తమ పోయిన పరువును తిరిగి పొందాలనే ఉద్దేశ్యంతో ఇటీవల చైనా తన ఆర్మీకి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. గల్వాన్ ఘటనలో మన వీర సైనికుల దెబ్బకి చైనా సైన్యంలో హతమయ్యినవారి సంఖ్య 40 నుంచి 60 ఉండవచ్చు అంటూ పలు నివేదికలు స్పష్టం చేసినా.. అబ్బే మా వాళ్లు పోయింది నలుగురే అంటూ ఒక డ్రామా క్రియేట్ చేసింది. అంతకుముందు తన వాయుసేన సామర్ధ్యాన్ని హాలీవుడ్ సినిమాలనుంచి దొంగతనం చేసిన సీన్లతో చూపెట్టుకుని పరువుపోగొట్టుకున్న ఈ దేశం మళ్లీ అలాంటి పనే చేసిందని చెప్పాలి.
ఇక థంబ్ నైల్ కంటెంట్ కి వద్దాం…
ఇప్పుడు చైనా విడుదల చేసిన అదే వీడియోలో ఈశాన్య భారత దేశానికి చెందిన ఓ కుర్రాడు భారత బృందాన్ని లీడ్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నెటిజన్లు ఆ కుర్రాడెవరా..? అని ఆరాతీయడం మొదలుపెట్టగా.. చివరికి అతడు మణిపూర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన సోయిబా మనినగ్బా రంగ్నామీగా తేలింది.
2018లో సైన్యంలో సోయిబా చేరాడు. ఈ కుర్ర ఆఫీసర్ 16 బిహార్ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ట్విటర్ ఖాతాలో పంచుకొన్నారు.
‘మణిపూర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన సోయిబా మనినగ్బా రంగ్నామీ.. చైనా సైనికుల దురాగతానికి ఎదురెడ్డి నిలిచిన వీరుడు.. 16 బిహార్ రెజిమెంట్ లో విధుల నిర్వర్తిస్తున్న ఈ రియల్ హీరోను చూసి దేశం గర్విస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. కొనసాగింపుగా మరో ట్వీట్ చేస్తూ.. మన దేశానికి సేవచేసేందుకు సైనిక్ పాఠశాల ఇంఫాల్ నుండి మరో 11 మంది క్యాడెట్లు కూడా భారత రక్షణ దళాలలో చేరడానికి సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు అంటూ తెలిపారు.
చైనా వీడియో వెలువడిన తర్వాత అతని వివరాలపై భారత సైన్యం తొలుత గోప్యత పాటించింది. కానీ, బిరేన్ సింగ్ ట్వీట్ తర్వాత కేంద్ర యువజన వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ధ్రువీకరించారు. కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్’ గౌరవాన్ని ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది కూడా.
చైనా దళాలు జూన్ 15వ తేదీ సాయంత్రం 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ సంతోష్‌బాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో ఆయన్ను అక్కడి నుంచి భారత స్థావరానికి తీసుకొచ్చారు. ఈ ఘటన చూసి బిహార్ రెజిమెంట్ ఆవేశంతో రగిలిపోయింది. ఘాతక్ కమాండోలతో కలిసి భారీ సంఖ్యలో చైనా స్థావరం వద్దకు చేరుకొని ప్రతి దాడి చేసింది. కొన్ని గంటల పాటు జరిగిన దాడితో చైనా దళాలు బిత్తరపోయాయి. ఈ ఘటనతో చైనా వైపు కూడా భారీగా మృతి చెందారు. భారత దళాల ఆగ్రహజ్వాలలకు పిఎల్ ఏ వణికిపోయింది.
ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలు అందరికీ విధితమే.. నక్కజిత్తుల చైనా మింగలేక కక్కలేక ఆడిన డ్రామాలను సైతం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. ఇక భారత్ తో 10 వ దఫా చర్చల వేళ ఆ వీడియో రిలీజ్ చేయడం.. బలగాలను ఉపసంహరించుకోవడం అంతా కూడా ప్రపంచానికి తామొక శాంతికాముక దేశం అని బిల్డప్ ఇచ్చేందుకే.. కానీ చైనా గుణం ఎవరికీ తెలీదు గనక. మరో విషయం ఏంటంటే గ్లోబల్ టైమ్స్ ట్విటర్ విడుదల చేసిన ఆ వీడియోను చైనాలో ప్రజలు చూసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ట్విటర్ వాడరు. కేవలం బాహ్యప్రపంచం కోసమే దానిని విడుదల చేసింది. మొత్తంగా చూస్తే చైనా పెంపుడు పత్రిక విడుదల చేసిన ఆ వీడియోలో వీరోచితంగా పోరాడుతున్న మణిపూర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సోయిబా మనినగ్బా రంగ్నామీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతే కదా.. మన కోసం మన జవానులు చూపిన తెగువయే మన ఆత్మనిర్భరతను ప్రపంచానికి చాటేది.