ఆ కుర్రాడిని భారత్ కు అప్పగించిన చైనా..!

0
726

గురువారం నాడు చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అరుణాచల్ ప్రదేశ్ లో తప్పిపోయిన 19 ఏళ్ల బాలుడు మిరామ్ టారోన్‌ను భారత సైన్యానికి అప్పగించింది. యువకుడు తిరిగి భారత్ కు వచ్చినట్లు ధృవీకరిస్తూ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో ఫోటోను పోస్టు చేశారు. మిరామ్ కు పలు వైద్య పరీక్షలను అధికారులు నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని WACHA-DAMAI ఇంటరాక్షన్ పాయింట్ వద్ద చైనా సైనికులు మిరామ్ టారోన్‌ను భారత సైన్యానికి అప్పగించినట్లు కిరణ్ రిజిజు తెలియజేశారు.

రిపబ్లిక్ డే రోజున భారత సైన్యం చైనీస్ PLAతో హాట్‌లైన్ చర్చలు జరిపిన ఒక రోజు తర్వాత కుర్రాడిని భారత్ కు అప్పగించడం జరిగింది. PLA సానుకూలంగా స్పందించింది, అవసరమైన లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత సూచించిన ప్రదేశంలో అతడిని అప్పగిస్తామని తెలిపింది. జనవరి 18న సియాంగ్‌కు చెందిన మిరామ్ టారోన్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి కనిపించకుండా పోయాడు. అతన్ని చైనా మిలిటరీ కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. టారోన్ స్నేహితుడు జానీ యాయింగ్ తప్పించుకుని, PLA తన స్నేహితుడిని కిడ్నాప్ చేసినట్లు అధికారులకు చెప్పాడని రాష్ట్ర ఎంపీ తపిర్ గావో తెలిపారు. సియుంగ్లా ప్రాంతంలోని లుంగ్టా జోర్ ప్రాంతం నుండి పిఎల్‌ఎ టారోన్ ను అపహరించినట్లు తపిర్ గావో చెప్పారు. టార‌న్ స్నేహితుడు జానీ యీయింగ్ పీఎల్ఏ ద‌ళాల నుంచి త‌ప్పించుకున్నాడ‌ని, ఆ కుర్రాడు ఇచ్చిన స‌మాచారంతో టార‌న్ కిడ్నాప్‌కు గురైన‌ట్లు తెలుస్తోంద‌ని ఎంపీ తాపిర్ తెలిపారు. తార‌న్‌, యాయింగ్‌లు స్థానికంగా వేట‌కు వెళ్లేవారని.. భార‌త్‌లోకి సాంగ్‌పో న‌ది ప్ర‌వేశించే ప్రాంతంలో అప‌హ‌ర‌ణ ఘ‌ట‌న చోటుచేసుకుందని గావో తన ట్వీట్స్ లో తెలిపారు.

చైనా అపహరణకు పాల్పడినట్లు ఆరోపణలు రాగా.. వాటిని చైనా PLA ఖండించింది. సరిహద్దు ప్రాంతంలో ఆ కుర్రాడు తప్పిపోయి తమ భూభాగంలో కనుగొనబడ్డాడని ధృవీకరించింది. భారత సైన్యం తీసుకున్న చర్యల తర్వాత.. జనవరి 20న చైనా మీరామ్ టారోన్ గుర్తింపును నిర్ధారించడానికి వివరాలను కోరింది. అతన్ని గుర్తించిన తర్వాత తిరిగి భారతదేశానికి తరలించడానికి అంగీకరించింది. టారోన్ స్వదేశానికి రావడానికి భారత, చైనా సైన్యాలు జనవరి 26వ తేదీన సమయం మరియు స్థలాన్ని ఖరారు చేశాయి. 27వ తేదీ చైనా సైన్యం భారత్ కు మిరామ్ ను పంపించింది.