National

మాది ఉత్తుత్తి వ్యాక్సినే అంటున్న చైనా..!

మార్కెట్ లో ఏ వస్తువైనా ఆకర్షణీయంగా కనిపిస్తే.. తక్కువ రేటుకు లభిస్తే.. అది కచ్చితంగా చైనా వస్తువే అయి వుంటుంది. కానీ, నాణ్యత విషయంలో మాత్రం ఎలాంటి గ్యారెంటీ వుండదు. అదీ చైనా ప్రొడక్ట్ ప్రత్యేకత. పసిపిల్లలాడుకనే బొమ్మలైనా.. ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్లయినా.. చైనా బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గదు మరి. తన బ్రాండ్ ఇమేజ్ ను మరోసారి నిరూపించుకుంది చైనా. కరోనాను ప్రపంచం మీదికి ఉసిగొల్పి పబ్బం గడుపుకుంటున్న చైనాలో.. అంతర్గత రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కరోనా మూలాలను దాచేసి WHO టీమ్ ను సైతం మాయ చేసిన జిత్తులమారి.. టీకాల విషయంలోనూ నక్కజిత్తులు ప్రదర్శించింది. ఇన్నాళ్లూ తమ టీకాల గురించి గొప్పలు పోయిన చైనాకు.. స్వయంగా ఆ దేశ ఉన్నతాధికారే షాకిచ్చాడు.

తమ స్వదేశీయ వ్యాక్సిన్లకు కరోనా నుంచి కాపాడే సామర్థ్యం అధికంగా లేదని.. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చీఫ్ గావో ఫూ బాంబు పేల్చారు. అంతేకాదు, అసలు వీటిని వినియోగించాలా..? వద్దా..? అన్నదానిపై సమాలోచనలు జరపుతున్నామని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు మార్గాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు టీకాలను కలిపి.. వాటి సామర్థ్యాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. డోస్‌లకు మధ్య విరామం లేదా మోతాదుల సంఖ్యను పెంచడం.. లేదా వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించే వ్యాక్సిన్లను కలపడం తమ ముందున్న మార్గాలని తెలిపారు. సాధారణంగా రెండు వేర్వేరు వ్యాక్సిన్లను కలిపి అందజేయడాన్ని ప్రపంచ ఆరోగ్య నిపుణులు సమ్మతిస్తారని, ఎందుకంటే ఇది సురక్షితమైందన్నారు గావో. బ్రిటన్, ఇతర దేశాల్లో ఈ తరహా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాయని గుర్తుచేశారు. ఇతర దేశాల టీకాలపై ఒకప్పుడు అక్కసు వెళ్లగక్కిన చైనా.. ఇప్పుడు తమ వ్యాక్సిన్లపై తమ అధికారులే పెదవి విరుస్తుండటంతో.. నిజాన్ని అంగీకరించక తప్పలేదు. ఎంఆర్ఎన్ఏ విధానంలో కోవిడ్ టీకాలను అభివృద్ధి చేయడాన్ని గతంలో తప్పుబట్టిన గావో.. దీనివల్ల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ప్రస్తుతం మాటలను వెనక్కు తీసుకుని.. ఎంఆర్‌ఎన్‌ఏ విధానంలో టీకాలు తయారుచేసే ప్రక్రియను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

చైనా టీకాలను సంప్రదాయ టీకా ఉత్పత్తి విధానాన్ని ఉపయోగించి తయారుచేశారు. చైనాకు ఫార్మ సంస్థ సినోవ్యాక్ రూపొందించిన కరోనా టీకాకు 50.4 శాతం సామర్థ్యం ఉందని బ్రెజిల్‌ వెల్లడించింది. అదే అమెరికాలో అభివృద్ధి చేసిన ఫైజర్‌ టీకా సామర్థ్యం 97 శాతం అని రుజువైంది. అలాగే, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా 78 శాతం మేర ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడయ్యింది. ఇప్పటి వరకు చైనాలో 34 మిలియన్ల మందికి రెండు డోసుల టీకా అందజేసింది. మరో 64 మిలియన్ల మందికి ఒక డోసు వేశారు. ఇక టీకా దౌత్యం పేరిట వివిధ దేశాలను బుట్టలో వేసుకునేందుకు చైనా చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు.

ఇలా చైనా అధికారులే బహిరంగంగా ఆ దేశానికి చెందిన కోవిడ్ టీకాల పనితీరుపై మాట్లాడటం సంచలనంగా మారింది. కరోనా వైరస్ ను ప్రపంచానికి పరిచయం చేసిన చైనా.. దాని అంతానికి తొలి వ్యాక్సిన్‌ను కనుగొన్నది తామేనని జబ్బలు చరుకుకుంది. కానీ, దాదాపు ఏడాది తర్వాత చైనా దేశం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వట్టి డొల్లేనని ఆ దేశానికి చెందిన అధికారే ఒప్పుకోవడంతో.. చైనా ఏది చేసినా నాసిరకంగా వుంటుందన్నది మరోసారి రుజువైంది. చైనా దేశంలో జరిగేది ఒకటి.. బయటి ప్రపంచానికి తెలిసేది మరొకటని గావో మాటలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదిలావుంటే, నిజం చెప్పిన గావోకు ఇప్పుడు భయం పట్టుకున్నట్టుంది. ఎందుకంటే, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే శాల్తీలు గల్లంతవుతాయి కదా..! కరోనా గురించి బయటపెట్టిన డాక్టర్లు, సైంటిస్టులు, జర్నలిస్టుల గతి ఏమైందో ప్రపంచం మొత్తం చూసింది. దీంతో ఆందోళనకు గురయ్యాడో ఏమో.. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ వక్రభాష్యం మొదలు పెట్టాడు గావో. నిజానికి, గావో వ్యాఖ్యలను చైనా మీడియా పెద్దగా చూపించడం లేదు. అయితే ఆయన మొదట మాట్లాడినపుడు చైనా స్వదేశీ సోషల్ మీడియా సైట్‌ వీబోలో విమర్శలు వచ్చాయి. ‘మీరు మాట్లాడ్డం ఆపేస్తే మంచిదని’ కామెంట్లు కూడా కనిపించాయి. మొత్తానికి, నాసిరకంలో తాము నెంబర్ వన్ అని నిరూపించుకుంది చైనా. చెప్పడం మరిచిపోయా.. దేశాలన్నీ ఛీకొట్టి పక్కనపెట్టినా.. పాకిస్తాన్ మాత్రం చైనా వ్యాక్సిన్లనే కోరి మరీ దిగుమతి చేసుకుంది. అక్కడ లక్షల మందికి ఆ టీకాలు కూడా వేశారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటో..?

Related Articles

Leave a Reply

Your email address will not be published.

11 − eight =

Back to top button