Right Angle

DIA చెరలో చైనా SPY..! పెంటగాన్ పిడికిట Bio Weapon సీక్రెట్స్..?

ఎట్టకేలకు అమెరికా కోవిడ్-19 గుట్టు కనిపెట్టింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే చైనా ఊరుకోదని పెంటగాన్ కు తెలుసు. అందుకే పకడ్బందీ సాక్ష్యాలు సేకరించింది. చైనా కౌంటర్ ఇంటలీజెన్స్ లో పనిచేసే గూఢచారిని పెంటగాన్ ప్రస్తుతం తన చెప్పుచేతల్లో ఉంచుకుంది. డాంగ్ జింగ్ వుయ్ అనే చైనా గూఢచారి గుట్టుచప్పుడు కాకుండా వాషింగ్టన్ చేరుకున్నాడు. ఈ పరిణామాలతో డ్రాగన్ ఖంగుతినింది.

‘గౌన్బ్’గా పిలిచే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ-MSS కు సంబంధించిన రహస్యాలతో పాటు మరిన్ని టెర్రాబైట్ల డేటాను డాంగ్ పెంటగాన్ కు అందించినట్టు సమాచారం. డాంగ్ అదృశ్యంపై ఆందోళనతో ఉన్న చైనా.. ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు. పైగా డాంగ్‌ చైనాలోనే ఉన్నారని, ఈనెల 18న జరిగిన ఒక సింపోజియంలో పాల్గొని ప్రసంగించారని పేర్కొంటోంది. అయితే, గతేడాది సెప్టెంబర్ నుంచే డాంగ్ ఊసే లేకుండా పోయిందనే వదంతులూ ఉన్నాయి.

చైనా కమ్యూనిస్టు పార్టీ అత్యంత కీలక విభాగంలో ఉన్న డాంగ్ జింగ్ ఊహాన్ వైరాలజీ ల్యాబ్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని అమెరికాకు అందించినట్టూ వార్తలు గుప్ఫుమనడంతో చైనా కమ్యూనిస్టు పార్టీ సహా, సెంట్రల్ మిలట్రీ కమిషన్ లు హుటాహుటిన రహస్య సమావేశం ఏర్పాటు చేసి తదుపరి వ్యూహం గురించి తర్జనభర్జన పడుతున్నాయని అంతర్జాతీయ పత్రికలు కథనాలు రాస్తున్నాయి.

చైనా కౌంటర్ ఇంటలీజెన్స్ అధికారి డాంగ్ జింగ్ నిజంగానే పెంటగాన్ కు ఊహాన్ వైరాలజీ ల్యాబ్ రహస్యాలు అందించాడా? డాంగ్ జింగ్ ఎప్పటి నుంచి అమెరికా డిఫెన్స్ ఇంటలీజెన్స్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాడు? పథకం ప్రకారమే హాంకాంగ్ మీదుగా డాంగ్ అమెరికా చేరుకున్నాడా? సెప్టెంబర్ లోనే పెంటగాన్ డాంగ్ జింగ్ తో టచ్ లోకి వచ్చిందా? సీఐఏ వద్ద ఉన్న ఊహాన్ వైరస్ రహస్యాలేంటి? చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ మిలట్రీ కమిషన్ ఊహాన్ వైరాలజీ ల్యాబ్ లో ఏం చేసింది? పెంటగాన్ గత జూలైలోనే ఆపరేషన్ చేపట్టిందా? పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చైనా నిఘా కార్యకలాపాలు ఎందుకు భిన్నం? దోవల్ తన పరిశోధనా పత్రంలో చైనా నిఘావర్గాల పరిణామం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇలాంటి కీలక అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చైనా స్టేట్ సెక్యూరిటీలోని కౌంటర్ ఇంటలీజెన్స్ విభాగంలో గడచిన మూడేళ్లుగా వైస్ మినిస్టర్ హోదాలో పనిచేస్తున్న డాంగ్ జింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న హాంకాంగ్ మీదుగా కూతురుతో కలిసి వాషింగ్టన్ పారిపోయాడని చైనా గాఢంగా విశ్వసిస్తోంది.

చైనా వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఆ దేశ law enforcement agency- ‘‘సెంట్రల్ పొలిటికల్, లీగల్ అఫయిర్స్ కమిషన్’’ సోషల్ మీడియా అకౌంట్ లో ‘‘తమ దేశానికి చెందిన గూఢచారులు చైనా వ్యతిరేక శక్తులతో జట్టుకట్టారని, ప్రతి రహస్య కదలిక వెనుక ఉన్న శక్తులను త్వరలో గుర్తిస్తాం’’ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. పరోక్షంగా కాదు, నేరుగా డాంగ్ జింగ్ కు వార్నింగ్ ఇచ్చింది.

గత నెల అలస్కాలో జరిగిన సమావేశంలో అమెరికా-చైనా అధికారుల మధ్య డాంగ్ జింగ్ సంబంధించిన ప్రస్తావన వచ్చినట్టూ సమాచారం. అయితే అమెరికా డాంగ్ విషయంలో గుంభనం ప్రదర్శించడం తప్ప స్పష్టమైన జవాబు ఇవ్వలేదని ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.

మరోవైపు మాజీ సీఐఏ అధికారి, పెంటగాన్ ఎక్స్ పర్ట్ నికోలస్ ఎఫ్టిమెడిస్ మాత్రం డాంగ్ జింగ్ వ్యవహారం గజిబిజిగా ఉందనీ, పూర్తి సమాచారం తెలిస్తే తప్ప నిర్ధారణకు రాలేమంటూ తేల్చి చెప్పారు. చైనా అధికారులు ఏళ్లుగా ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవంటూ కొట్టి పారేశారు ఎఫ్టిమెడిస్. ఒక వేళ నిజంగానే డాంగ్ జింగ్ అమెరికాలో తలదాచుకుని ఉంటే మాత్రం అది సంచలనం అన్నారు ఎఫ్టిమెడిస్.

చైనా నిఘా విభాగ పద్ధతులు సాపేక్షికంగా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భిన్నమైనవి. చైనా రహస్యాలు చాలా అరుదుగా మాత్రమే బయటపడుతాయి. చైనా గూఢచర్యం బట్టబయలు కావడమన్నది ఇతర దేశాల కౌంటర్ ఇంటలీజెన్స్ పథక రచన వల్లకాదు; అంతర్గత విభేదాల మూలంగా, లేదా సెంట్రల్ మిలట్రీ కమిషన్ కమిస్సార్ ల తీవ్రమైన ఒత్తిడి వల్ల మాత్రమే బయటపడుతుంటాయి.

ఊహాన్ వైరాలజీ ల్యాబ్ లో సెంట్రల్ మిలటరీ కమిషన్ కార్యకలాపాలపై పూర్తి సమాచారాన్ని డాంగ్ జింగ్ అమెరికా డిఫెన్స్ ఇంటలీజెన్సికి అందించినట్టూ వార్తలు వెలువడుతున్నాయి. హాంకాంగ్ నుంచి ప్రచురితమయ్యే ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ మరో ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది.

డాంగ్ ‘మిస్సింగ్’ను ఫిబ్రవరి చివరి వారంలో గుర్తించిన చైనా కమ్యూనిస్టు పార్టీ, సెంట్రల్ మిలటరీ కమిషన్ లు అంతర్గత గూఢచారుల్లో ప్రతి ఒక్కరిపై పూర్తి స్థాయి నిఘా ఉంచిందని పేర్కొంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని వేటాడటం ఖాయమని ఈ కథనం పేర్కొంది.

డాంగ్ జింగ్ ఆధారాలతో కోవిడ్-19 వైరస్ జీవాయుధమని తేలితే అంతర్జాతీయ రాజకీయాల్లో భారీ మార్పులు, ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంది. 1989లో తియాన్మెన్ స్క్వేర్ మారణహోమం తర్వాత డా.హన్ లియాంచావో అనే విదేశాంగ అధికారి అమెరికా పారిపోయన ఘటన తర్వాత చైనా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. తాజా ఘటనతో ఏమీ పాలుపోని స్థితికి చేరుకుంది.

అగ్రరాజ్యం అమెరికా ముందునుంచి చైనాలోని ఊహాన్ నుంచే ఈ కరోనా వైరస్ వచ్చిందంటూ ఆరోపణలు చేస్తూ వచ్చినా.. తగిన ఆధారాల కోసం గూఢచర్యానికి ఆదేశించింది. అమెరికా ఆరోపణలకు ఇప్పుడు బలం చేకూరిందని అమెరికా పత్రికలు కథనాలు రాస్తున్నాయి. చైనా వైరాలజిస్ట్ డాక్టర్ లి-మెంగ్ యాన్ గత ఏడాది జూలైలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.. హాంకాంగ్‌లో పనిచేస్తున్న అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో ఆమె ఒకరు. ఊహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ తయారైందని యాన్ బహిర్గతం చేశారు.

డాక్టర్ లి-మెంగ్ యాన్ ఆరోపణల తర్వాత పెంటగాన్ పూర్తి స్థాయిలో పకడ్బందీగా రంగంలోకి దిగింది. సెంట్రల్ మిలటరీ కమిషన్ లో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి ద్వారా క్రమంగా సంబంధాలు పెంచుకుని ఊహాన్ వైరాలజీ ల్యాబ్ లో అనుమానాస్పద కార్యకలాపాలపై స్పష్టమైన నిర్ధారణకు వచ్చింది. అయితే ఈ అనుమానాస్పద కదలికలపై మరింత కచ్చితమైన సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడింది.

ఈ నేపథ్యంలోనే ‘గౌన్బ్’లో పనిచేసే డాంగ్ జింగ్ పై దృష్టి సారించింది. జూలై నుంచి చేపట్టిన ఆపరేషన్ సెప్టెంబర్ లో ఓ కొలిక్కి వచ్చినా, చైనాలో ఉంటూ కౌంటర్ ఇంటలీజెన్స్ రహస్యాలు, ఊహాన్ ల్యాబ్ లో మిలట్రీ కమిషన్ సీక్రెట్లను వెల్లడించడం సాధ్యం కాదని డాంగ్ జింగ్ తేల్చి చెప్పడంతో వాషింగ్టన్ ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది పెంటగాన్.

బీజింగ్ నుంచి నేరుగా వాషింగ్టన్ రావడంలో ఉన్న సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకున్న అమెరికా హాంకాంగ్ ను ఎంచుకుంది. హాంకాంగ్ ను ఎంచుకోవడంలోనూ ఓ కారణం ఉంది. డాంగ్ జింగ్ కూతురు డాంగ్ యాంగ్ హాంకాంగ్ లో ఉండటంతో అక్కడి నుంచి ప్రయాణం సురక్షితమని అమెరికా భావించింది. అమెరికా ప్రయాణానికి ముందే పెంటగాన్ డాంగ్ జింగ్ పై ఆయన స్వస్థలం హీబే ప్రావిన్స్ లోని జావో కౌంటీలో పూర్తి స్థాయి విచారణ చేసింది. నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకుంది.

2006, ఫిబ్రవరి 14 నుంచి 2017 మార్చి, 30 వరకు డాంగ్ జింగ్ హీబే ప్రావిన్స్ Provincial Department of National Security డైరెక్టర్ గా పనిచేశాడు. 2007లో చైనా కమ్యూనిస్టు పార్టీ హీబే ప్రావిన్స్ లోని వివిధ కమిటీలను పర్యవేక్షించాడు. 2010లో ఫుజిటా కార్పొరేషన్ లో పనిచేసే నలుగురు జపనీయులను గూఢచార ఆరోపణలతో అరెస్టు చేయడంలో డాంగ్ జింగ్ కీలక పాత్ర పోషించారు. 2017 ఏప్రిల్ లో ‘గౌన్బ్’ డైరెక్టర్ అయ్యాడు. సరిగ్గా ఏడాది తర్వాత వైస్ మినిస్టర్ పదవిని చేపట్టాడు. డాంగ్ జింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు సన్నిహితుడని 2018లో బయటపడిన ఇంటెలీజెన్స్ నివేదిక పేర్కొంది.

అయితే, గతేడాది సెప్టెంబర్ తర్వాత డాంగ్ జింగ్ పేరును స్టేట్ కౌన్సిల్ అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించింది సీసీపీ. డిప్యూటీ మినిస్టర్ల లిస్ట్ లో డాంగ్ జింగ్ పేరు ఉండాల్సిన స్థానం కాళీగా ఉండటంతో అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో డాంగ్ జింగ్ సీఐఏ కు దగ్గరైనట్టూ సమాచారం. 2018లో డిప్యూటీ మినిస్టర్ గా నియమిస్తూ ఇచ్చిన అపాయింమెంట్ ఆర్డర్ కూడా వెబ్ సైట్ లో డిలీట్ కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

పాశ్చాత్య దేశాల నిఘా విభాగాల పనితీరుతో పోలిస్తే చైనా గూఢచార విభాగాల పనితీరు పూర్తిగా భిన్నమంటారు నిపుణులు. సాధారణంగా వేదాంతంలో, రసాయన శాస్త్రంలో, పాకశాస్త్రంలో, పాశ్చాత్య సంగీతంలో ఉపయోగించే Fusion అనే మాటను నిఘా విభాగంలో వినియోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది చైనా.

మిలటరీ-సివిల్ ఫ్యూజన్-MCF పేరుతో ప్రపంచ దేశాల్లోని చైనా పౌరులను గూఢచర్యంలోకి దింపింది చైనా. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల ప్రవేశపెట్టిన “Chinese Intelligence: From a Party Outfit to Cyber Warriors” పత్రంలో పేర్కొన్నారు. దలైలామా లక్ష్యంగా ధర్మశాలలో MSS రహస్య కార్యకలాపాల గురించి ఈ పత్రంలో దోవల్ సవివరంగా తెలియజేశారు.

ఇదే పత్రంలో దోవల్….‘‘ The People’s Liberation Army over the years, has upgraded its intelligence capabilities at tactical, technological and strategic levels, particularly in Asia Pacific Region, South Asia and Central Asia. The MSS has evolved itself as the premier foreign intelligence agency and besides diplomatic intelligence, it has been aggressively hunting for technological data and systems information to augment national economic and military capabilities.’’

అంటే.. చైనా ప్రజావిముక్తి సైన్యం ఇటీవలి కాలంలో తన కార్యకలాపాల స్థాయిని విస్తరించింది. దక్షిణ, మధ్య ఆసియాల్లో తన కార్యకలాపాల వేగాన్ని పెంచింది. ఎత్తుగడల్లోనూ, సాంకేతిక, వ్యూహాత్మక అంశాల్లో ఎం.ఎస్.ఎస్ తన కార్యరంగాన్ని మరింత విస్తరించింది. అదే సమయంలో దౌత్యరంగాన్ని సైతం వీటికి సమానంగా నిర్వహిస్తోంది. టెక్నలాజికల్ డేటాతో పాటు ఆర్థిక, సైనిక శక్తి సామర్థ్యాలకు సంబంధించిన వివరాల కోసం వేట మొదలుపెట్టింది’’ అంటూ పరిశోధనాత్మక వ్యాఖ్య చేశారు.

మొత్తంగా ఊహాన్ వైరస్ మూలాలు అమెరికా కనుగొన్నా వ్యూహాత్మక అవసరాల రీత్యా రహస్యంగానే ఉంచింది. అమెరికా చేతిలో కీలక రహస్యాలు ఉన్న కారణంగానే చైనా-అమెరికా సంబంధాల్లో ఘర్షణ పాలు తగ్గి-సంయమనం పాలు పెరిగిందంటారు నిపుణులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

seventeen − 10 =

Back to top button