డ్రాగన్ దేశం ఉక్రెయిన్, రష్యా విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. మొదటి నుంచి చైనా రష్యా కు మద్దతుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్.. రష్యాలో అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆయన రష్యాలో పర్యటిస్తోన్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది. చైనా అధినేతగా వరుసగా మూడోసారి ఎన్నికైన తరువాత జిన్ పింగ్ తొలిసారిగా రష్యాలో పర్యటిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ తో సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగిస్తోన్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడి రష్యా పర్యటనను ఒకరకంగా దీన్ని ఎమర్జెన్సీ టూర్ గా భావిస్తోన్నారు.
జిన్ పింగ్ మూడు రోజుల రష్యా పర్యటన నిన్ననే ఆరంభమైంది. రాజధాని బీజింగ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మాస్కోకు బయలుదేరి వెళ్లారు. నిన్న మధ్యాహ్నం విమానాశ్రయంలో దిగారు. రష్యా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారులు ఆయనను ఆహ్వానించారు. జిన్ పింగ్ గౌరవార్థం సైనిక కవాతును నిర్వహించారు. అనంతరం ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. ఐతే ఈ మద్యే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ లోని మరియపోల్ లో పర్యటించారు. ఈ పరిణామాల్లన్నింటిని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.
ఇక ఏడాదికి పైగా ఉక్రెయిన్ తో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు కీలక నగరాలు, రీజియన్లను రష్యా సొంతం చేసుకున్నప్పటికీ ఉక్రెయిన్ సైనిక బలగాల ఎదురుదాడితో వాటిపై ఆధిపత్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికా సహా యూరోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యదేశాలు అందిస్తోన్న ఆయుధ సంపత్తి, యుద్ధ సామాగ్రితో రష్యాను ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అటు రష్యా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు.
ఈ నేపథ్యంలో ఆసియాలో అత్యంత శక్తిమంతంగా భావిస్తోన్న చైనా.. తన మిత్రదేశం రష్యాకు మద్దతును ప్రకటించింది. ఈ క్రమంలో జిన్ పింగ్ నేరుగా రష్యాలో పర్యటిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగించాల్సిన పరిస్థితే ఎదురైతే రష్యాకు అవసరమైన సహాయ, సహకారాలను అందజేయడానికి కూడా చైనా వెనుకాడకపోవచ్చు. అవే హామీలను ఈ సందర్భంగా జిన్ పింగ్.. పుతిన్ కు ఇవ్వొచ్చని అంటున్నారు. దీనితో పాటు ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనలను కూడా జిన్ పింగ్ తెరమీదికి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఉక్రెయిన్ పీస్ ప్లాన్ ప్రతిపాదనలపై జిన్ పింగ్ చర్చించారని చెబుతున్నారు.