Empty Fortress వ్యూహం..! మధ్య ఆసియాలో అగ్గిబరాటా..!!

0
830

మూడు వందల ఏళ్ల క్రితం…. మింగ్ వంశపు రాజరికం అంత్యదశలో ఉండగా ఖ్వింగ్ రాజ్యపాలన ఆరంభమైంది. ఈకాలంలోనే గుర్తు తెలియని యుద్ధనిపుణుడు ’36 స్ట్రాటజెమ్స్’ ను రూపొందించాడు. అత్యంత ప్రమాదకరమైన, తాత్కాలిక దృష్టితో రూపొందించిన ఈ 36స్ట్రాటజెమ్స్ ను చైనా ప్రస్తుతం యుద్ధం-రాజకీయం-వ్యాపారం మూడు రంగాల్లోనూ ప్రయోగించి దక్షిణ, మధ్య ఆసియాల్లోని వ్యూహాత్మక భూభాగాలను, సముద్ర మార్గాలను గుప్పిట పెట్టుకోవాలని యోచిస్తోంది.

స్ట్రాటజీ అనే ఆంగ్లపదానికి ‘వ్యూహం’ అనే సంస్కృత అనువాదం ఉంది. తెలుగు పదం లేదనే చెప్పాలి. అయితే ‘stratagem’ అనేమాటకు ట్రిక్కు, ఉచ్చు, వల, పథకం అని చెప్పుకోవచ్చు. స్ట్రాటజీ అంటే దీర్ఘకాలం కోసం రచించేది. ‘stratagem’ అంటే తాత్కాలికంగా శతృవును ఏమరపాటుకు గురిచేస్తూ తరచూ ఉచ్చులను మార్చే కౌశలం.

‘Empty Fortress’ సరికొత్త ఉచ్చు మధ్య ఆసియాతో పాటు AfPaK పిలిచే ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ లో కొత్తయుద్ధతంత్రానికి తెరతీసింది. ‘Empty Fortress’ అంటే ఏదో ఒక వ్యూహాత్మక ప్రాంతంలో తాను బలహీనంగా ఉందనే విధంగా సంకేతాలు పంపడం. దాన్ని నిజమని భావించే వైరి తన ఉచ్చులోకి ప్రవేశిస్తే అంతం చేయడం అన్నమాట.

‘Empty Fortress’ వ్యూహం అంటే ఏంటి? దాని ఉద్దేశమేంటి? ’36 స్ట్రాటజెమ్స్’ చరిత్రేంటి? చైనా మధ్య ఆసియా విధానంలో ఏముంది? ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ లో చైనా పాగావేస్తే భవిష్యత్తులో తలెత్తే పరిణామాలేంటి? ఆఫ్ఘనిస్తాన్ లో చైనా పెట్టుబడుల మాటేంటి? యూరేసియాలో చైనా ఎంటర్ అవుతే ముంచుకొచ్చే ప్రమాదమేంటి..?

ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా దేశం కాకపోయినా దాని మీదుగా ‘యూరేసియా’ను కబళించాలన్నది డ్రాగన్ వ్యూహం. యూరేసియాలో కర్గిస్థాన్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో అపారవనరులతో పాటు వ్యూహాత్మకంగా కీలక దేశాలు. ఫోర్ ట్రెస్ వ్యూహానికి అందమైన వ్యాపార పథకాన్ని రచించింది. షాంఘై కోఆఫరేషన్ ఆర్గనైజేషేన్ పేరుతో చైనా యూరేసియా దేశాలను భాగం చేసింది.

చైనా ‘ఫోర్ ట్రెస్’ వ్యూహం గురించి అమెరికాకు చెందిన రక్షణరంగ స్ట్రాటజిక్ థింక్ ట్యాంక్ RAND corporation గడచిన కొంతకాలంగా అనేక ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన వాస్తవాలను బట్టబయలు చేస్తోంది. ఆసియాలో చైనా కార్యకలాపాలు అమెరికాకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటారు సైనిక రగం నిపుణులు.

చైనా తన పశ్చిమ సరిహద్దులు కేంద్రంగా ‘ఫోర్ ట్రెస్’ వ్యూహానికి పథక రచన చేసిందని ర్యాండ్ సంస్థ తన పరిశోధనా పత్రంలో వెల్లడించింది. మధ్య, దక్షిణాసియాలో తాను కేవలం వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టూ నటిస్తోంది. మధ్య ఆసియాలో చైనా యాక్టివిటీ అమెరికా ప్రయోజనాలకు ఇప్పటికిప్పుడు పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ లో చైనా కదలిక మాత్రం అగ్రరాజ్యానికి ప్రమాద ఘంటికగానే పరిగణించాలి.

ట్రిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ లతో 20ఏళ్ల పాటు యుద్ధం చేసింది. ఏమీ సాధించలేక చివరకు తాలిబన్ లతో శాంతిఒప్పందం కుదుర్చుకుని తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది వైట్ హౌస్. అమెరికా వైఫల్యమే చైనాకు మేలు చేసింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో చైనా భారీ పెట్టుబడులు పెట్టిన మొదటి వరుస దేశం. అమెరికా-తాలిబన్ యుద్ధం అంతిమ ఫలితాన్ని 2010లోనే ఊహించిన గత పదేళ్లుగా పెట్టుబడులను పథకం ప్రకారం విస్తరిస్తూ వచ్చింది.

‘ఖొరసాన్’తో యుద్ధం చేసి గెలిచిన చరిత్ర ప్రపంచంలో ఏదేశానికీ లేదు. బ్రిటన్ 1839లో చేసిన యుద్ధం ఖరీదు 20వేల మంది సైనికుల ప్రాణాలు. 2001లో 15వేల మంది సైనికులతో మోహరింపు మొదలుపెట్టిన అమెరికా 2009 నాటికి లక్షకు చేర్చింది. ఇరవై ఏళ్లకాలంలో 2వేల 3వందల మంది మరణించారు. చాలా చిత్రంగా చైనా తమ దేశాన్ని ఏదో రోజు ఆక్రమించి తీరుతుందని ఆఫ్ఘన్లు ‘రిటర్న్ ఆఫ్ ఏ కింగ్’ రచయిత విలియమ్ డాల్ రింపుల్ తో అభిప్రాపడ్డారు. ‘రిటర్న్ ఆఫ్ ఏ కింగ్’ పుస్తకం 1839 బ్రిటన్ -ఆఫ్ఘన్ యుద్ధంపై రాసిన పుస్తకం.

యుద్ధ చరిత్రలో తమను అజేయులుగా చెప్పుకునే ఆఫ్ఘనీలు చైనా కుట్రలకు అపజయం పాలైతే అత్యంత వ్యూహాత్మక భూభాగంలో డ్రాగన్ పాగా వేస్తుంది. ‘ WAR ON THE ROCKS ’ పత్రికలో ‘CHINA’S STRATEGIC ASSESSMENT OF AFGHANISTAN’ పేరుతో ఆసక్తికర కథనం రాసింది. చైనా ఆఫ్ఘనిస్తాన్ ను దీర్ఘకాల వ్యూహరచనకు అత్యంత కీలక ఆయుధమని ఈ కథనం పేర్కొంది.

ఆఫ్ఘనిస్తాన్ లో చైనా వ్యూహాత్మక ప్రమాదాన్ని పసిగట్టిన అమెరికా భవిష్యత్తు అవసరాల కోసం పాకిస్థాన్ లో మిలటరీ ఎయిర్ బేస్ ఏర్పాటు చేయాలని చూసిన ప్రయత్నాలకు ఉగ్రదేశం ‘నో’ చెప్పింది. పాకిస్థాన్ కంఠంలో ప్రస్తుతం చైనా అప్పుల గేలం ఇరుక్కుని స్వరపేటికలో రక్తం గడ్డకట్టింది. మొత్తంగా భారత్ పొరుగున ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ దేశాలపై డ్రాగన్ పూర్తిస్థాయిలో పట్టు సాధించింది.

2001 నుంచి చైనా మధ్య ఆసియాపై దౌత్య, సైనిక, ఆర్థిక పట్టుకోసం ప్రయత్నాలు చేస్తోంది. 2014 నాటికి పరవాలేదనే స్థాయికి ఎదిగింది. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నం తర్వాత విడిపోయిన యూరేసియా దేశాలు కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, తుర్క్ మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలను చేరదీసేందుకు వ్యూహాత్మక వలలు వేస్తోంది. 2014 మధ్య ఆసియా దేశాలతో దౌత్య, ఆర్థిక, సైనిక బంధాన్ని నెలకొల్పుకోవడంలో సఫలమైంది.

చైనా మధ్య ఆసియా విధానంలో ప్రధానంగా చైనాలో అంతర్గతంగా పెరుగుతున్న ఎథినిక్ సమస్య- జిన్ జియాంగ్ లో వీగర్ ముస్లీంల సమస్యను ఎదుర్కొంటోంది. సుదూరంగా విసిరేసినట్టు ఉండే జిన్ జియాంగ్ ప్రాంతం జనాభా తక్కువ. అంతేకాదు వెనుకబడిన ప్రాంతం వ్యూహాత్మకంగా కీలమైంది. స్థిరమైన సైనిక వ్యూహం ఏర్పాటు, ‘‘3 ఎవిల్స్’’ గా చైనా పేర్కొనే ప్రత్యేకవాదం, తీవ్రవాదం, ఉగ్రవాదాల కట్టడి, ఆర్థిక ప్రయోజనాలు కాపాడటం ఈ 4 లక్ష్యాల పరిపూర్తిగా పేర్కొంది.

వీటి సాధనకు పైకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి అసలు కుట్రకు పదును పెడుతోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు 2001లో జరిగింది. మధ్య ఆసియా దేశాల రక్షణ కోసమని ప్రకటించింది. అంటే మొత్తంగా ఈ దేశాలను ఏకతాటిపై ఉంచి స్థిరంగా ‘Empty Fortress’ వ్యూహాన్ని అమలు చేస్తూ రష్యా అధికార పరిధిని నియంత్రిస్తూ, అమెరికాను సవాలు చేయడం దీని అసలు ఉద్దేశం.

2006లో కజకిస్థాన్ చమురు పైప్ నిర్మాణం పూర్తి చేసింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ ను సైతం ఏర్పాటు చేసింది చైనా. 2009లో తుర్కిమెనిస్థాన్ లో చమురు పైప్ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా, పాకిస్థాన్ లతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ ఆయా దేశాల్లో ముస్లీం ఉగ్రవాదం జిన్ జియాంగ్ లోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయడం చైనా ఎత్తుగడ. బలమైన భూతాన్ని పక్కనపెట్టుకుని చిన్న దయాన్ని నియంత్రించడం, భారత్ లాంటి దేశాల్లో అస్థిరత సృష్టించడం అన్నమాట. 2001 నుంచి AfPak లో అమెరికా సైనిక మోహరింపును నిశితంగా గమనిస్తోంది. అదనుకోసం ఎదురు చేస్తోంది. అమెరికా స్థానంలో తన సైన్యాన్ని మోహరించాలంటే ముందు పాకిస్థాన్ ను ఆర్థికంగా లొంగదీసుకుని ఆ తర్వాత అమలుపరచడం విజయవంతంగా చేసింది.

ఈ ఉద్దేశంతో “Empty Fortress” strategy కోసం పశ్చిమ సరిహద్దును ఎంచుకుంది. చిన్న చిన్న ఉచ్చులు బిగిస్తూ, వ్యాపారాన్ని కవర్ గా పెట్టుకుంటూ చివరికి 36 స్ట్రాటజెమ్స్ లోని మరో ఎరను వేయడం. మొత్తంగా మధ్య ఆసియా, ఆఫ్ఘన్-పాకిస్థాన్ కేంద్రంగా ‘గ్రేట్ గేమ్’ ను ప్రారంభించింది. 21 శతాబ్దపు మహా యుద్ధంలో అమెరికా-చైనాలు తమ తమ ప్రయోజనాల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.

మొత్తంగా ఆసియా నివురు గప్పిన నిప్పును తలపిస్తోంది. మరోవైపు దక్షిణాసియాపై కన్నేసిన చైనా ఈపాటికే నెపాల్, భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక దేశాలను అప్పుల పాలు చేసింది. శ్రీలంకలో అత్యంత కీలకమైన హ్యంబన్ టోటా పోర్ట్ పూర్తి స్థాయిలో తన ఆధీనంలో ఉంచుకుంది. భారత్ పొరుగున ఉన్న బలూచ్ ప్రాంతంలోనూ పాగావేసింది.

మరోవైపు బైడెన్ అధికార పగ్గాలు చేపట్టాక చైనా-అమెరికా బంధం మరింత గాఢమవుతుందని అందరూ భావించిన అదీ అంత సాఫీగా సాగడం తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. చైనాకు దూకుడుకు కళ్లెం వేయకపోతే అగ్రరాజ్య హోదా చేజారిపోతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చాలా ముందుగానే పసిగట్టారు. ఈ క్రమంలో చైనా ఆర్థిక శక్తిని లక్ష్యంగా చేసుకొనేలా వ్యూహం పన్నారు.

ఇందుకోసం యూరప్ సహకారం అవసరమని గుర్తించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రవర్తన కారణంగా దూరమైన మిత్రులను బుజ్జగించే పనిని వేగవంతం చేశారు. బైడెన్‌ తీరు యూరప్ లో మార్పును తీసుకొచ్చింది. చైనాకు వ్యతిరేకంగా బైడెన్‌ చేపట్టిన చర్యలతో చైనా-యూరప్ మధ్య కుదిరిన సమగ్ర పెట్టుబడుల ఒప్పందం నిలిచిపోయింది. ఈ పరిణామాలు చైనాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. చైనా-అమెరికా బంధం మొత్తం ఆసియా భవిష్యత్తును నిర్ణయిస్తాయా?దక్షిణాసియాలో భారత్ నిర్వహించే పాత్ర ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైనవి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

ten + 16 =