More

  తైవాన్ ఆక్రమణకు సిద్ధమైన డ్రాగన్..! ‘గెట్ రెడీ’ అంటూ ఆర్మీకి జిన్‎పింగ్ ఆదేశం..!!

  చైనా అధ్యక్షుడు షీ జీన్‎పింగ్ తైవాన్‎పై యుద్దానికి దిగబోతున్నాడా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చైనా అధ్యక్షుడు తన సైన్యానికి యుద్దానికి సిద్దం కండంటూ సంచలన ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు ఉన్న సైన్యం బలం పెంచుకోవడంతో పాటుగా యుద్ద శిక్షణను తీసుకుని సన్నద్దత అవండంటూ ఆదేశాలిచ్చారు. దీంతో చైనా మరో యుద్దాన్ని మొదలుపెట్టబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే చైనా నుంచి వచ్చే వార్తలను వెంటనే నమ్మడం కొంచెం కష్టమే. కానీ, ఈ వార్తలు చైనా అధికారిక టీవీ ఛానెల్ ‘సీసీటీవీ’ లో ప్రసారం కావడంతో ఇవి నిజమైన వార్తల్లానే భావించాల్సిన అవసరం ఉంది. యూకే-తైవాన్ల మధ్య ట్రేడ్ డీల్స్ జరగడంతో ఇక ఎప్పటికైనా తైవాన్‎ను తనలో కలిపేసుకోవాలని చూస్తోంది చైనా.

  ఇటీవల యూకే వాణిజ్య శాఖామంత్రి గ్రెగ్ హ్యాండ్స్ తైవాన్‎ను సందర్శించాడు. దీంతో ఆగ్రహించిన చైనా ఈ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాదు, ఇటీవలే అమెరికన్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా తైవాన్ ను సందర్శించింది. దీంతో ఈ రెండు అగ్రదేశాల చేతుల్లోకి తైవాన్ వెళ్ళకముందే ఆక్రమించుకోవాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలన్నీ రష్యా ఉక్రెయిన్ యుద్దంతో సతమతమవుతున్నాయి. ఆయా దేశాల్లో గ్యాస్, చమురు సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. అంతేకాదు, అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా చేస్తుండటంతో స్టాక్ కూడా అయిపోతోంది. దీంతో ఇదే అదనుగా భావించిన చైనా.. తైవాన్ ను ఆక్రమించుకోవాలని చూస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా తైవాన్‎ను చైనాలో కలుపుకోవాలని కుతూహలంతో ఉంది. 2024లోపు ద్వీప దేశాన్ని తన దేశంలో కలిపేసుకోవాలనే లక్ష్యాలను సైతం నిర్దేశించుకుంది. దీనికి తాజా ఆదేశాలు తోడవడంతో యుద్దానికి దిగుతోందా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

  వీటికి బలం చేకూర్చేలా చైనా నుంచి కొన్ని ఫోటోలు కూడా వెలువడ్డాయి. అందులో క్రూయిజ్ షిప్పుల్లో యుద్ద ట్యాంకులను తరలించడం వంటివి కనిపిస్తున్నాయి. ఒకటో రెండో కాదు పదుల సంఖ్యలో యుద్ద ట్యాంకులను తీరాలు దాటించినట్లు అనుమానం వస్తోంది. ఇప్పటికే చైనా యుద్ద విమానాలు కూడా తైవాన్ గగనతలంపైకి వీర విహారం చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా తైవాన్ ఎన్నో సార్లు బెదిరించినా కూడా చైనాను ఎదుర్కొనేందుకు సాహసం చేయలేదు.

  అయితే ఈ యుద్దం జరిగితే ప్రపంచదేశాలు ఆర్థికంగా పూర్తి ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఎగుమతయ్యే సెమీకండక్టర్ చిప్‎లలో దాదాపు 30 శాతం వరకు తైవాన్‎లోనే తయారవుతున్నాయి. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‎గా తైవాన్ ఉంది. అయితే చైనా తైవాన్‎పై యుద్దానికి దిగితే ప్రపంచవ్యాప్తంగా చిప్‎ల కొరత భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్దం జరగకుండా చూడటానికే అవకాశం ఉంది.

  ఒకవేళ యుద్దమే జరిగితే తైవాన్ కు మద్దతుగా అమెరికా కూడా యుద్ద పరికరాలు, సప్లై చేసి అక్కడా సంపాదించుకునే ప్రయత్నమే చేస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్దంలో ఉక్రెయిన్ కు ఆయుధాలను సప్లై చేస్తూ దాన్ని తన ఆయుధ లాబీలకు ఉపయోగించుకుంటోంది అమెరికా. పేరుకే దీన్ని సహాయంగా చెబుతున్నా,.. పరోక్షంగా రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికే ఈ యుద్దం ఎక్కువగా ఉపయోగపడుతోంది. దీంతో పాటు అమెరికన్ ఆయుధ లాబీలు కూడా లాభపడుతుండటంతోనే ఉక్రెయిన్ కు అగ్రరాజ్యం సహాయం చేస్తోంది. ఇదే విధంగా చైనా తైవాన్ల యుద్దంలోనూ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తైవాన్‎కు అమెరికా తోడుగా ఉంటుందని ప్రకటించింది. దీంతో ఇప్పటి ఉక్రెయిన్‎లాగే తైవాన్‎కు కూడా ఆయుధాలను సప్లై చేసి చైనాను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. కానీ మరోవైపు ఈ యుద్దం మరో ప్రపంచ యుద్దానికి కూడా దారితీసే అవకాశాలు ఉండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ప్రపంచ యుద్ద నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  Trending Stories

  Related Stories