International

తాలిబాన్లకు ఎటువంటి సహాయం చేయడానికైనా సిద్ధమైన ఆ రెండు దేశాలు..!

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల శకం మొదలైంది. అయితే తాలిబాన్ల పాలన ఎలా ఉండబోతోంది.. ఆర్థికంగా ఆఫ్ఘనిస్తాన్ ఎలా పుంజుకుంటుంది అనే ప్రశ్నలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చాలా దేశాలలో పెట్టుబడులు పెట్టినట్లే పలు కంపెనీలు ఆఫ్ఘనిస్తాన్ కు వస్తాయా అంటే.. 99 శాతం మంది అలాంటివి ఇప్పట్లో జరగవనే చెబుతారు. అక్కడే పుట్టిన ప్రజలకే తాలిబాన్ పాలనపై నమ్మకం లేదు.. అందుకే కదా వారంతా ఇతర దేశాల సరిహద్దుల్లో ఏదో ఒక దేశం తమని తీసుకోదా అన్నట్లు ఎదురుచూస్తూ ఉన్నారు.

ఏది ఏమైనా కానీ తాలిబాన్ ప్రభుత్వానికి అండగా మాత్రం ఉంటామని ఓ రెండు దేశాలు మాత్రం చెబుతూనే ఉన్నాయి. ఒకటి ఆర్థికంగా ఎంతగానో చితికిపోతున్న పాకిస్తాన్ కాగా.. మరొకటి చైనా..! ఇక ఒకప్పుడు అంతరించిపోయే దశలో ఉన్న తాలిబాన్లు.. ఏకంగా కాబూల్ ను సొంతం చేసుకోడానికి కారణమైంది పాకిస్తాన్ అని చెబుతూనే ఉన్నారు. బహిరంగంగానే తాలిబాన్లు పాక్ ఇచ్చిన మద్దతు.. భవిష్యత్తులో పాక్ కు అందించే స్నేహ బంధం వంటివి ఇటీవలే ప్రస్తావించారు కూడానూ..! ఒకానొక సమయంలో తాలిబాన్లను అంతం చేయడానికి పాక్ అమెరికాకు సహాయం చేస్తున్నట్లుగా నటించినా డబుల్ గేమ్ ఆడిందని స్పష్టం అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో గత 20 ఏళ్లలో పాక్‌ పాత్రపై అమెరికా అధ్యయనం చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకన్‌ వెల్లడించారు. దీనిలో తాలిబాన్లకు పాక్‌ ఆశ్రయమిచ్చిన అంశాన్ని కూడా పరిశీలిస్తామని.. భవిష్యత్తులో పాక్‌ పోషించాల్సిన పాత్ర, ఆ దేశంతో సంబంధాలపై పునర్‌ విశ్లేషించుకొంటామని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ పై గత నెలలో ప్రారంభమైన కాంగ్రెస్‌ విచారణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాలిబాన్లను గొప్ప వ్యక్తులుగా చూపించాలని పాక్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. తాలిబాన్లు కూడా సాధారణ మనుషులే అన్నట్లుగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తాలిబాన్ల అండతో కాశ్మీర్ ను కూడా సొంతం చేసుకుంటామని పాక్ అధికార పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక తాలిబాన్లతో తమకున్న స్నేహానికి గుర్తుగా.. ఇటీవల ఎంతో దెబ్బ తిన్న కాబూల్ ఎయిర్ పోర్టులో తొలి వాణిజ్య విమానంను కాబుల్‌లో ల్యాండ్‌ చేయించింది పాకిస్తాన్. ఇది తాలిబాన్ల గుర్తింపు కోసం పాక్‌ మొదలెట్టిన నాటకం అని కూడా స్పష్టంగా ప్రపంచానికి అర్థం అవుతోంది. తాలిబాన్లకు ఆయుధాల సహాయం దగ్గరి నుండి వారికి తప్పించుకోడానికి ఆశ్రయం కలిగించడం వరకూ పాక్ తోడ్పాటును అందిస్తూనే వస్తోంది. ఆఖరికి పంజ్ షీర్ లోయను స్వాధీనం చేసుకునే విషయంలో పాక్ తన విమానాలను తాలిబాన్లకు మద్దతుగా ఉంచింది. ఒకప్పుడు తాలిబాన్లను అంతం చేయడానికి పాక్ అమెరికాకు మిత్రుడు అని చెప్పుకోగా.. అలా నాటో దళాలు వెళ్ళిపోగానే తాలిబాన్లను పాక్ ఒళ్లో కూర్చోపెట్టుకోడానికి సైతం సిద్ధమైంది. అందుకేనేమో జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పాక్ ప్రధానికి ఫోన్ కాల్ చేయలేదు. ఇదే ఇమ్రాన్ ఖాన్ ను తెగ బాధ పెడుతోందని ప్రచారం కూడా సాగింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట ఆఫ్ఘన్ లోకి అమెరికా సేనలు అడుగుపెట్టినప్పుడు పాక్‌ ఈ పోరులో తనను తాను అమెరికా మిత్రదేశంగా చెప్పుకొంది. కానీ పాక్ సైన్యం, ఇంటెలిజెన్స్‌ మాత్రం తాలిబాన్లకు ఆయుధాలు, రవాణా సౌకర్యాలు అందించాయి. ఇలా డబుల్ గేమ్ ఆడుతూ సాగిన పాకిస్తాన్.. తాలిబాన్లు అధికారం లోకి రాగానే బానిస సంకెళ్లు తొలగిపోయాయి, స్వేచ్ఛ వచ్చింది’ అంటూ వ్యాఖ్యలు చేసి తమ నిజస్వరూపాన్ని బయటపెట్టేసింది. తీవ్రవాదులతో తాము పోరాటం చేస్తున్నామంటూ అమెరికా నుండి వేల కోట్లు పొంది.. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోగానే తాలిబాన్ పంచన చేరింది.

చైనా కూడా వత్తాసు:

పాక్ ఏమి చెప్పిందో ఏమో కానీ.. తాలిబాన్లకు చైనా మద్దతు ఇస్తూ వెళుతోంది. ఎటువంటి సహాయం చేయడానికైనా తాలిబాన్లకు తామున్నామని చైనా అంటోంది. చైనా-తాలిబాన్‌ సంబంధాలు 2000 సంవత్సరంలో మొదలయ్యాయి. ఆ ఏడాది పాక్‌లోని చైనా మాజీ రాయబారి లూ షులిన్‌ తాలిబాన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌తో భేటీ అయ్యారు. పాకిస్థాన్‌ సాయంతో 2019 నుంచి చైనా తాలిబాన్లకు దగ్గరవుతూ వచ్చింది. అదే ఏడాది తాలిబాన్‌ బృందం బీజింగ్‌ను సందర్శించి చర్చలు జరిపింది. అంతేకాక ముల్లా బరాదర్‌ నేతృత్వంలోని బృందం కూడా చైనాతో భేటీ అయ్యింది. ఈ క్రమంలో తాలిబాన్లు కాబుల్‌ను ఆక్రమించాక కూడా చైనా రాయబార కార్యాలయం కొనసాగింది. ఇక ఇటీవలే చైనా 30 మిలియన్‌ డాలర్ల సాయం కూడా ప్రకటించింది.

తాలిబాన్లు కూడా చైనాతో సన్నిహితంగా ఉంటేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. తాలిబాన్లపై ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు ఉండగా.. చైనా లాంటి పవర్ ఫుల్ దేశం తమకు అండగా ఉంటేనే మంచిదని తాలిబాన్లు భావిస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సేనలు ఉండటం నచ్చని చైనా తాలిబాన్లకు సాయం చేసింది. ఇంత చేసిన చైనా తిరిగి తీసుకోకుండా ఉంటుందా చెప్పండి.. ఆఫ్ఘన్ లోని కీలకమైన రాగి, రేర్‌ఎర్త్‌ మెటల్స్‌ను కూడా సొంతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. వీటి విలువ లక్ష కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలా చైనా వీలైనంత మద్దతు ఇచ్చి ఆ తర్వాత తనకు కావాల్సినవి లాగేసుకుంటుంది. దీన్ని తాలిబాన్లు ఎప్పటికి గమనిస్తారో ఏమో..!

Related Articles

Leave a Reply

Your email address will not be published.

3 × four =

Back to top button