ఓ సోషల్ మీడియా బ్లాగర్ కు చైనా కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఇంతకీ అతను చేసిన తప్పేంటో తెలుసా..? గల్వాన్ లోయలో భారత సైనికుల చేతిలో హతమైన.. తమ దేశ సైనికుల మరణంపై సందేహం వ్యక్తం చేయడమే. అదే పని మన దేశంలో చేస్తే ఏం జరుగుతుంది..? ఏమీ జరగదు.. జవాన్లపై నోరు పారేసుకున్నా స్వేచ్ఛగా తిరిగేస్తారు.. మన విపక్ష నేతల్లాగా..
ఇక విషయంలోకి వె చైనా సైనికుల మరణంపై సందేహం వ్యక్తం చేసిన ఆ సోషల్ మీడియా బ్లాగర్ పేరు కియు జిమింగ్. చైనాలో ఇంటర్నెట్ సెలబ్రిటీగా పేరుగాంచిన జిమింగ్ కు 2.5 మిలియన్ల ఫాలోవర్లు వున్నారు. అమరవీరుల ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తించినందుకు.. అతనికి జైలు శిక్ష విధించడంతో పాటు.. బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా చైనా కోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని చైనా మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ తన అధికారిక ట్విటర్ లో పేర్కొంది.
కియు జిమింగ్ చేసిన నేరం ఒప్పుకున్నాడు కాబట్టి 8 నెలల జైలు శిక్షతో సరిపుచ్చింది. లేదంటే, మరణశిక్ష విధించినా ఆశ్చర్యం లేదు. చైనా సర్కార్ రూల్స్ అలా వుంటాయి మరి. సొంత పౌరుడైనా వదిలే సమస్యే లేదు. కరోనా విషయాన్ని బయటపెట్టిన డాక్టర్లు, జర్నలిస్టులకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చిందో మనం చూశాం. అలాంటిది చైనా సైన్యాన్ని కామెంట్ చేస్తే ఊరుకుంటుందా..?
గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. కియు జిమింగ్ ను గత ఫిబ్రవరిలోనే అరెస్ట్ చేయగా.. చైనా కోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది. గల్వాన్ ఘటనలో మరణించిన నలుగురు చైనా సైనికులు, గాయపడిన ఓ జవాను గురించి జిమింగ్ సందేహం వ్యక్తం చేశాడు. ఆ ఘటనలో కేవలం సాధారణ సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఉన్నతాధికారి ప్రాణాలతో బయటపడడాన్ని జిమింగ్ ప్రశ్నించిచాడు. అందుకే చైనా అధికారులు అతడిపై చర్యలకు ఉపక్రమించారు. చైనా చట్టాల ప్రకారం.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు, పైగా చైనా అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వీబోలోనే సమాచారాన్ని పోస్ట్ చేసినందుకు కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. ఇక కియు జిమింగ్ ను అరెస్ట్ చేసిన వెంటనే అతని వీబో అకౌంట్ ను కూడా సస్పెండ్ చేశారు.
ఇదిలావుంటే, అచ్చం కియు జిమింగ్ లా ప్రవర్తించిన మన విపక్ష నాయక శిఖామణులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. భారత జవాన్ల పరాక్రమంపై అవాకులూ చెవాకులు పేలిన కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులకు ఎలాంటి శిక్షలు లేవు. అదీ మన ప్రజాస్వామ్యం గొప్పతనం. ఆ వివరాలు కూడా చూద్దాం.
2020 జూన్ 15 రాత్రి భారత సైన్యంపై చైనా సైనికులు దొంగ దెబ్బతీశారు. గల్వాన్ లోయలోకి చొరబడటమే కాకుండా లద్దాక్ లో యధాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించారు. దీంతో ఇరు సైన్యాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో చైనా సైన్యాన్ని తిప్పికొట్టగలిగినా.. 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అటు భారత సైన్యం చేతిలో చైనాకు చెందిన 43 మంది పీఎల్ఏ సైనికులు హతమయ్యారు. అయితే, చైనా ఈ విషయాన్ని ఏనాడు ఒప్పుకోలేదు. తమ సైనికులెవరూ చనిపోలేదని, ఇది తప్పుడు సమచారం అంటూ ప్రచారం చేసింది.
ఇక, ఈ ఘటన తర్వాత మనదేశంలోని ది గ్రేట్ విపక్ష పార్టీలన్నీ మోదీ ప్రభుత్వంపై విరుచుపడ్డాయి. దీనిపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ రెచ్చిపోయారు. అసలు సైనికులు ఆయుధాలు ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 1993, 1996 అగ్రిమెంట్ ప్రకారం ఆ ప్రాంతంలో ఆయుధాలు ధరించరాదన్న విషయం తెలియని రాహుల్ జీ మోదీ ప్రభుత్వం వితండవాదం చేశారు. ఘర్షణలో 20 మంది కాదు.. ఇంకా ఎక్కువమందే భారత జవాన్లు మరణించి వుంటారని.. ప్రభుత్వం సైనికుల మరణాలను దాస్తోందంటూ రాద్దాంతం చేశారు.
గల్వాన్ కు ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంలో రాహుల్ గాంధీ సూచనలు అప్పట్లో చైనా బాగా ఉపయోగించుకుంది. అంతేకాదు, ఈ ఘటనతో చైనాతో గాంధీ కుటుంబానికి వున్న సీక్రెట్ రిలేషన్ షిప్ చాలాసార్లు వెలుగులోకి వచ్చింది. అటు డొక్లాం ఘర్షణల సమయంలో రాహుల్ చైనా అధికారులను కలుసుకోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఇలా ఒక్కసారి కాదు, రెండుసార్లు చైనా అధికారులతో రాహుల్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. డొక్లాం సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొన్న పరిస్థితుల్లో 2017లో చైనా అంబాసిడర్ తో భేటీ అయ్యారు రాహుల్. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇవి నకిలీ వార్తలంటూ కొట్టిపారేసింది. అటు చైనా రాయబార కార్యాలయం కూడా కాంగ్రెస్ కు వత్తాసుపలికుతూ అవి నకిలీ వార్తలంటూ ఖండించింది.
ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. ఇతర విపక్ష పార్టీలు కూడా గల్వాన్ విషాదాన్ని ఆయుధంగా చేసుకుని నిజానిజాలను పక్కనబెట్టి మోదీ సర్కార్ పై దాడి చేశాయి. భారత సైన్యం పరాక్రమంపై సందేహాలు వ్యక్తం చేస్తూ నోటికొచ్చినట్టు దూషించాయి. భారత జవాన్ల పరాక్రమాన్ని అపహాస్యం చేస్తూ.. చైనా వైపు ఎవరూ చనిపోలేదంటూ డ్రాగన్ కు వంతపాడాయి. ఇక, మొదట ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వాదించిన చైనా.. కొన్ని నెలల తర్వాత గల్వాన్ లో మరణించిన నలుగురు సైనికులకు మరణానంతరం మెడల్స్ ప్రధానం చేయడంతో విపక్షాల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది.
ఇక ప్రస్తుతానికి వస్తే.., అక్కడి సైనికులపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకే చైనా కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. మరి, భారత జవాన్ల వీరత్వాన్ని చులకన చేసిన ఈ విపక్ష నాయకులు ఎలాంటి శిక్ష విధించాలి. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి విపక్షాల ఆటలు సాగుతున్నాయి. వీర జవాన్లను తక్కువ చేసి మాట్లాడినా వాళ్లు ఇంకా ఎలాంటి శిక్షలు పడటం లేదు. అదే మన విపక్ష నాయకులు చైనాలో వుంటే.. ఈపాటికి అక్కడి ప్రభుత్వం ఉప్పు పాతరేసేది.