ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టని చైనా మరోసారి కోవిడ్ విషయంలోనూ రుజువైంది. షాంఘై, బీజింగ్ నగరాల్లో విజృంభించిన వైరస్ ను చైనా కష్టపడి అదుపులోకి తెచ్చింది.
నెమ్మదించాయి అనుకున్న కరోనా కేసులు మరోసారి ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే చైనా, ఫ్రాన్స్ తో పాటు యూరప్ ఖండంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల చైనాలో పరిస్ధితులు దారుణంగా మారాయి. లాక్‌డౌన్, కఠిన ఆంక్షలతో అల్లాడిన చైనా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ కారణంగా.. దాదాపు నాలుగు నెలలుగా షాంఘై, బీజింగ్ నగరాల్లో జనం గుమిగూడే ప్రదేశాలైన షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్లు, విద్యా సంస్థలను ప్రభుత్వం మూసివేసింది. దీని కారణంగా 2.5 కోట్ల మందికిపైగా పూర్తి లాక్ డౌన్ లో ఉండాల్సి వచ్చింది. అయితే పరిస్ధితులు కుదుటపడటంతో ఇటీవలే కొద్దికొద్దిగా ఆంక్షలు సడలిస్తూ వచ్చారు అధికారులు.
మరోవైపు కోవిడ్ కట్టడి కోసం చైనా కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అమలు చేయడంతోపాటు అత్యంత భారీ ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించింది. దొరికిన వాళ్లకు దొరికినట్టుగా పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చినవారిని క్వారంటైన్ చేయడంతో పాటు కాంటాక్ట్ ట్రేసింగ్ చేశారు. ఈ చర్యలు ఫలించి కేసులు తగ్గుతూ వచ్చాయి. తాజాగా బీజింగ్, షాంఘైల్లో ఎట్టకేలకు సోమవారం ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా కూడా కేవలం 22 మాత్రమే కేసులు నమోదైనట్లు అక్కడి జాతీయ హెల్త్ కమిషన్ తెలిపింది.
కరోనా నియంత్రణలోకి రావడంతో బీజింగ్, షాంఘై ప్రావిన్స్ లలో పాఠశాలలను పున: ప్రారంభించారు. షాపింగ్ మాల్స్ వంటి వాటికి పరిమితులతో అనుమతులు ఇచ్చారు. ఇంకా కొన్ని చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి. టెస్టుల్లో నెగెటివ్ వచ్చినవారికి ప్రత్యేక యాప్ లో గ్రీన్ కోడ్ ఇస్తున్నారు. జనం ఎక్కడికి వెళ్లినా ఆ కోడ్ చూపాల్సి ఉంటుంది. ప్రతి మూడు రోజులకోసారి టెస్టులు చేయించుకుని, గ్రీన్ కోడ్ ను అప్ డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.