35 సంవత్సరాల వయసు ఉన్న చైనా దేశస్థుడిని భారత, బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం అధికారులు అడ్డుకున్నారు. అతడి కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని పశ్చిమ బెంగాల్ మాల్డా జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
భద్రతా అధికారులు అతడిని హాన్ జున్వేగా గుర్తించారు. చైనా పాస్‌పోర్ట్, బంగ్లాదేశ్ వీసా, ల్యాప్‌టాప్ మరియు మూడు సిమ్ కార్డులు అతడి దగ్గర గుర్తించారు. “ఉదయం 7 గంటలకు అతన్ని అడ్డుకున్నామని.. కలియాచక్ పోస్టుకు అతడిని తీసుకువచ్చామని.. ఇతర ఏజెన్సీలకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని ప్రశ్నిస్తున్నారు” అని ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. చైనా చొరబాటుదారుడికి ఇంగ్లీష్ తెలియదని.. దీంతో అతనితో మొదట్లో విచారించడానికి ఇబ్బంది పడ్డారని ఆ అధికారి తెలిపారు. మాండరిన్ తెలిసిన ఒక భద్రతా అధికారిని పిలిపించి విచారించారు.. అతన్ని ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. మాల్డా బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఈ ప్రాంతం తరచుగా మాదకద్రవ్యాలు, ఆయుధాలు, పశువులు, వలసదారుల అక్రమ రవాణాకు ఉపయోగించబడుతుంది. భారత సైన్యం ఈ ప్రాంతం విషయంలో చాలా అలర్ట్ గా ఉంటుంది. మాల్డా ప్రాంతంలో భారత-బంగ్లాదేశ్ సరిహద్దును బిఎస్ఎఫ్ దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్ గార్డ్స్ కాపలా కాస్తూ ఉంటారు.
హాన్ జున్వే ఒక్కడే వచ్చాడా లేదా ఇంకొంత మంది భారత భూభాగంలోకి చొరబడ్డారా అన్నది భద్రతా సంస్థలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. బంగ్లాదేశ్ కు ఎందుకు వెళ్ళాడో కారణం చెప్పాలని హాన్ జున్వేను ఏజెన్సీలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ప్రశ్నించడం ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని అని మరొక అధికారి తెలిపారు.