బెదిరించేశారు.. ఆ కమ్యూనిస్టు నేత టెన్నిస్ స్టార్ పై ఎటువంటి అత్యాచారానికి పాల్పడలేదట

0
892

పెంగ్ షుయ్.. టెన్నిస్ స్టార్ ప్లేయర్ అదృశ్యంపై ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆమె అదృశ్యం కావడానికి ముందు ఆమె చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిపై సంచలన ఆరోపణలు చేశారు. అతడు తనను బెదిరించి.. లైంగికంగా దాడి చేశాడని.. అత్యాచారం కూడా చేశాడని ఆమె ఆరోపించారు. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పెంగ్ షుయ్ నవంబర్‌ 2న సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే వెంటనే ఆ పోస్టును డిలీట్‌ చేసింది. అయితే ఆమె ఏరోజైతే పోస్ట్‌ డిలీట్‌ చేసిందో ఆరోజు నుంచి కనిపించకుండా పోయింది. ఈ ఆరోపణలు చేసిన తర్వాత ఆమె కనపడకుండా పోయింది. పెంగ్ షుయ్‌ని చైనా ప్రభుత్వమే ఏదో చేసిందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత కొద్దిరోజుల తర్వాత ఆమె అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బాచ్‌తో పెంగ్ షుయ్ అరగంట పాటు వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. తనకు ఏమీ కాలేదని పెంగ్ షుయ్ చెప్పుకొచ్చింది. కానీ పెంగ్ షుయ్ వీడియో కాల్ లో మాట్లాడినా.. ప్రపంచం మాత్రం చైనాను అసలు నమ్మలేదు. పెంగ్ షుయ్ అదృశ్యం అనంతరం పలువురు టెన్నిస్ స్టార్స్ ఆమెను ఎక్కడ ఉన్నా వెంటనే ప్రజల ముందుకు తీసుకొని రావాలని కోరారు. డబ్ల్యూటీఏ చైర్మన్ స్టీవ్ సైమన్ కూడా వెంటనే ఆమె అదృశ్యంపై విచారణ జరపాలని చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెంగ్‌ షుయ్ ఆచూకీ చెప్పాల్సిందేనంటూ వుమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌(WTA) చైనాకు అల్టిమేటం జారీ చేసింది. ఆమె ఆచూకీ చెప్పేవరకు చైనాలో జరగాల్సిన అంతర్జాతీయ పోటీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి డబ్ల్యూటీఏ చైనాకు షాక్‌ ఇచ్చింది.

అయితే ఇప్పుడు పెంగ్ షుయ్ మాట మార్చిందని చైనీస్ మీడియా ప్రచారం చేస్తోంది. డిసెంబర్ 19న పెంగ్ షుయ్ తనపై ఎవరూ లైంగిక వేధింపులకు పాల్పడ లేదని తెలిపిందని చైనా మీడియా పేర్కొంది. సింగపూర్‌కు చెందిన చైనీస్ భాషా వార్తాపత్రిక లియన్హే జావోబావోతో క్లుప్తంగా 8 నిమిషాల ఇంటర్వ్యూలో.. పెంగ్ బీజింగ్‌లోని తన ఇంట్లో నివాసం ఉంటున్నానని, తన కదలికలపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. ఆదివారం ఇంటర్వ్యూ ప్రచురించబడటానికి ముందు, గ్లోబల్ టైమ్స్ రిపోర్టర్ అయిన చెన్ క్వింగ్‌కింగ్, ప్రసిద్ధ చైనీస్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి యావో మింగ్‌తో మాట్లాడుతున్న పెంగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్వీట్ చేశారు. ఈ వీడియో తనకు “ఫ్రెండ్” ద్వారా పంపబడిందని చెన్ పేర్కొన్నారు. షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వీడియో తీసినట్లు తెలిపారు. రిపోర్టర్ చెన్ క్వింగ్‌కింగ్ చైనా ప్రభుత్వ మద్దతుదారురాలు అనే విమర్శలు చాలా రోజుల నుండే ఉన్నాయనుకోండి.

చెన్ పోస్ట్ చేసిన ఫోటోలో, పెంగ్ యావో, ఒలింపిక్ సెయిలింగ్ ఛాంపియన్ జు లిజియా మరియు రిటైర్డ్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ వాంగ్ లికిన్‌తో కనిపించింది. “FIS క్రాస్ కంట్రీ స్కీయింగ్ చైనా సిటీ టూర్” అని రాసి ఉన్న బ్యానర్ వారి పక్కన ఉంది.

మహిళా టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యుటిఏ) ప్రెసిడెంట్ స్టీవ్ సైమన్‌కి తాను క్షేమంగా ఉన్నానని చెబుతూ ఆమె ఈమెయిల్ పంపింది. తనను ఎవరూ లైంగిక వేధింపులకు గురిచేయలేదని చెప్పింది. “మొదట, నేను చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను: నాపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నేను ఎవరినీ నిందిస్తూ ఏమీ చెప్పలేదు లేదా వ్రాయలేదు. నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను” అని తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో కూడా ఆమె స్వేచ్ఛగా ఉన్నానని తెలిపింది. అయితే సమాధానమిచ్చేటప్పుడు, ఆమె ఒకింత తడబాటుకు గురైనట్లు నివేదిక పేర్కొంది. తన క్షేమం గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని పెంగ్ షుయ్ చెప్పుకొచ్చింది.

పెంగ్ షుయ్ ఎన్ని చెబుతున్నా కూడా ఆమె క్షేమంగా ఉందనే విషయంపై ఎవరూ నమ్మడం లేదు. ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఇటీవలి ప్రకటనలో పెంగ్ షుయ్ బయటకు వచ్చినా కూడా ఆందోళనలను తగ్గించలేదని తెలిపింది. “ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలపై సెన్సార్‌షిప్ లేకుండా పూర్తి, న్యాయమైన మరియు పారదర్శక దర్యాప్తు కోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.” అని తెలిపింది. అయితే ఆమెను బెదిరించిన చైనా ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయిస్తూ ఉన్నారని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు.