కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంది. చైనానే మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలిందని ఇప్పటికే ఎంతో మంది చెప్పుకొచ్చారు. వుహాన్ లో అంతకు ముందు చోటు చేసుకున్న ఘటనలు కూడా ప్రపంచం ముందు చైనాను దోషిగా నిలబెట్టబోతూ ఉన్నాయి. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీకైనట్లు సాక్ష్యాలు ఉన్నప్పటికీ చైనా మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.వుహాన్ ల్యాబ్ నుండి లీక్ థియరీని ఆ బృందం సమర్థించలేదు.
ఇప్పుడు మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో వైరస్ లీక్ అంశాన్ని దర్యాప్తు చేయాలని భావిస్తూ ఉండగా.. తాజాగా చైనా స్పందించింది. వైరస్ మూలాల కోసం రెండవ సారి చేపట్టే దర్యాప్తును ఒప్పుకోమని చైనా తెలిపింది. విచారణ చేపట్టే ప్రణాళికను చైనా తోసిపుచ్చింది. ఈ నెలలో సరికొత్తగా దర్యాప్తు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో ప్రతిపాదించింది. చైనాలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌లను ఆడిట్ చేయడంతో పాటు వుహాన్‌లో ఉన్న జంతు మార్కెట్లను పరిశీలించాలనుకుంది.. కానీ అందుకు చైనా ఒప్పుకోవడం లేదు. ఈ దర్యాప్తును తాము అంగీకరించడం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ మంత్రి జెంగ్ యిక్సిన్ తెలిపారు. కొన్ని అంశాల్లో దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. సామాజిక స్పృహకు విరుద్ధమని, ఇది సైన్సును ధిక్కరిస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. చైనా ల్యాబ్‌ల్లో ఉన్న ప్రోటోకాల్స్‌లో ఉల్లంఘన జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఆరోపణల్లో నిజం లేదని చైనా వాదిస్తోంది. చైనా నిపుణులు చేసిన ప్రతిపాదనలు, సూచనలను ప్రపంచ ఆరోగ్యం సంస్థ సమీక్షిస్తుందని చైనా భావిస్తోంది. అంతేకాకుండా వైరస్ పుట్టుకను శాస్త్రీయ అంశంగా పరిగణించాలని.. రాజకీయ జోక్యాన్ని దూరం పెట్టాలని జెంగ్ యిక్సిన్ చెప్పారు. కొన్ని విషయాల్లో ఇది కామన్ సెన్స్ ని, సైన్స్ ని అతిక్రమించేదిగా ఉందని.. వైరస్ పుట్టుకపై అధ్యయాన్ని రాజకీయం చేయడాన్ని చైనా వ్యతిరేకిస్తోందని.. వైరస్ ఆనవాళ్ల కోసం కేవలం చైనాలో కాకుండా ఇతర దేశాల్లో పరిశోధనలు చేయాలని జెంగ్ డబ్ల్యూహెచ్‌వోకు తెలిపారు. ల్యాబ్ నుంచి వైరస్ లీకైనట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఈ అంశంపై ఎక్కువగా శ్రద్ధపెట్టడం కానీ, ఆలోచించడం వ్యర్థమే అని చైనా నిపుణులు కూడా అంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రతిపాదన.. తమ దేశ లేబొరేటరీల ప్రొటొకాల్స్ ఉల్లంఘన కారణంగానే రీసెర్చ్ సందర్భంగా వైరస్ లీక్ అయిందన్న అభిప్రాయానికి ఆస్కారమిచ్చే విధంగా ఉందని చైనా అంటోంది. వైరస్ అన్నదాన్ని సైన్స్ పరంగానే చూడాలి తప్పితే ఇందులో రాజకీయ పోకడలకు వెళ్లకూడదని చైనా చెబుతోంది. అంతేకానీ తమ దేశంలో మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారణకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతోంది. 2019లో వూహాన్ ల్యాబ్ నుండే వైరస్ బయటకు వచ్చిందని ప్రపంచ దేశాలు భావిస్తూ ఉన్నాయి. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా చైనాకు భారీ జరిమానా విధించాలని కూడా డిమాండ్ చేశారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా చైనా తయారు చేసిన జీవాయుధమని కూడా చెప్పారు. చైనా మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేస్తూ ఉంది.