ఊహించిందే నిజమైంది. చైనా డైరెక్షన్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ యాక్షన్ థ్రిల్లర్ చూపించింది. కరోనా మూలాలు తేల్చేందుకు.. నెల్లాల్లుగా చైనాలో చెమటలు కక్కిన.. సారీ.. చెమటలు కక్కినట్టు నటించిన WHO బృందం.. చివరికి డ్రాగన్ ఒత్తిడికి తలొగ్గింది. మొదటి నుంచి చైనాకు తొత్తుగా వ్యవహరిస్తున్న టెడ్రోస్ అథనోమ్ అండ్ పార్టీ.. ఊహించినట్టుగానే బీజింగ్‌కు అనుకూలంగా నివేదికను వండివార్చింది. కరనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లో పుట్టనేలేదని.. గబ్బిళాల నుంచే వ్యాప్తి చెందిందని తేల్చేసింది. ప్రస్తుతానికి తుది నివేదిక రాకున్నా.. వెలుగులోకి వచ్చి డ్రాఫ్ట్ నివేదిక తప్పుల తడకలా వుంది.
2019 డిసెంబర్లో పురుడుపోసకుని.. నేడు ప్రంపచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందంటే.. ఎవరైనా చైనా అని టక్కున సమాధానం చెబుతారు. వూహాన్‌లోని లెవల్ 4 ల్యాబ్‌లో ఉద్భవించిందనడానికి వందలకొద్ది ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే, ఆధారాలన్నింటినీ చాకచక్యంగా సమాధిచేసింది చైనా. వైరస్ గురించి బయటపెట్టిన డాక్టర్లు, జర్నలిస్టుల ప్రాణాలు తీసింది. ఎందర్నో గృహనిర్బంధం చేసి చిత్రవధకు గురిచేసింది. ఇదంతా జగమెరిగిన సత్యం. కానీ, కరోనా మూలాలు కనుగొనేందుకు చైనాలో పర్యటించిన WHO బృందం మాత్రం.. ఇందుకు భిన్నంగా నివేదిక తయారు చేసింది. చైనా బృందంతో కలిసి.. క్షేత్రస్థాయిలో పర్యటించిన WHO వైద్య నిపుణులు.. కరోనా వైరస్ మూలాలపై సమాచారం సేకరించి, నివేదిక విడుదల చేశారు.
డబ్ల్యూహెచ్‌వో – చైనా ఉమ్మడి బృందం అధ్యయనంలో కరోనా వైరస్ మూలాలు గబ్బిలాల్లోనే ఉన్నట్లు తేల్చేసింది. గబ్బిలాలు, శీతలీకరించిన ఆహారం ద్వారానే వైరస్ వ్యాప్తి జరిగి ఉంటుందని తెలిపింది. WHO రూపొందించిన నివేదిక ముసాయిదాను ది అసోసియేటెడ్ ప్రెస్ సంపాదించింది. ఈ నివేదికలో కరోనా వైరస్ గబ్బిలాల నుంచి ఒక మధ్యంతర జంతువులోకి వ్యాపించి.. వాటి నుంచి మనుషుల్లోకి ప్రవేశించి వుండవచ్చని అనుమానాలను వ్యక్తం చేసింది. ఇదంతా ఒకెత్తయితే, కరోనా వైరస్ వ్యూహాన్ ల్యాబ్ లో పుట్టిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పరిశోధాన బృందం తేల్చిచెప్పింది. అటు సముద్ర జీవుల మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందిదనేది ఓ కట్టు కథేనని కొట్టిపారేసింది.
నిజానికి, కరోనా వైరస్ మూలాలపై ప్రంపచ ఆరోగ్య సంస్థ ముందుగానే అధ్యయనం చేసినప్పటికీ నివేదికను బయటపెట్టలేదు. దీనిపై చైనా వివరణ ఇచ్చిన తర్వాతే.. WHO బృందం నివేదికను వెల్లడించింది. అయితే, సరిగ్గా చైనా ఏదైతే వివరణ ఇచ్చిందో.. సరిగ్గా అవే అంశాలు WHO నివేదికలోనూ వుండటం.. నివేదికను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా.. ఆలస్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కరోనా వ్యాప్తికి తామే కారణమన్న అపవాదను తొలగించుకోవడానికి చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డ్రాఫ్ట్ నివేదికను జెనీవాకు చెందిన ఓ దౌత్యవేత్త బయటపెట్టిన అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. అయితే తుది నివేదికను ఇలాగే విడుదల చేస్తారా..? లేక ఏవైనా మార్పులు చేస్తారా..? అన్నదానిపై ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టత లేదు.
కరోనా మూలాలను కనిపెట్టేందుకు WHOకు చెందిన అంతర్జాతీయ నిపుణుల బృందం జనవరిలో వుహాన్‌లో పర్యటించింది. చైనా శాస్త్రవేత్తలతో కలిసి అధ్యయనం చేసింది. ప్రస్తుతానికి డ్రాఫ్ట్ నివేదిక బయటికొచ్చినా.. తుది నివేదికపై రెండు పక్షాలూ ఆమోదం తెలపాల్సి ఉంది. అది ఎప్పుడు వెలువడుతుందన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటి కరోనా విషయంలో చైనా నిజాల్ని దాచిపెడుతోందని అమెరికాతో పాటు అనేక దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, డ్రాఫ్ట్ నివిదేకలో అనేక లోటుపాట్లు ఉండటం.. WHO రిపోర్టు.. చైనా రిపోర్టుకు జిరాక్స్ కాపీలా వుంటడం అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. నివేదికలో పొందుపరిచిన అనేక అంశాలపై క్లారిటీ లేదని.. కొన్ని అంశాలు షాకింగ్‌గా ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ స్పష్టం చేసింది.
మరోవైపు, WHO బృందం అధ్యయనానికి చైనా సహకరించలేదనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించాలనుకున్న బృందం సభ్యులకు అనుమతులు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టించినట్టు తెలుస్తోంది. వూహాన్లో వేలమంది నుంచి రక్త నమూనాలను సేకరించి అధ్యయనం చేయాలనుకున్నామని.. కానీ, ఇందకు చైనా అధికారులు ఒప్పుకోలేదని.. WHO బృందానికి నేతృత్వం వహించిన పీటర్ బెన్ ఎంబారెక్.. గతంలోనే ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా ఛానెల్ ఇంటర్వ్వూలో చెప్పారు. 2019 డిసెంబర్ లోనే వూహాన్ లో డజనుకు నావెల్ కరోనా వైరస్ స్ట్రెయిన్ లను గుర్తించినట్టు పీటర్ వెల్లడించారు. అప్పటికే శాస్త్రవేత్తలకు 13కు పైగా వైరస్ ఉత్పరివర్తాలను గుర్గించారని అన్నారు. దీనిని బట్టి వూహాన్ లో 2019 డిసెంబర్ కన్నా కొన్ని నెలల ముందే వైరస్ వ్యాప్తి చెందిందని చెప్పారు.
కేవలం పీటర్ మాత్రమే కాదు.. 17 మంది చైనా సైంటిస్టులతో కలిసి పనిచేసిన 17 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సైతం ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ఆధారాలను తొక్కిపెట్టేందుకు కమ్యూనిస్టు చైనా పకడ్బందీగా వ్యవహరించిందని.. వైరస్ మూలాలను వేరే దేశానికి అంటగట్టే ప్రయత్నం కూడా చేసిందనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అందుకే, అంతర్జాతీయ శాస్త్రవేత్తలను అనుమతించేందుకు ఓ పట్టాన ఒప్పుకోలేదని తెలుస్తోంది.