More

  మణిపూర్‎కు డ్రాగన్ భారీ ఆయుధాలు..!! విప్లవ్ త్రిపాఠి హత్య వెనుక సంచలన నిజాలు..!!!

  మణిపూర్‌లో ఉగ్రవాదులు గత శనివారం ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని నవంబర్ 13 ఉదయం అంబుష్ కి పాల్పడ్డారు.. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్‌’కు చెందిన ఖుగా బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

  మణిపూర్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో భద్రతా బలగాలకూ, ఉగ్రవాదులకు మధ్య దాడుల ఘటనలు సర్వసాధారణం. కానీ, తాజా దాడిలో సైనిక అధికారి కుటుంబం బలికావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ ఘటనలో అధికారి కుటుంబం బలికావడం పెనువిషాదం. ఈ ఆంబుష్ వెనుక చాలా ప్రమాదకరమైన సంకేతాలున్నాయి. చైనా ఆయుధాలు ఈశాన్యంలోకి వస్తునాయని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. మొత్తంగా ఈశాన్యంలో రాబోయే రోజుల్లో మరోదఫా ఉగ్రవాదం పెచ్చరిల్లే అవకాశాలను కొట్టిపారేయలేం!

  మణిపూర్-మిజోరాం-నాగాలాండ్ లోని ఉగ్రసంస్థలకూ, మయన్మార్ లో బలంగా ఉన్న ‘కచిన్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్ కూ మధ్య సంబంధాలకు కారణమేంటి? మయన్మార్ లోని ఉగ్రవాద గ్రూపులు, మణిపూర్ లోని ఉగ్రసంస్థలు కూడబలుక్కుని చైనా దన్నుతో ఈశాన్యంలో అగ్గిరాజేస్తున్నాయా? కల్నల్ విప్లవ్ త్రిపాఠీ దారుణ హత్య చెపుతున్న వాస్తవాలేంటి? డ్రగ్ ముఠాల ఆటకట్టిస్తున్నందుకేనా విప్లవ్ త్రిపాఠీ పై కక్ష కట్టారు? చైనా ఆయుధాలు భారత్ లోకి ఎలా వస్తున్నాయి. మయన్మార్ లో అస్థిరత ఉంటే చైనాకు వచ్చే ప్రయోజనమేంటి?

  ’46 అస్సాం రైఫిల్స్’ పై దాడిలో డ్రగ్ స్మగ్లర్ల హస్తముందంటారు లెఫ్టినెంట్ జనరల్ షోకిన్ చౌహాన్. గత రెండేళ్లుగా మణిపూర్ లో పెద్దఎత్తున మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకోవడం, డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేయడంతో డ్రగ్స్ అక్రమ రవాణాపై ఆధారపడిన ఉగ్రమూకలు దాడికి పాల్పడి ఉంటాయని కూడా చౌహాన్ అభిప్రాయపడ్డారు.

  చైనా ఆయుధాలతో దాడి చేయడం, థాయ్ లాండ్ మత్తుపద్దార్థాలను రవాణా చేసి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాదులు దశాబ్దాలుగా చేస్తున్న పని. మణిపూర్ లోని చురా చాంద్ పూర్, ఛండేల్ జిల్లాలు బర్మా సరిహద్దులకు నడకమార్గం దూరంలోనే ఉంటాయి. మనుష్య సంచారం లేని లోతట్టు అడవులు ఉన్న జిల్లాలు కూడా. ఇదే ఉగ్రదాడులకు అనుకూలిస్తోంది. కాంబోడియా నుంచి లావోస్ మీదుగా భారీ ఎత్తున మత్తు పదార్థాలు బర్మా చేరతాయి. అటుపైన మణిపూర్ లోకి అక్రమ మార్గాల ద్వారా ఉగ్రమూకలు చేరవేస్తాయి. హిందూ మహాసముద్రం డ్రగ్స్ మాఫియాకు ప్రధాన రవాణా మార్గం.

  చైనా ఆయుధాలు మణిపూర్ లోని ఉగ్రసంస్థలకు ఎలా చేరాయో చూద్దాం. మయన్మార్-చైనాలు సరిహద్దు దేశాలు. ఇరు దేశాల మధ్య సుమారు 2వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మయన్మార్ లో అశాంతి ఎంత పెరిగితే చైనాకు అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పైగా మయన్మార్ ఏర్పడిననాటి నుంచీ ఆ దేశ సరిహద్దులపై ప్రభుత్వానికి ఏమాత్రం నియంత్రణ లేదు. సరిహద్దుల్లో మాటు వేసిన ఉగ్రవాద సంస్థలదే ఇష్టా రాజ్యం. దీంతో చైనా సహజంగానే మయన్మార్ లోని ఉగ్రసంస్థలకు అన్ని విధాలా సహకారం అందిస్తుంది. ఆయుధాలు సరఫరా చేస్తుంది.

  మయన్మార్ లోని ఉగ్రసంస్థలు ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాద సంస్థలకు ఎందుకు ఆయుధాలు ఇస్తున్నాయి? దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి: మయన్మార్ ఉగ్రసంస్థల ఆధీనంలోని ప్రాంతాల్లోని తెగలు, ఈశాన్య రాష్ట్రాల్లోని తెగలు ఒకటే. పైగా మయన్మార్-ఈశాన్య రాష్ట్రాల తెగల మధ్య సబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి. రెండో కారణం: భారత్ లోని ఈశాన్య భాగంపై అదుపు కోరుకుంటున్న చైనాకు ఆయా ప్రాంతాల్లోని ఉగ్రసంస్థలు నిరంతరం భారత బలగాలపై దాడులు చేస్తూ ఉండాలి.

  కచిన్ ఇండిపెండెన్స్ ఫ్రంట్ చాలా పాత సంస్థ. బర్మా సైన్యం నుంచి చైనాకు పారిపోయిన కొందరు అనేక ప్రయత్నాల తర్వాత 1960లో ‘కచిన్’ సంస్థను స్థాపించారు. వందమంది ఉగ్రవాదులతో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం 16 వేలు మంది సుశిక్షతమైన మిలిటెంట్లతో బర్మా సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ‘కచిన్’ మాత్రమే కాదు బర్మాలో చిన్నా చితకా మరో తొమ్మిది ఉగ్ర సంస్థలు కూడా ఉన్నాయి.

  ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’ మణిపూర్‌లోని ఓ ఉగ్ర సంస్థ. పీఎల్ఏని ఎన్‌.బిషేశ్వర్‌ సింగ్ 1978లో ప్రారంభించారు. యూఎన్‌ఎల్‌ఎఫ్‌ నుంచి వేరుపడిన పీఎల్ఏలో ఆ సంస్థ కేడర్‌ కూడా  చేరింది. 1979లో దీని రాజకీయ విభాగం ‘రివల్యూషనరీ పీపుల్స్‌ ఫ్రంట్‌’ ను ఏర్పాటు చేశారు.  మణిపూర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనైనా భారత్‌ నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా మార్చాలన్నది దీని లక్ష్యం.

  ఇందుకోసం కుకీ, నాగా వేర్పాటువాద బృందాలతో కూడా కలిసి పనిచేసేందుకు పీఎల్‌ఏ సిద్ధపడింది.  భద్రతా దళాలతో పాటు మణిపూర్ పోలీసులను టార్గెట్ చేశారు. కొంత కాలం తర్వాత మణిపూర్ పోలీసులను చంపకూడదని నిర్ణయించింది. అయితే 1981లో బిషేశ్వర్ సింగ్ అరెస్ట్ తర్వాత ఆ సంస్థ కార్యకలాపాలు కొంత మందగించాయి. 1990లలో  కొంతమేర యాక్టివ్ గా పనిచేసినా తాజాగా విప్లవ్ త్రిపాఠీ హత్యతో మరోసారి వెలుగులోకి వచ్చింది.

  ఇంఫాల్‌ లోయలో పీఎల్‌ఏ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. పీఎల్ఏ క్యాంప్‌లన్నీ మయన్మార్‌లో ఉన్నాయి. పీఎల్ఏ శిక్షణ కూడా అక్కడే కొనసాగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నా.. పీఎల్‌ఏ మాత్రం ప్రభుత్వంతో ఎటవంటి ఒప్పందాలు చేసుకోలేదు. 

  గతంలో జరిగిన పెద్ద దాడులకు మయన్మార్‌ సరిహద్దుల్లోని ఛండేల్‌ జిల్లా వేదికగా ఉంది. 2015లో డోగ్రా రెజిమెంట్‌పై దాడి చేసి 18 మంది సైనికులను ఛండేల్‌ జిల్లాలో హత్య చేసింది. తాజా దాడి చురాచంద్ పూర్ లో జరిగింది.

  మయన్మార్ లో  మిలటరీ జుంటా ఏర్పడిన తర్వాత ఆ దేశంలోని ఉగ్రసంస్థల స్థావరాలపై వైమానిక దాడులు తీవ్రం చేసింది. ఇది చైనాకు చికాకు కలిగించింది. దీంతో మయన్మార్ లోని తీవ్రవాద గ్రూపులను ఒక్కతాటిపైకి తెచ్చింది. మిలట్రీ జుంటాతో సీజ్ ఫైర్ చర్చలకోసం ఐక్యసంఘటనను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ నుంచి మయన్మార్ సైనిక ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.  అయితే అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మయన్మార్ లో తిష్ఠవేసిన పీఎల్ఏ కు కూడా ఉద్వాసన పలికింది ఆ దేశ సైనిక ప్రభుత్వం.

  చైనాకు మయన్మార్ లో ఉన్న ప్రయోజనాలేంటో చూద్దాం..

  అమెరికాకు చెందిన USIP-united states institute of peace సంస్థ 2018లో ‘‘China’s Role in Myanmar’s Internal Conflicts’’ పేరిట ఓ వివరమైన నివేదిక ప్రచురించింది.

  ఈ నివేదికలో ‘‘China’s Interests in Myanmar’’ శీర్షికతో ప్రత్యేక విభాగాన్ని పొందుపరిచింది. ఇందులో ‘‘Beijing has several clear strategic interests in Myanmar: stability on its shared border, access to the Indian Ocean, and a wide variety of economic interests’’ అని పేర్కొంది.

  అంటే ‘బీజింగ్ కు మయన్మార్ లో భిన్నమైన, స్పష్టమైన వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయ. ఇరు దేశాల సరిహద్దుల్లో అలజడి లేకుండా స్థిరమైన స్థితి ఉండటం, హిందూ మహాసముద్రంలో ప్రవేశయోగ్య స్థితిని కాపాడుకోవడం వీటితో పాటు పలు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తన సరిహద్దు సురక్షితంగా ఉండాలంటే అవతలిదేశంతో సరిహద్దు కాస్తంత గందరగోళంలో ఉంటేనే తన ఆటలు సాగుతాయని చైనా భావిస్తోంది. అందుకే భారత్ సరిహద్దుల్లో అలజడి సృష్టించే మూకలకు ఊతమిస్తోంది.

  అంతేకాదు ‘China’s Trans-Myanmar Oil and Gas Pipelines’ బంగాళఖాతంలోని Offshore gas facility నుంచి మయన్మార్ లోని మాండలే, రూలీ మీదుగా చైనాలోని కున్ మింగ్ దాకా విస్తరించింది. దీన్ని కాపాడుకోవాలంటే మయన్మార్ లోని ఉగ్రమూకలను సంతృప్తిపరచాలి.

  ఇదే నివేదికలో ‘‘China is also a market for illicit cross-border trade in drugs, logging, wildlife, charcoal, jade,and other gems. in these illegal economies for decades.’’ అని పేర్కొంది. అంటే చైనా దశాబ్దాలుగా ఇరు దేశాల సరిహద్దు నియమాలను ఉల్లంఘించి..డ్రగ్స్, కలప, జంతుజాలం, బొగ్గు, రంగురాళ్లు, మాణిక్యాల వ్యాపారం చేస్తోంది. అక్కడితో ఆగలేదు. ‘‘China has had both direct and indirect influence on conflict and peace dynamics in northern Myanmar’’  చైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా మయన్మార్ శాంతిలోనూ, ఘర్షణలోనూ చలనశీలమైన ప్రభావాన్ని కలిగిఉంది’ అంటూ వ్యాఖ్యానించింది.

  మణిపూర్ లో కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి సహా ఆయన కుటుంబం ఇతర సిబ్బందిపై జరిగిన దాడి వెనుక అనేక అంతర్జాతీయ సంబంధాల్లోని లోపాయికారి కుట్రలున్నాయి. అది కేవలం దాడిగా అనుకుంటే పొరపాటే. సమగ్రతను దెబ్బతీసే కుట్రలో భాగంగా జరిగింది. ఆయుధాలు, మత్తుపదార్థాలు ఈ దేశంలోకి పంపి బలహీన పరచాలని చూస్తోంది చైనా. ఇప్పటికే మణిపూర్ లో మత్తుమాయలో పడి, డజన్లమంది ఒకే ఇంజెక్షన్ తో మత్తుఎక్కించుకుని కాళ్లూ చేతులూ amputate చేయించుకున్నవాళ్లు వందల్లో కనిపిస్తారు.

  పాకిస్థాన్ సరిహద్దుల్లో, కశ్మీర్ లోనే కాదు ఈశాన్యంలో, లఢాక్ లో నేపాల్ సరిహద్దుల్లో శతృవులు అదను కోసం ఎదురుచూస్తున్నవేళ జరిగిందే మణిపూర్ ఆంబుష్. మయన్మార్ దేశ చిత్రపటమే విచిత్రంగా గగనం వైపు మోరసాచి ఆరుస్తున్న ఒంటికాలి రక్కసిని తలపిస్తుంది. ఇది దాని ఆత్మను వ్యక్తం చేస్తోంది కావచ్చు. మొత్తంగా ఈ దేశ సైన్యం సరిహద్దుల్ని కాపాడేందుకు ఆయాదేశాల అధికారిక సైన్యాన్ని, ఉగ్రసంస్థల దాడుల్నీ, డ్రగ్ మాఫియా కుట్రల్నీ ఎదిరిస్తూ తీవ్ర వత్తిడిలో ఈ దేశానికి కాపలా కాస్తున్నందుకు మనమంతా రుణపడి ఉండాలి.

  Trending Stories

  Related Stories