చైనా దురాక్రమణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం ఎంతకైనా తెగిస్తుంది. భారత్ లాంటి బలమైన దేశాలు చైనాకు ధీటుగా బదులిస్తూ ఉండగా.. తైవాన్ వంటి చిన్న దేశాలు ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. తాజాగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా తన వాయిస్ ను వినిపించింది. తైవాన్‌పై చైనా దాడి చేస్తే, తైవాన్‌కు అండగా పోరాడుతామని అమెరికా అధ్యక్షుడ బైడెన్ అన్నారు. ప్రపంచ చరిత్రలోనే అమెరికాది శక్తివంతమైన సైన్యమని చైనా, రష్యా, మిగిలిన దేశాలకు తెలుసు అని బైడెన్ అన్నారు. తైవాన్‌ను రక్షిస్తామని.. ఆ విషయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. తైవాన్ అంశంలో తమ ప్రభుత్వ విధానంలో ఎటువంటి మార్పులేదని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తైవాన్ తమ దేశానికి చెందిన భూభాగం అని చైనా భావిస్తోంది. తైవాన్ మాత్రం తనకు తాను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్నది. తైవాన్‌తో అమెరికాకు నేరుగా దౌత్యపరమైన సంబంధాలు లేవు. కానీ ఆ దేశానికి ఆయుధాలను అమెరికా అమ్ముతోంది. బైడెన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తైవాన్ స్పందించింది. చైనా అంశంలో తమ విధానం ఏమీ మారదని, ఒకవేళ డ్రాగన్ దేశం దాడి చేస్తే, తామే ప్రతిదాడి చేస్తామని తైవాన్ చెప్పింది. చైనా దేశం సైనిక దూకుడుకు పాల్పడుతోందని, ప్రాంతీయ శాంతిని ఆ దేశం విచ్ఛిన్నవిచ్ఛిన్నం చేస్తున్నట్లు తైవాన్ ప్రధాని సు సెంగ్ చాంగ్ ఇప్పటికే తెలిపారు.
అమెరికాకు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. కానీ, ‘తైవాన్ రిలేషన్స్ యాక్ట్’ను అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చింది. అందులో భాగంగా తైవాన్‌కు రక్షణ ఆయుధాలను అమెరికా విక్రయిస్తుంది. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అమెరికా సహాయం చేస్తుంది.
తైవాన్ గగనతలంలోకి చైనా విమానాలు:
తైవాన్ గగనతలంలోకి వందకు పైగా చైనా యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాంతీయ స్థిరత్వం, ప్రశాంతతకు భంగం కలిగించొద్దంటూ చైనాకు హితవు పలికింది. కొద్దిరోజుల కిందట తైవాన్ గగనతలంలోకి చైనా విమానాలు చొరబడ్డాయి. తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి సుమారు 39 చైనా సైనిక విమానాలు ప్రవేశించినట్లు ఆ దేశం పేర్కొన్నది. రెండు వేవ్‌ల రూపంలో చైనా విమానాలు తమ దేశంలోకి ఎంటర్ అయినట్లు తైవాన్ రక్షణశాఖ చెప్పింది. 38 విమానాలు వచ్చాయని, వాటిల్లో అణ్వాయుధ బాంబర్లు కూడా ఉన్నట్లు తైవాన్ వెల్లడించింది.