట్టే తగ్గి నక్క వినయాలు ప్రదర్శిస్తున్న చైనా.. భారత సరిహద్దుల్లో కుట్రలను ఏమాత్రం తగ్గించలేదు సరికదా ఇంకా పెంచేసింది. తాజాగా బయటపడిన శాటిలైట్ ఫొటోలు డ్రాగన్ వక్రబుద్ధిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. డోక్లామ్, గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత చైనా కుతంత్రాలకు గట్టిగా సమాధానం చెప్పింది. సరిహద్దుల్లో భద్రతను పెంచి.. డ్రాగన్ ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. అటు, అంతర్జాతీయంగా కూడా మద్దతు కూడగట్టింది. దీంతో ఇటీవల చైనా కాస్త తగ్గింది. ఆర్మీ అధికారుల చర్చలతో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. అయితే, వెనక్కి తగ్గినట్టే తగ్గిన చైనా మరోసారి తన వికృతరూపాన్ని ప్రదర్శించింది. బోర్డర్ కు కూతవేటు దూరంలో అక్రమ నిర్మాణాలను చేపట్టింది.

మొన్నటికి మొన్న అరుణాచల్ సరిహద్దుల్లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా ఆర్మీ.. ఇప్పుడు సిక్కి బోర్డర్ పై కన్నేసింది. నాకు లా పాస్ వద్ద వివాదాస్పద ప్రదేశాల్లో కొత్తగా ఆర్మీ పోస్టులు, రోడ్లను నిర్మిస్తోంది. అ పోస్టులు భారత సరిహద్దులకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజ్ లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో డోక్లామ్, నాకు లా ప్రాంతాల్లోనే ఇరు దేశాల సైన్యం మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లోని డోక్లామ్ ప్రాంతాన్ని ట్రై జంక్షన్‌గా పిలుస్తారు.

ఈ ప్రాంతంలోని గ్రౌండ్ జీరో వద్ద 2017లో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణలు జరిగాయి. 2019లో డోక్లామ్ లో ఇరు దేశాల సైన్యం మధ్య తోపులాట జరిగింది. ఇక, గల్వాన్ వద్ద 2020లో ఏకంగా చైనా ఆర్మీ అక్రమంగా భారత భూభాగంలోకి చొచ్చుకురావడంతో భారత జవాన్లు ప్రతిఘటించారు. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా.. 45 మందికి పైగా డ్రాగన్ సైనికులు చనిపోయారు. అప్పటి నుంచి డ్రాగన్ కవ్వింపులు ఎక్కువయ్యాయి. దీనికి భారత్ కూడా దీటుగా సమాధానం చెబుతూవస్తోంది. సరిహద్దుల్లో భద్రతను పెంచి డ్రాగన్ ఎత్తులను చిత్తు చేసింది. అటు అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి తీసుకురావడంతో డ్రాగన్ వెనక్కితగ్గింది. ఇటీవలే రెండు దేశాల ఆర్మీ అధికారులు చర్చించుకుని.. బలగాలను ఉపసంహరించుకున్నారు. అయితే, నక్కజిత్తుల చైనా మాత్రం వెనక్కి వెళ్లినట్టే వెళ్లి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో ఏకంగా గ్రామాలనే నిర్మిస్తోంది.

తాజాగా వెలుగుచూసిన శాటిలైట్ ఇమేజ్ లలో నాకు లా ప్రాంతానికి దగ్గరల్లో కొత్తగా ఆర్మీ పోస్టులను నిర్మించింది. క్యాపెల్లా స్పేస్‌ కంపెనీకి చెందిన సింథటిక్ అపెచ్యుర్ రాడార్, ప్లానెట్ ల్యాబ్స్ చిత్రీకరించిన శాటిలైట్ ఇమేజ్ లలో ఈ ఆర్మీ పోస్టులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 12వ తేదీన రాడార్ ఈ ఫొటోలను తీసింది. చైనా మిలటరీ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగుతున్న విషయాన్ని బట్టబయలు చేసింది. కొత్త శిబిరాలు, పోస్టులు, రోడ్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నట్లు శాటిలైట్ ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఆ ప్రదేశమంతా గ్రౌండ్ జీరో కిందికి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 12న శాటిలైట్, రాడార్ తీసిన ఫొటోలను బట్టి చూస్తే.. గతేడాది సెప్టెంబర్‌లో ఖాళీగా కనిపించిన నకు లా పాస్ సమీపంలోని పలు ప్రాంతాల్లో.. కొత్తగా చైనా ఆర్మీ పోస్టులు, నివాసాలు ఏర్పాటు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అటు, ఆ పోస్టులకు చేరుకోవడానికి, భారీ వాహనాలు రాకపోకలు సాగించేలా రోడ్లను నిర్మిస్తోంది చైనా.

అయితే, ఇవి రాత్రికి రాత్రి వెలిసిన నిర్మాణాలు కాదాని.. వీటిని ఏడాదికాలంగా నిర్మిస్తున్నట్టు నిపుణులు అంచనావేస్తున్నారు. అమెరికాకు చెందిన జియోస్పేషియల్ అనలిటిక్స్ కంపెనీ హాక్ఐ 360.. గత ఏడాది తొలిసారిగా సరిహద్దుల్లో చైనా ఆర్మీ పోస్టు ఏర్పాటైనట్లు నిర్ధారించింది. అది కాస్తా మరింత విస్తృతమైంది. దీంతో లద్దాక్ వాస్తవాధీన రేఖ సమీపంలోని గల్వాన్ వ్యాలీ తరహా అక్రమ చొరబాట్లకు చైనా సైనికులు పూనుకునే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దులకు సమీపంలోని హసిమారా ఎయిర్ బేస్ స్టేసన్‌లో అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను మోహరించే అవకాశాలుట్లు సమాచారం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here