More

  కరోనా పుట్టిల్లు చైనానే..
  ఇంతకన్నా ఆధారం ఏంకావాలి..!

  కరోనా వైరస్‎ను ప్రపంచం మీదికి వదిలిందన్నది చైనానే అన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయంలో ఇప్పటికే వందల కొద్ది ఆధారాలు వెలుగుచూశాయి. అయినా, ఇప్పటికీ డ్రాగన్ కంట్రీ బుకాయిస్తూనేవుంది. నిజాల్ని కప్పిపుచ్చి ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టిస్తూనేవుంది. కరోనా వైరస్ తొలిసారి వుహాన్ సముద్రజీవుల మార్కెట్లోనే వెలుగుచూసిందంటూ.. ఇప్పటిదాకా దొంగ నాటకాలు ప్రదర్శించింది. అయితే, చైనా కుట్రలకు బలం చేకూర్చుతూ తాజాగా మరో బలమైన ఆధారం వెలుగుచూసింది.

  సాధారణంగా రోగమొస్తేనే రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారు. కానీ, రోగం రాకుండానే ఎవరైనా డయాగ్నొసిస్ చేయించుకుంటారా..? చేయించుకోరు కదా..! కానీ, చైనా మాత్రం తొలి కరోనా వైరస్ వెలుగుచూసే సమాయానికి కొన్ని నెలల ముందే.. లక్షల కొద్ది ఆర్టీపీసీఆర్ కిట్లను సమకూర్చుకుంది. అంటే, కరోనా వస్తుందని చైనాకు ముందే తెలుసా..? ఎందుకు తెలియదు, కరోనాకు పురుడుపోసిందే చైనా కదా..! ఓవైపు ల్యాబుల్లో మహమ్మారిని రెడీచేసి.. ముందుజాగ్రత్తగా పీసీఆర్ కిట్లను సేకరించుకుని.. కరోనా వైరస్‎ను పక్కాగా ప్రపంచం మీదికి వదిలింది జిత్తులమారి డ్రాగన్. ఆస్ట్రేలియా – అమెరికాకు చెందిన ‘ఇంటర్నెట్ 2.0’ అనే సంస్థ ఈ విషయాన్ని పరిశోధనాత్మకంగా నిరూపించింది. ఆ సంస్థ చేసిన రీసెర్చ్ ప్రకారం.. వుహాన్‎లో తొలికేసు రిజిస్టర్ కావడానికి కొన్ని నెలల ముందు నుంచే అక్కడి ల్యాబ్‌లు పీసీఆర్‌ టెస్ట్ కిట్లను భారీగా కొనుగోలు చేసినట్లు తేలింది. ‘డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ ఎనాలసిస్‌’లో ‘ఇంటర్నెట్ 2.0’ సంస్థకు ఘనమైన రికార్డు వుంది.

  కరోనా వైరస్ తొలి కేసు నమోదైన తర్వాత.. 2019 డిసెంబర్ 31న తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించింది చైనా. జనవరి 7న డబ్ల్యూహెచ్ఓ దీనిని కొత్తరకం కరోనాలో కొత్త రకమైన ‘సార్స్‎కోవ్-2’ గా గుర్తించింది. అప్పుటిదాకా కరోనా గురించి ప్రపంచానికి తెలియదు. కానీ, అప్పటికే చైనా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఆర్టీపీసీఆర్ కిట్లను కొనుగోలు చేసి పెట్టుకుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువగా కొనుగోళ్లు చేసింది. ప్రపంచంలో ఎక్కడ స్టాక్ వుంటే.. అక్కడికి ఆర్డర్లు పెట్టింది. వుహాన్‌లోని పలు ల్యాబొరేటరీలు 2019లో ఈ పరికరాల కోసం 135 కాంట్రాక్టులను ఇచ్చాయి. అదే 2018లో 89 కంట్రాక్టులు ఇవ్వగా.. 2017లో 72 కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో 2015 నుంచి 2019 వచ్చేనాటికి పీసీఆర్‌ కిట్ల కొనుగోళ్లు ఏకంగా 600 శాతం పెరిగాయి. కొవిడ్‌ వ్యాప్తికి ఐదు నెలల ముందు.. అంటే 2019 జులైలోనే భారీ కొనుగోళ్లు జరిగాయి. ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్‌ సోకిందో లేదో తెలుసుకోవడానికి జన్యువుల ఆధారంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ను గుర్తించేందుకు ఈ కిట్లనే వినియోగిస్తున్నారు. మరి, అలాంటి కిట్లను కరోనా రాకముందే చైనా ఎందుకు కొనుగోలు చేసిందో మీకు ఇప్పటికే అర్థమైవుంటుంది. ఒకవేళ తమ పథకం విఫలమై చైనాలో వైరస్ విజృంభిస్తే.. అడ్డుకునేందుకు ముందే ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంది జిత్తులమారి చైనా.

  దీనినిబట్టి కరోనా గురించి బాహ్యప్రపంచానికి వెల్లడించడానికి కొన్ని నెలల ముందే వైరస్ వ్యాప్తి ప్రారంభమైందన్నమాట. కానీ, అక్కడి వైద్య నిపుణుల వాదన మాత్రం వేరేగా ఉంది. కేవలం పీసీఆర్‌ కిట్ల కొనుగోళ్ల ఆధారంగా ఏ నిర్ణయానికి రాలేమని చెబుతున్నారు. ఒక్క కరోనా విషయంలోనే కాదు.. ఇతర వైరస్‌లను గుర్తించడానికి కూడా పీసీఆర్ కిట్లనే వాడుతుంటారు. అయితే, అవసరానికి మించి.. ఎన్నడూ లేనివిధంగా భారీగా కొనుగోళ్లు చేయడమే అనుమానాలను బలపరుస్తోంది. పీసీఆర్‌ కిట్ల కొనుగోళ్లపై జాన్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్కాలర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కిట్ల కొనుగోళ్లు ఒక్క హుబే ప్రావిన్స్‌లోనే ఎందుకు పెరిగాయో అర్థం కాలేదన్నారు. కాకపోతే ప్రతిఏటా పీసీఆర్‌ పరికరాల కొనుగోళ్లను చైనా పెంచుకొంటూ పోతోందని చెప్పారు.

  ఆర్టీపీసీఆర్ కిట్ల కొనుగోళ్ల ప్రక్రియను నిగ్గుతేల్చిన ప్రాజెక్టకు ‘ఇంటర్నెట్ 2.0’ కో-సీఈవో డేవిడ్ రాబిన్సన్ నేతృత్వం వహించారు. ఇతనికి గతంలో ఆస్ట్రేలియా సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ పరిశోధనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఈ డేటా కొవిడ్‌ పుట్టుకకు సంబంధించి ఏ వాదనను సమర్థించేందుకు కాదని అన్నారు. హుబే ప్రావిన్స్‌లో వీటి కొనుగోళ్లు అసాధారణంగా ఉన్నాయని తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా.. చైనా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రభుత్వం కొనుగోళ్ల డేటాను వాడుకొన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ 2.0 పీసీఆర్‌ అనే పదం కోసం వెతికి వివరాలను సేకరించారు. 2007 నుంచి 2019 వరకు ఉన్న 1,716 కొనుగోలు కాంట్రాక్టులను గుర్తించారు. 2019లో వుహాన్ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ హుబే ప్రావిన్స్‌లో అత్యధికంగా ఈ కిట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎనిమిది ఆసుపత్రులు, 35 బోధనాసుపత్రులు, 22 జనరల్‌ ఆసుపత్రులు, 10 డిసీజ్‌ ప్రివెన్షన్‌ సెంటర్లు ఉన్నాయి. ఒక్క హుబే ప్రావిన్స్‎లోనే కాదు.. వివిధ ప్రావిన్స్‌లు కొనుగోలు చేసిన వివరాలను కూడా సేకరించారు. అయితే, హుబే ప్రావిన్స్‌తో పోలిస్తే మిగిలిన ప్రావిన్స్‌ల్లో పీసీఆర్‌ కిట్ల కొనుగోళ్లు పెద్దగా పెరగలేదని తేలింది. 2019 నవంబర్‌లో కొనుగోళ్లు ఎక్కువగా జరిగినట్లు ఇంటర్నెట్‌ 2.0 పేర్కొంది.

  ముఖ్యంగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌బార్న్‌ హాస్పటల్‌ 2019లో భారీగా పీసీఆర్‌ పరికరాలు కొనుగోలు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో వుహాన్‌ హంగ్‌షాన్‌ డిస్ట్రిక్‌ సెంటర్‌ కొనుగోలు చేసింది. దీనిని తర్వాత నెలలో జరగనున్న సైనిక క్రీడల కోసం కొనుగోలు చేశారు. అక్టోబర్‌ 100 దేశాల నుంచి 9 వేల మంది సైనిక క్రీడాకారులు వుహాన్‌ వచ్చారు. ఆ తర్వాత వారు స్వదేశాలకు వెళ్లాక కొవిడ్‌ లక్షణాలతో బాధపడినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ జూన్‌లో కథనం వెలువరించింది. చైనా మాత్రం అమెరికా సైనికులే ఈ వ్యాధిని వుహాన్‌లో వ్యాప్తి చేశారని ఆరోపించింది.

  ఇదిలావుంటే, ఇంటర్నెట్ 2.0 పరిశోధనపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. వైరస్‌ పుట్టుక విషయంలో నమ్మటానికి వీల్లేని వాదనల కేటగిరిలోకి ఇది వస్తుందని ఆరోపించింది. అయినా, వైరస్‌ ఆనవాళ్లు గుర్తించడమనేది శాస్తవేత్తల డ్యూటీ అని.. దీనిపై వారు మాత్రమే మాట్లాడలని చైనా ప్రతినిధి తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలు స్పష్టంగా ఉన్నాయని.. కాలమే దీనికి సమాధానం చెబుతుందన్నారు. అయితే, ఇన్ని కథలు చెప్పి.. భారీగా కొనుగోలు చేసిన పీసీఆర్ కిట్లను ఎక్కడ వాడారంటే మాత్రం.. వారి దగ్గర సమాధానం లేదు. దీనిని బట్టి కరోనా వైరస్‎కు జన్మస్థలం చైనాయేనని చెప్పకనే చెప్పేశారు.

  Trending Stories

  Related Stories