More

  చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్న పాకిస్తాన్.. ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్‌

  పాకిస్తాన్ ఇప్పటికే అప్పుల పాలైన దేశం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అప్పు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది.! ఇస్లామిక్ దేశాలు కూడా పాక్ అంటే ముఖం చాటేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ కు అన్నింటికి ఇప్పుడు చైనానే దిక్కు అన్నట్లుగా మారింది పరిస్థితి.!
  అయితే ఇందులో ఇంకొక ట్వీస్టు ఏమిటంటే… చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPECతో పాకిస్తాన్ కు మేలు కంటే కూడా కీడే ఎక్కువగా జరుగుతోందని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రాజెక్టు ప్రతిబంధకంగా మారిందని ఆ దేశానికి చెందిన డాన్ అనే పత్రిక కథనాలను ప్రచురిస్తోంది.
  అయితే ఈ సీపీఈసీ ప్రాజెక్ట్… పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరమని ఆ ప్రాజెక్టు చీఫ్ ఖలీద్‌ మన్సూర్‌ మాత్రం పాక్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం ఆ దేశ పత్రికలనే కాదు, అంతర్జాతీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేస్తోంది.
  ఇంతకీ ఈ ప్రాజెక్టుపై పాక్ మీడియా చేస్తున్న విశ్లేషణ ఏంటి? పాక్ ప్రజలు సైతం CPEC ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ ప్రాజెక్టును మరింతగా విస్తరించాలని పాక్ పాలకులు చెప్పడం వెనుక అసలు కారణాలేంటి? ఈ అంశాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!
  నిజానికి.. పాకిస్తాన్, చైనాల స్నేహబంధానికి గుర్తుగా ఈ ఎకనామిక్ కారిడార్ ను రెండు దేశాల అధినేతలు కూడా ఎంతో గొప్పగా పేర్కొంటుంటారు.! డ్రాగన్ చైనా…తన వ్యాపార ప్రభావాన్ని మధ్య ఆసియా దేశాలకు, వ్యూహాత్మకంగా విస్తరించే క్రమంలో, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ బీఆర్ఐని తెరపైకి తీసుకుని వచ్చింది.
  స్వతర ఆర్థిక అభివృద్ధిని ఎరగా చూపి, ఆయా దేశాలను ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేసింది. అలాగే ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు భారీగా రుణాలు ఇచ్చింది. అవి ఎంతలా అంటే… IMF ఇచ్చే రుణాల కంటే ఎక్కువగా.! శ్రీలంక, కిర్గిజ్, తజకిస్తాన్, ఉక్రెయిన్, బెలారస్, ఇథియోపియా, కెన్యా, కాంబోడియా, ఇరాక్‌, జోర్డాన్‌ వంటి దేశాలకు చైనా భారీగా రుణాలిచ్చింది.!
  ఇక పాకిస్తాన్ కు అయితే IMF కంటే మూడు రెట్లు అధికంగా రుణాలు ఇచ్చింది డ్రాగన్ చైనా.! ఇలా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు భారీగా రుణాలివ్వడం.., అలాగే ఆయా దేశాలు…తిరిగి ఆ రుణాలు చెల్లించలేని పరిస్థితులను కల్పించడం.., తద్వారా ఆయా దేశాలను తన దారికి తెచ్చుకోవడంలాంటివి చేస్తోంది చైనా.!
  కొన్ని దేశాల్లో అయితే చైనా కంపెనీలు నిర్మించిన పోర్టులను 99ఏళ్ళపాటు లీజు పేరుతో పర్మినెంట్ గా చెజిక్కించుకుంది. శ్రీలంక… ఇలాగే తమ దేశంలో చైనా కంపెనీలు నిర్మించిన హంబన్ తోటా పోర్టును డ్రాగన్ కు వదులుకోవాల్సి వచ్చింది.
  ఇక సీపీఈసీ విషయానికి వస్తే… 2015లో చైనా , పాకిస్తాన్ లు ఈ ప్రాజెక్టు పై అధికారికంగా సంతకాలు చేశాయి. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు విలువ 47 బిలియన్ డాలర్లుగా పేర్కొనడం జరిగింది. ఇది పాకిస్తాన్ జీడీపీలో దాదాపు 20 శాతం. అయితే ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 62 బిలియన్లకు పెరిగింది.
  రాజకీయ ఏకాభిప్రాయం లేకుండానే ఆనాటి పాక్ ప్రభుత్వం.., పాక్ సైన్యం చేసిన ఒత్తిడితో, ఏకపక్షంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే పవర్‌ ప్రాజెక్టులు, స్పెషల్‌ ఎకనామిక్ కారిడార్లను సిద్ధం చేశారు. చైనాలోని జింజియాంగ్‌ ఫావిన్స్ నుంచి..పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా పాకిస్థాన్‌- బలుచిస్తాన్ లోని గ్వాదర్ తీరం వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. తద్వారా చైనాకు సులభంగా హిందూ మహాసముద్రానికి చేరుకునే మార్గం దక్కుతుంది.
  అయితే బలుచిస్తాన్ తీరంలోని గ్వాదర్ పోర్టును పూర్తిగా చైనా కంపెనీలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. అటు బలుచ్ ప్రజలు ఈ ప్రాజెక్టుకు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాము పాకిస్తాన్ లో భాగం కాదని, తమ ప్రాంతాన్ని పాక్ సైన్యం 1947లో ఆక్రమంగా ఆక్రమించుకుందని, ఇప్పుడు తమ ఖనిజ సంపాదను చైనా కంపెనీలకు పాక్ పాలకులు కట్టబెట్టారని బలుచ్ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. బెలుచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ప్రాజెక్టులో పనిచేసే చైనీయులే లక్ష్యంగా అనేక సార్లు ఆత్మాహుతి దాడులకు సైతం పాల్పడింది.
  అటు సింధ్ ప్రాంత ప్రజలతోపాటు, ఇటు తెహరికే ఏ తాలిబన్ పాకిస్తాన్….TTP వంటి టెర్రర్ గ్రూపులు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిమగ్నమైన చైనా కంపెనీలు, కార్మికులు లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. ఈ ఏడాది జులైలో టీటీపీ జరిపిన ఆత్మహుతి దాడిలో 14 మంది చైనా ఇంజనీర్లు చనిపోవడం జరిగింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులను నిలిచిపోయాయి. పాక్ లోని తమ కంపెనీల కార్యాలయాల్లోని సిబ్బందిని కరాచీకి తరలిచింది.
  అటు పాకిస్తాన్ లో ప్రస్తతం ఇమ్రాన్ ప్రభుత్వం తీవ్ర రాజకీయ అస్థిరత్వాన్ని ఎదుర్కొంటోంది. గతేడాది ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అరెస్టు చేసిన తమ నేతలను విడుదల చేయాలని కోరుతూ.. జమైతే ఉలేమా ఏ ఇస్లాంకు చెందిన కార్యకర్తలు లాహోర్ నుంచి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు లాంగ్ మార్చ్ ను నిర్వహిస్తున్నారు.
  మరోవైపు పాక్‌ ప్రభుత్వ అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుకొన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2020 డిసెంబర్‌ నాటికే పాక్ అప్పులు 294 బిలియన్‌ డాలర్లకు చేరుకొన్నాయి. ఇది పాకిస్థాన్‌ జీడీపీలో 109 శాతానికి సమానం. దేశీయ రుణదాతలకే 158.9 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. విదేశీ అప్పులు దాదాపు 115 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. గతేడాది పారిస్‌ క్లబ్‌ నుంచి 11 బిలియన్‌ డాలర్లు, వివిధ దేశాల నుంచి 33 బిలియన్‌ డాలర్లు, ఐఎంఎఫ్‌ నుంచి 7 బిలియన్‌ డాలర్లకు పైగా సమీకరించింది. అంతేకాదు, బాండ్ల రూపంలో కూడా అంతర్జాతీయంగా 12 బిలియన్‌ డాలర్ల నిధులను తీసుకొచ్చింది.
  అటు సకాలంలో రుణాలు చెల్లించలేకపోవడం , పాక్ కరెన్సీ విలువ పడిపోవడం, వేగంగా క్షిణిస్తున్న ఫారెక్స్ నిల్వలతో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రజలు భారీ స్థాయిలో నిరసనలు, ర్యాలీలు చేపడుతున్నారు . వరుస ఆందోళనలతో ప్రస్తుతం పాకిస్తాన్ అట్టుడుకుతోంది.
  ప్రధాని ఇమ్రాన్… పాకిస్తాన్ ను సర్వనాశనం చేస్తున్నాడని… తక్షణమే ఆయన రాజీనామా చేయాలని పాక్ ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లాహోర్‌లో ప్రజలు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరపగా.. ఇద్దరు మృతిచెందారు. అనేకమంది గాయపడ్డారు.
  ప్రస్తుత పాకిస్తాన్ దయనీయ పరిస్థితికి సీపీఈసీ ప్రాజెక్టును పాకిస్తాన్ మీడియా కారణంగా చూపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం చైనా కంపెనీలు అందించిన సొమ్మును పాక్ పాలకులు దారిమళ్లించినట్లుగా అక్కడి పత్రికలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఇప్పుడు తమ దేశానికి ఒక ఆర్థికవిపత్తులా మారిందని చెబుతున్నాయి. పాకిస్తాన్ సౌర్వభౌమాధికారాన్ని సైతం ప్రశార్థకం చేసేలా రుణాలు పెరిగిపోయాయని వాపోతున్నాయి.
  అయితే దేశంలో సీపీఈసీ ప్రాజెక్టుపై రోజు రోజుకు పెరిగిపోతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు…ఇమ్రాన్ ప్రభుత్వం తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. కరాచీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో CPEC పై ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించింది. చైనా, పాకిస్తాన్ ల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో ఊతమిచ్చే ఈ కారిడార్ ను చూసి…అమెరికా, భారత్ లు చూసి ఓర్వలేకపోతున్నాయని, ఈ ఎకనామిక్ కారిడార్ పూర్తిగా విజయవంతం కాకుండా…, పరోక్షంగా అడ్డంకులు సృష్టించేందుకు కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రాజెక్టు చీఫ్ గా వ్యవహారిస్తున్న ఖలీద్ మన్సూర్ తన అక్రోశాన్ని వెల్లగక్కాడు.
  భారత్ పై గుడ్డి వ్యతిరేకతతో… , డ్రాగన్ చైనాతో అంటకాగడమే కాకుండా.., అది వేసిన బీఆర్ఐ ఉచ్చులో చిక్కుకుని తన దేశ ఆర్థిక వ్యవస్థను పాకిస్తాన్ చేతులారా నాశనం చేసుకుందని విశ్లేషకులు అంటున్నారు.
  ఇప్పుడు ప్రాజెక్టు విఫలమైందని పాక్ పత్రికలే తేల్చిచెబుతుండటంతో.., ఆ దేశ ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు, పాక్ పాలకులు భారత్ , అమెరికాలపై నిందలు మోపుతున్నారన్నది నిజం.

  Trending Stories

  Related Stories