More

    ‘వెయ్యి ఇసుక రేణువుల వ్యూహం’
    – డ్రాగన్ నిఘాడేగల స్వైర విహారం

    ‘‘మధువు మాటువేస్తే రహస్యం రచ్చకెక్కిందని’’ ‘‘హానీ ట్రాప్’’ కు తెలుగు అనువాదం చేశారు చారిత్రక నవలల అనువాద చక్రవర్తి తెన్నేటి సూరి. గూఢచర్య కుట్రల్లో ప్రముఖంగా వినిపించే పదబంధం  ‘వలపు వల’. యవ్వనాన్ని ఎరగావేసి, ఏకాంతంలో ముంచి, అంతర్గత రహస్యాలను తమ తమ దేశాల నిఘా సంస్థలకు చేరవేయడం ఈనాటిది కాదు.

    బికారిగా వీధుల్లో బిచ్చిమెత్తిన మింగ్ వంశపు రాజు యువాన్ జంగ్ అఖండ చైనా సామ్రాజ్యాధిపతి  అయ్యాడంటే కారణం సౌందర్యాన్ని ఎరగా వేయడమే! క్రూరమైన యువాన్ మంగోల్ రాచరికంలో దారుణ అవమానాలను అనుభవించాడు యువాన్ జంగ్. చైనా క్రూరత్వం పరాకాష్ఠకు చేరడానికి కారణం మంగోల్ రాచరికంలో పొందిన అవమానమే అంటారు చరిత్రకారులు!

    తూర్పు, పశ్చిమ యూరప్ దేశాలూ, ప్రాచీన పర్షియా, గ్రీకు, రోమ్, బైజాంటియన్, ఇస్లామిక్ అరబ్బు దేశాలతో సహా మంగోల్ రాజ్యాన్నీ అట్టుడికేలా చేసింది రహస్యమే!! గోప్యత దౌత్యనికీ-యుద్ధానికీ మధ్య చెరపలేని హద్దును గీసింది. లోపాయికారితనమే లోకం పోకడ అని ప్రాచీన భారత దౌత్య చరిత్ర నిరూపించింది. కౌటిల్యుడు రాసింది అర్థ శాస్త్రం మాత్రమే కాదు. దౌత్య శాస్త్రం కూడా.  

    ఇంతకూ నిఘా వ్యవస్థల మూలాలేంటి? చైనా మనదేశంలో చేస్తున్న గూఢచర్యమేంటి? ఆఫ్ఘన్ కొండల్లో డ్రాగన్ గూఢచారులు ఏం చేస్తున్నారు? వారిని చైనా ఎలా విడిపించుకుంది? భారత్ వారి గుట్టును ఎలా కనిపెట్టింది? ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ కు సంబంధించిన కీలక రహస్యాలు చైనా నిజంగానే తెలుసుకుందా? బ్రిటీష్ అధికారులకు చైనా విసిరిన ‘వలపు వల’ చివరాఖరుకు ఏమైంది? అమెరికా రాజకీయాల్లో చైనా ‘హానీ ట్రాప్’ ఎలా సంచలనం సృష్టించింది?

    ఇలాంటి కీలక ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చైనా కంపెనీలో అంతర్గతంగా ఒక విభాగం పని చేస్తుంటుంది. ఇది చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీకి,  దాని ఆధ్వర్యంలో పనిచే సెంట్రల్ మిలిటరీ కమిషన్…ఈ రెంటి కనుసన్నల్లో నిఘావర్గాలు పనిచేస్తుంటాయి.  ఆయా సంస్థలు తమ దేశ రాజకీయ విధానాలకు అనుగుణంగా నడుస్తున్నాయా? లేదా అనేది ఈ విభాగం నిత్యం పర్యవేక్షిస్తుంటుంది.

    ఈ తరహా ముసుగులో చైనా కమ్యూనిస్టు పార్టీ బ్రిటన్‌లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తోందని MI5 తేల్చింది. అమెరికాలో స్లాల్ వెల్ కు క్రిస్టినా ఫ్యాంగ్ అనే చైనా యువతిని ఎరగా వేసింది డ్రాగన్. క్రిస్టినా ఫ్యాంగ్ హానీ ట్రాప్ వ్యవహారం అమెరికాలో పెద్ద దుమారానికి కారణమైంది.

    చైనా సంప్రదాయ రీతిలో నిఘా వ్యవస్థను నిర్వహించదు. వృత్తిపరమైన గూఢచారులను నియమించదు. అందుకు భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ హోదాల్లో పనిచేసే అకెడమీషీయన్లు, విద్యార్థులు, టూరిస్టులు, వివిధ చైనా కంపెనీలను తన నిఘా కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటుంది.

    ఒకే అంశానికి సంబంధించి అనేక మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. చైనా నిఘా పనితీరును పరిశీలించిన ఎఫ్.బీ.ఐ మాజీ అధికారి పౌల్ డీ మూర్ చైనా గూఢచర్యాన్ని‘వెయ్యి ఇసుక రేణువుల వ్యూహం’గా నిర్వచించారు.

    అమెరికా అమ్ములపొదిలోని అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వార్ హెడ్ W-88 రహస్యాల కోసం చైనా అందాన్నీ-డబ్బునీ ఏకకాలంలో ఎరగా వేసి అసలు విషయాన్ని తెలుసుకున్న వ్యవహారం అమెరికా చరిత్రలో ప్రముఖమైంది.  

    చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం ప్రపంచమంతా ఉంటుంది. చైనాకు సంబంధించిన వ్యాపారం, రాజకీయాలు వేర్వేరు కాదు.  గూఢచర్యాన్నీ, దౌత్యాన్నీ, విదేశాంగ విధానాన్నీ, సైనిక వ్యూహాన్నీ, ఎత్తుగడలనూ కలిపి ఓ  పంచధాతు వ్యూహాన్ని రూపొందిస్తుంది డ్రాగన్. ఏమార్చే ఎత్తుగడలే అంతిమంగా విజయం సాధిస్తాయన్న సున్ జూ యుద్ధకళా సూత్రాన్ని చైనా తు.చ తప్పకుండా పాటిస్తుంది.

    చైనా  కమ్యూనిస్టు పార్టీకి 9 కోట్ల 30 లక్షలమందికి పైగా సభ్యులున్నారు. వారిలో చాలామంది వివిధ దేశాలలోని సంస్థల్లో పనిచేస్తుంటారు. రహస్యాలు సేకరించడానికి ముఖ్యంగా టెక్నాలజీ, టెలికాం రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి చేరవేయడంలో వీరే కీలకం.  విదేశాల్లోని  పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే వారంతా వీరి ఏజెంట్లు. ఆయా దేశాలలోని అధికారులను, రాజకీయ నాయకులను మచ్చిక చేసుకునే పనంతా ఈ ఏజెంట్ల పనే!

    చైనా తన వ్యూహాల అమలులో అనేక ఎత్తుగడలు వేస్తుంది. తమ లక్ష్యం చైనాయేతరుడైన అధికారి అయితే పెద్ద మొత్తంలో బహుమతుల రూపంలో అతన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది మొదటి తరహా విధానం. ఆ తరువాత అనేక రకాలుగా ప్రలోభ పెట్టడం, బెదిరించడం షరా మామూలే!

    పాశ్చాత్య దేశాల వారికి చైనాలో పెద్దపెద్ద బిజినెస్‌ మీటింగ్‌లకు ఆహ్వానం పంపడం, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు ధన సాయం చేయడం, లేదంటే ఏ కంపెనీలోనో నాన్‌- ఎగ్జిక్యుటివ్‌ బోర్డ్‌ మెంబర్‌ పదవిని కట్టబెట్టడం, ఒక్కోసారి వారి జీవితమే మారిపోయేంత డబ్బును ఎరగా వేయడంలాంటి పనులు చేస్తుంటాయి. గత పది, పదిహేనేళ్లుగా కీలకమైన విదేశీ వ్యక్తులను భారీ నజరానాలతో ఆకట్టుకునే పద్ధతి క్రమంగా పెరుగుతూ వచ్చినట్లు తేలింది.

    దేశంలో ఉన్న వారి కుటుంబం సభ్యులపై ఒత్తిడి తీసుకురావడం, బ్లాక్‌మెయిల్ చేయడం, విదేశీవ్యాపారులకు అందాన్ని ఎరగా వేయడం సర్వసాధారణం. ఆకర్షణీయమైన మహిళల వల విసిరుతుంది. వారితో సంభాషణలు, ఇతర వ్యవహారాలను రికార్డు చేసి.. బ్లాక్ మెయిల్ చేస్తారు. సొంత దేశంలో హనీట్రాప్‌ను సెట్‌చేయడంలో చైనా ప్రభుత్వం నేర్పరి.

    ఇలాంటివన్నీ చైనా రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. కాకపోతే ఇవన్నీ కేంద్రీకృత విధానంలో కాకుండా, వివిధ రాష్ట్రాల రక్షణ విభాగాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కంపెనీల వ్యవహారాలను విడివిడిగా పర్యవేక్షిస్తుంటాయి.

    అమెరికా వ్యవహారాలను షాంఘై బ్యూరో చూసుకుంటే , రష్యా వ్యవహారాలను బీజింగ్‌ బ్యూరో.. జపాన్‌, కొరియా వ్యవహారాలను టియాంజిన్‌ బ్యూరో చూసుకుంటాయి. ఇలా ఒక్కొక్క బ్యూరో ఒక్కో దేశ వ్యవహారాలు చూస్తుంది. సమాచార సేకరణ కోసం చైనా ప్రభుత్వం తన అధికారాలన్నింటినీ ఉపయోగించుకుంటుంది.

    భారీ సైబర్‌ గూఢచర్యం దగ్గర్నుంచి, పారిశ్రామిక నిపుణులను లోబరుచుకునే వరకు, వివిధ మార్గాలలో ఇది కొనసాగుతుంది. రష్యాతోపాటు, ఇప్పుడు చైనా కూడా బ్రిటన్‌కు అతి పెద్ద గూఢచర్య ముప్పుగా పరిణమిస్తుంది.

    భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రులు సహా అనేక మంది రాజకీయ నేతలపై చైనా గూఢచార సంస్థలు నిఘా వేశాయి. దేశంలో దాదాపు 10 వేల మందిపై చైనా రహస్యంగా నిఘా వేసింది. వీరిలో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ కమిటీల్లోని సభ్యులు, మాజీ సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, రక్షణ రంగ నిపుణులు, అంతరిక్ష పరిశోధకుల దగ్గర నుంచి మేయర్లు, ఎమ్మెల్యేలూ ఉన్నారు.

    అధికార, విపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీల నాయకులు వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై సైతం నిఘా ఉంచింది. షెన్‌జెన్, ఝెన్హువా అనే ఐటీ సంస్థలు ‘ఓవర్సీస్‌ ఇన్‌ఫర్మేషన్‌ డేటాబేస్‌’ పేరిట ‘హైబ్రిడ్‌ వార్‌ఫేర్‌’ అనే కార్యాన్ని వెలగబెడుతున్నాయి. ప్రముఖుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ఆన్‌లైన్‌ కార్యకలాపాల్ని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తున్నాయి.  

    భారత్‌తో పాటు ఇతర దేశాల ప్రముఖులపైనా చైనా నిఘా వేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, సహా వేలాది మంది ప్రముఖులపై చైనాకు చెందిన ఓ సంస్థ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు నిఘా సంస్థలు పసిగట్టాయి.  ప్రముఖ నేతల కుటుంబాలకు చెందిన సమాచారాన్ని సైతం ఇవి కూడగడుతున్నట్లు గుర్తించాయి.

    ఆస్ట్రేలియాలో సహా 35వేల మంది ప్రముఖులపై చైనా నిఘా వేసినట్లు ప్రముఖ పత్రిక ‘ఫైనాన్షియల్‌ రివ్యూ’ గతేడాది పేర్కొంది. ఇలా అమెరికాలో 51వేలు, ఆస్ట్రేలియాలో 35 వేలు, భారత్‌, బ్రిటన్‌లో చెరో 10 వేలు, కెనడాలో 5వేల మంది ప్రముఖులపై నిఘా వేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 24 లక్షల మంది సమాచారాన్ని సేకరించింది చైనా.  

    ఝన్హువా కంపెనీ ట్యాగ్‌ లైన్‌ని పరిశీలిస్తేనే అసలు విషయం బయటపడుతోంది. ‘ఎనీథింగ్‌ కెన్‌ బీ టర్న్‌డ్‌ ఇన్‌టూ రియాలిటీ త్రూ సోషల్‌ మీడియా’ అంటే ‘సామాజిక మాధ్యమాల ద్వారా దేన్నైనా వాస్తవంగా మార్చొచ్చు’ అన్న ట్యాగ్‌ లైన్‌తో ఈ సంస్థ పనిచేస్తున్నట్లు ఫినాన్షియల్‌ రివ్యూ పేర్కొంది. సమాచారాన్ని సేకరించి దాని ఆధారంతో సోషల్‌ మీడియాలో నకిలీ వార్తల్ని ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశమని స్పష్టంగా అర్థమవుతోంది.

    దేశాల అంతర్గత విషయాల్లో తలదూర్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా కొత్త రకం సాంకేతిక యుద్ధానికి చైనా కుట్ర పన్నుతోంది. ఈ సైట్లపై పనితీరును పరిశీలించిన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ సుదీర్ఘ ప్రశ్నావళిని సంధించింది.

    దీంతో అడ్డంగా దొరికిపోయింది సదరు సంస్థ. ఈ చర్యతో వారు అక్రమంగా సమాచారం సేకరిస్తున్నామని అంగీకరించినట్లైంది.   

    ఓపెన్‌ సోర్స్ లో ఉన్న నేతల సమాచారాన్ని వారు సేకరిస్తున్నట్లు గుర్తించామన్నారు. దీన్ని దుర్వినియోగం చేసే అవకాశమూ ఉందన్నారు. భారత్‌పై విషం చిమ్మడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా యాప్‌లపై నిషేధం విధించినట్లు వెల్లడించారు.  

    కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు పాల్పడుతోంది. భారత భూభాగంలోని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు యత్నించింది. కానీ, సరిహద్దుల్లో మన సైనికులను ఎదుర్కోలేక పోతున్న చైనా.. ఇలాంటి దొంగదారుల్ని ఎంచుకుంది. కుట్రలన్నీ విచ్ఛిన్నం కావడంతో సాంకేతిక యుద్ధానికి తెరతీసేందుకు ప్రయత్నిస్తోంది.

    అమెరికాలో ప్రముఖ పత్రిక ‘న్యూస్‌వీక్‌’ సైతం చైనా కుయుక్తుల్ని బహిర్గతం చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా దుందుడుకుగా ముందుకు వెళ్లిన చైనా వైఫల్యం మూటగట్టుకుందని కుండబద్దలు కొట్టింది. దీంతో అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భంగపాటుకు గురయ్యారని విశ్లేషించింది. నేతల ఓపెన్‌ సోర్స్‌ డేటా సైతం ప్రత్యర్థులకు కావాల్సిన కీలక సమాచారాన్ని అందించే అవకాశం ఉందన్నారు. ఇది దేశ భద్రతకు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 

    దురాక్రమణపూరిత వైఖరితో ముందుకు సాగుతున్న చైనా.. ఆయా దేశాల రక్షణ, సైనిక వ్యవస్థల సమాచారాన్ని సేకరించేందుకు వెంపర్లాడుతోంది. ఈ కీలక సమాచారాన్ని ముందే పసిగట్టి వ్యూహాత్మకంగా పై చేయి సాధించొచ్చని భావిస్తోంది.

    అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో 2020 డిసెంబరు 10 పట్టుబడిన చైనా గూఢచారులు ఈ ఏడాది జనవరిలో విడుదలయ్యారు.  చైనా విజ్ఞప్తి మేరకు  ఆఫ్ఘన్ ప్రభుత్వం 10 మందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించింది. ఈ విషయం బాహ్యప్రపంచానికి తెలియకుండా చైనా గుట్టుగా వ్యవహరించింది.

    మూడో కంటికి తెలియకుండా తన ఏజెంట్లను స్వదేశానికి రప్పించుకున్నానని డ్రాగన్ సంబరపడింది. అయితే డిసెంబర్ చివరి వారంలోనే భారత నిఘా వర్గాలు చైనా గూఢచారుల లక్ష్యాలేంటి? ఏం సేకరించారు? వారు వాడిన శాటిలైట్ ఫోన్ల వివరాలు సేకరించారు. సీఐఏ సైతం వీరికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంది.

    ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న చైనా నాలుక్కరుచుకుంది. పట్టుబడిన వారంతా కాబూల్‌లో ఉగ్రచర్యలకు పాల్పడేందుకు ప్రయత్నించారని తొలుత అఫ్గన్‌ నిఘా వర్గాలు ఆరోపించాయి. విస్తరణవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా తమకు క్షమాణ చెప్పాల్సిందేనని, లేదంటే నిందితులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    దీంతో అఫ్గాన్‌ అధికారులతో చైనా‌ చర్చలు జరిపి తమ దేశీయులను వెనక్కి రప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఏ షరతుల మేరకు వీరిని విడుదల చేశారన్నది మాత్రం బయటకు తెలియడం లేదు.  గత డిసెంబరు 10న అఫ్గానిస్థాన్‌‌ నేషనల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ జరిపిన దాడుల్లో 10 మంది చైనా పౌరులు పట్టుబడ్డారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. వీరి నుంచి పెద్ద మొత్తంలో మారణాయుధాలను, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    వీరికి చైనా గూఢచార సంస్థతో సంబంధాలున్నాయని, వీరంతా ఇక్కడ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని అఫ్గాన్‌ ప్రభుత్వం గుర్తించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి, తమ దేశంలో గూఢచర్యం, ఉగ్రవాదాలకు పాల్పడుతోందని దుయ్యబట్టింది. 

    అఫ్గాన్‌లో అమెరికా దళాల ఉపసంహరణ చేపట్టిన తర్వాత అక్కడ పట్టుకోసం చైనా ప్రయత్నిస్తోంది. గూఢచార, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నెరపుతోంది. తాజాగా పట్టుబడిన 10 మంది చైనీయులకు ఉగ్రవాద సంస్థ హక్కానీతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో అఫ్గాన్‌ అప్రమత్తమైంది. మొత్తంగా చైనా ప్రమాదం అంత సులభంగా వదిలేది కాదు. ఆసియాపై పట్టు సాధించాలని చూస్తున్న చైనా విషయంలో అప్రమత్తత అవసరమని భారత్ భావిస్తోంది. ఇండోపసిఫిక్ వ్యూహంలో సైతం డ్రాగన్ ప్రమాదాన్ని అమెరికా కచ్చితంగానే పసిగట్టింది. క్వాడ్ కూటమిని మరింత పటిష్ఠం చేస్తే తప్ప చైనాను నిలువరించలేమని జపాన్, ఆస్ట్రేలియాలు సైతం భావిస్తున్నాయి.

    Trending Stories

    Related Stories