చైనాలో ఎప్పుడు.. ఎవరు కనిపించకపోతారో తెలియని పరిస్థితి. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రముఖులు ఇప్పటికే ఎంతో మంది మిస్ అయ్యారు. మాజీ ప్రభుత్వ అధికారులు.. ఇలా కనిపించకుండా పోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే రెండు వారాలుగా చైనీస్ డిఫెన్స్ మినిస్టర్ కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రెండు వారాలుగా బహిరంగంగా కనిపించడం లేదు చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు. ఈ విషయాన్ని అమెరికా బయటపెట్టింది. చైనా ప్రభుత్వం అతడి మీద విచారణకు ఆదేశించినట్లు అమెరికా ప్రభుత్వం విశ్వసిస్తోంది. లీ షాంగ్‌ఫు ఇటీవలే రక్షణ మంత్రిగా బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారని అంటున్నారు. 65 సంవత్సరాల లీ షాంగ్‌ఫు ఇటీవలి వారాల్లో వియత్నామీస్, సింగపూర్ రక్షణ నాయకులతో సమావేశాలలో పాల్గొనలేకపోయారని తెలుస్తోంది. లీ షాంగ్‌ఫు చివరిసారిగా ఆగస్టు 29న బీజింగ్‌లో ఆఫ్రికన్ దేశాలతో భద్రతా ఫోరమ్‌లో కీలకోపన్యాసం చేశారు.లీ షాంగ్‌ఫు చైనా ప్రభుత్వ విచారణను ఎదుర్కొంటూ ఉండొచ్చని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ కూడా జూలైలో కనిపించకుండా పోయారు. రెండు నెలల క్రితం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు జనరళ్లను తొలగించారు.
జపాన్ లో అమెరికా రాయబారి రెహమాన్ ఎమాన్యుయేల్ ట్విట్టర్ లో స్పందిస్తూ ‘‘ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ కేబినెట్ విభాగం అగాథా క్రిస్టీ నవల అయిన ‘అండ్ దెన్ దేర్ వర్ నన్’ను తలపిస్తోంది. మొదట చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ అదృశ్యమయ్యారు. తర్వాత రాకెట్ ఫోర్స్ కమాండర్లు కనిపించకుండా పోయారు. ఇప్పుడు రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు రెండు వారాల నుంచి ప్రజలకు కనిపించడం లేదు’’ అని ట్వీట్ చేశారు. లీ షాంగ్‌ఫు ను హౌస్ అరెస్ట్ చేసినట్లు కూడా భావిస్తున్నారు. చైనాలో ప్రముఖులు అదృశ్యం కావడం కొత్తేమీ కాదు. చైనాకు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా కూడా రెండేళ్లపాటు కనిపించకుండా పోయారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నియంతృత్వాన్ని ఎవరైనా ఎదిరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది.