More

    పిల్లాడిలో కనపడిన కొత్త వైరస్.. చైనా ప్రపంచాన్ని మరోసారి వణికించబోతోందా..?

    కరోనా మహమ్మారిని తీసుకుని వచ్చిన చైనా.. ఇప్పుడు మరో వైరస్ ను ప్రపంచం మీదకు వదలబోతోందా..? ఏమో ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరో కొత్త వైరస్ చైనాలో బయటపడింది. ఏవియన్ ఫ్లూ H3N8 జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న నాలుగేళ్ల బాలుడు కొద్దిరోజుల క్రితం జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతడికి పరీక్షలు చేయగా అతడికి ఏవియన్ ఫ్లూ వ్యాధి సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. సదరు బాలుడు పక్షుల ద్వారానే ఈ వ్యాధి బారినపడినట్టు అధికారులు నిర్ధారించారు.

    చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఒక ప్రకటనలో కేసును నిర్ధారించింది. అయితే ఇది ప్రజలలో వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని పేర్కొంది. జ్వరంతో సహా అనేక లక్షణాలను నాలుగేళ్ల బాలుడిలో చూశారు. NHC ప్రకారం బాలుడికి సన్నిహితంగా ఉన్న వాళ్లకు వైరస్ సోకలేదు. పిల్లవాడి ఇంటిలో కోళ్లు, కాకులు పెంచుతూ ఉన్నారని తెలుస్తోంది. H3N8 వేరియంట్ గతంలో గుర్రాలు, కుక్కలు, పక్షులు, సీల్స్‌లో కనుగొనబడిందని ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఇప్పటి వరకూ H3N8 మనుషుల ఇన్ఫెక్షన్ కేసులు ఏవీ నివేదించబడలేదు. ఇప్పుడు చైనా ఆ క్రెడిట్ ను దక్కించుకుంది.

    ప్రాథమిక అంచనా ప్రకారం, ఈ వేరియంట్‌ మానవులకు ఎక్కువగా సోకే అవకాశం ఇంకా లేదని, పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని పేర్కొంది. చనిపోయిన, జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని.. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే తక్షణమే చికిత్స తీసుకోవాలని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ హెచ్చరించింది. మొదటిసారిగా 2002లో H3N8 వైరస్‌ ఉత్తర అమెరికా వాటర్‌ఫౌల్‌లో వెలుగులోకి వచ్చింది.

    Trending Stories

    Related Stories