More

    POK స్వాధీనం సాధ్యమా..? ‘వఖాన్’లో చైనా ఆర్మీ బేస్..!

    భౌగోళిక సరిహద్దులు తీర్చుకునే ప్రతీకారంలో ఆధునిక ఆయుధ సంపత్తి దూదిపింజల్లా తేలిపోతుంది. అధీన రేఖలు లెక్కలేనన్ని ప్రాణాలను బలితీసుకుంటాయి. ‘గ్రేట్ గేమ్’ గా చరిత్రలో తారసపడే బ్రిటీష్-రష్యా సామ్రాజ్యాల పరస్పర పోటీ అవి ఆక్రమించుకున్న దేశాల్లో అనేక సమస్యలను సృష్టించాయి. వలస రాజ్యాలను వీడుతున్న కాలంలో దేశాలుగా విభజించి, భౌగోళిక సరిహద్దుల గుర్తింపులో అనేక వివాదాలను ఉధ్దేశపూర్వకంగా సృష్టించి సంపన్న దేశాలు వెళ్లిపోయాయి. ఈ సరిహద్దు వివాదాలను అగ్రదేశాలు అనంతర కాలంలో తమ ప్రయోజనాలకు వాడుకున్నాయి. నేటికీ వాడుకుంటున్నాయి.

    మెక్ మోహన్ రేఖ, రాడ్ క్లిఫ్ అవార్డ్, డురాండ్ లైన్ సరిహద్దు వివాదాలు అతి ముఖ్యమైనవి. దక్షిణాసియాతో పాటు ఆగ్నేయాసియాలోనూ అనేక సరిహద్దు వివాదాలు నేటికీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి. భారత దేశానికి పాకిస్థాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాలతో సరిహద్దు వివాదాలు నేటికీ ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. ప్రభుత్వాల చొరవ కారణంగా బంగ్లాదేశ్, శ్రీలంకలతో ఉన్న వివాదాలు పాక్షిక పరిష్కారానికి నోచుకున్నాయి.

    తాలిబన్లు మరోసారి ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకున్న నేపథ్యంలో భారత్ కు సరిహద్దు ప్రమాద తీవ్రత హెచ్చింది. ఏక కాలంలో చైనా, పాకిస్థాన్, నేపాల్ దేశాలతో సరిహధ్దు సమస్యలను ఎదుర్కొంటున్న భారత్ కు అదనంగా ఆఫ్ఘనిస్థాన్ మరో సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. పీఓజేకే కు ఆనుకుని ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లోని బదక్షాన్ ప్రావిన్స్ లో ఉన్న వఖాన్ కారిడార్ కశ్మీర్ లోయలో ఉగ్రవాదం పెచ్చరిల్లేందకు కారణమతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ తాలిబన్ నాయకులను కలిసి కశ్మీర్ వేర్పాటు విషయంలో సహకరించమని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ వైఖరి విషయంలో  సందేహాలు తీవ్రమవుతున్నాయి.

     నిజానికి తొంభయ్యో దశకంలో సోవియట్ సేనలను ఓడించిన తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత కశ్మీర్ లోయలో ఉగ్రవాద సమస్య తీవ్రమైంది. 1990ల తర్వాతే కలష్నికోవ్ లాంటి ఆత్యాధునిక రైఫిళ్లు టెర్రరిస్టుల చేతుల్లోకి వచ్చిచేరాయి.

    వీలైనంత త్వరలో పాక్ ఆక్రమిత జమ్మూ-కశ్మీర్ లోని గిల్గిత్ బాల్టిస్థాన్ సహా ఆజాద్ కశ్మీర్ అని పాక్ పేర్కొంటున్న ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న అంశాన్ని కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖలు పరిశీలిస్తున్నాయి.

    మహాదళాధిపతి బిపన్ రావత్ నేతృత్వంలో త్రివిధ దళాలు, ఎన్ఎస్ఏ పీఓజేకే స్వాధీన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వఖాన్ కారిడార్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? దాని చారిత్రక నేపథ్యం ఏంటి? జమ్మూ-కశ్మీర్ భారత్ లో విలీనమైనపుడు ఎంత భూభాగం భారత్ స్వాధీనంలోకి వచ్చింది? ఎంత పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది? చైనా ఆక్రమిత లఢక్ లో ఎంత భూభాగం ఉంది? పీఓజేకే భారత్ స్వాధీనంలోకి వస్తే ‘పంజ్ షేర్’ తిరుగుబాటుదారులకు సహకారం అందించవచ్చా? గతంలో భారత్ పంజ్ షీర్ ముజాహిదీన్ నేత అహ్మద్ షా మసూద్ కు నిజంగానే సహకరించిందా?

    మరుగున పడిన ఇలాంటి ఆసక్తికరమైన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. భౌగోళిక సరిహద్దు వివరాలను, కచ్చితమైన సమాచారన్ని తెలుసుకునేందుకు ‘’Sp’s Land forces’’ మాస పత్రిక నుంచి సేకరిస్తున్నాం. ఈ మేగజైన్ 1964 నుంచి భారత సైన్యం, భూభాగాలు, సరిహద్దుల గురించి సాధికారికమైన వివరాలను, సాంకేతిక అంశాలను వెల్లడిస్తోంది.  

    తాజాగా ఆఫ్ఘనిస్థాన్ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ సమస్య తరచూ చర్చకు వస్తోంది. పౌరసత్వ చట్ట సవరణ సందర్భంలో లోక్ సభలో జరిగిన చర్చను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మన సరిహద్దుల పట్ల, దేశ సమగ్రత పట్ల అత్యున్నత చట్టసభలో ఉన్న సభ్యుల వైఖరి ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలుస్తుంది.

    సీఏఏ బిల్లు చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా వివిద దేశాలతో భారత్ కు ఉన్న సరిహద్దులను, అక్కడి నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి వివరాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ తో భారత్ 106 కిలోమీటర్ల సరిహద్దు ఉందంటూ వెల్లడించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఆఫ్ఘనిస్థాన్ తో భారత్ కు సరిహద్దు ఎక్కడ ఉందంటూ ఎగతాళి చేశారు. పాక్ ఆక్రమిత జమ్మూ-కశ్మీర్ పాలనాపరంగా భారత్ లో లేకపోయినా చారిత్రకంగా, సాంకేతికంగా పీఓజేకే మనదేశంలో అంతర్భాగం.

    ఆఫ్ఘనిస్థాన్ లోని బదక్షాన్ ప్రావిన్స్ లో ఉండే వఖాన్ కారిడార్ పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిత్ బల్టిస్థాన్ కు ఉత్తరాన 108 కి.మీ దూరంలో ఉంటుంది. అంటే సాంకేతికంగా పాక్ ఆక్రమిత జమ్మూ-కశ్మీర్ తో భారత్ సరిహద్దు పంచుకుంటన్నట్టే అనే ఇంగితాన్ని మరిచిపోయారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు.

    బదక్షాన్ ప్రాంతంలో 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోని మూడు అతిపెద్ద పర్వత శ్రేణులు హిందూ కుష్, కరాకోరమ్, పామీర్ కలిసే చోట ఉంటుంది.

    జమ్మూ-కశ్మీర్ విలీనం 1947 అక్టోబర్ లో జరిగింది. జమ్మూ-కశ్మీర్ మొత్తం వైశాల్యం 2లక్షల22వేల 236 కి.మీ. ప్రస్తుతం భారత్ ఆధీనంలో ఉన్న జమ్మూ-కశ్మీర్ వైశాల్యం కేవలం లక్షా 6వేల 566 కి.మీ. పాకిస్థాన్ ఆదీనంలో ఉన్న భూభాగం వైశాల్యం 72వేల 935 కి.మీ. ఇందులో 5వేల 180 కి.మీటర్ల భూభాగం ఉన్న షక్స్ గామ్ లోయను పాకిస్థాన్ 1963లో చైనాకు లీజుకు ఇచ్చింది.

    చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ వైశాల్యం 37వేల 555 కి.మీ. అంటే మొత్త 42 వేల 735 కి.మీటర్ల భూభాగం చైనా ఆధీనంలో ఉంది. జమ్మూ-కశ్మీర్ భూభాగంలో సగానికి పైగా చైనా, పాకిస్థాన్ చేతుల్లో ఉంది. ప్రస్తుతం చైనా-ఆఫ్ఘనిస్థాన్ మైత్రి నేపథ్యంలో గిల్గిత్-బల్టిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ‘వఖాన్ కారిడార్’ మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి.

    ‘వఖాన్ కారిడార్’ చారిత్ర నేపథ్యం, ప్రాధాన్యత, ప్రమాదం మూడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    చైనాను మధ్యదరా సముద్రంతో కలుపుతూ క్రీ.శ. మొదటి, రెండో శతాబ్దంలో నిర్మించిన సిల్క్ రూట్‌లో వఖాన్ కారిడార్ ఎన్నో ఏళ్లతరబడి ప్రధాన భాగంగా ఉంటూ వచ్చింది. ఈ మార్గంలో వెళ్లే వ్యాపారులు చైనా పట్టు, రోమన్ బంగారం, ఇక్కడి ఆఫ్ఘన్ రత్నాలు లాంటి వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. 13వ శతాబ్దంలో మార్కోపోలో ఈ ప్రాంతం మీదుగానే చైనా వెళ్లారని, ఢిల్లీ సుల్తాను సికిందర్ షా లోడీ కూడా ఇదే దారిలో ప్రయాణించారని చెబుతారు. మనకు ఇక్కడ ఆనాటి ప్రాచీన రహదారుల గుర్తులు, ఆ దారిలో బస చేసిన ప్రాంతాలు, బుద్ధుడి ప్రతిమల ఆనవాళ్లు కనిపిస్తాయి.

    19వ శతాబ్దంలో బ్రిటన్, రష్యా మధ్య జరిగిన గ్రేట్ గేమ్‌లో వఖాన్‌ది చాలా కీలక పాత్ర. రష్యా, బ్రిటన్ మధ్య ఆసియా యుద్ధం జరుగుతున్నప్పుడు అఫ్గానిస్తాన్ చాలా ముఖ్యమైన ప్రాంతంగా ఉండేది. ప్రత్యర్థి దేశాల సరిహద్దులు ఒకదానితో ఒకటి కలవకుండా వఖాన్ ప్రస్తుత సరిహద్దులను అప్పట్లో ఒక బఫర్ జోన్‌లా ఉయోగించారు. వఖాన్ గతంలో కోల్డ్ వార్‌లో కూడా కీలక పాత్ర పోషించింది.

    ఇప్పుడు చైనా బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ వల్ల ఇది మరోసారి ప్రముఖ వ్యాపార మార్గం అయ్యే అవకాశం ఉంది. ఇందుకు తాజా ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు దోహదం చేసే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే తాలిబన్లు పాలనావసరాల కోసం ఆర్థిక వనరుల వేట మొదలుపెడతారు.

    అప్పు ఇచ్చి ఉచ్చు బిగించడంలో ఆరితేరిన చైనా తాలిబన్లను తన చెప్పుచేతల్లో ఉంచుకుని వఖాన్ కారిడార్ లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఇది మరింత ప్రమాదకరమైన పరిణామంగా చెపుతారు నిపుణులు. కొంత కాలం క్రితం వరకూ ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్ లోని బదక్షాన్ ప్రావిన్స్ లోని ఇష్కాషిమ్ పట్టణం నుంచి ఉండే మట్టి రోడ్డు కారిడార్ మధ్యలో ఉన్న బ్రొగిల్ లోయ సరిహద్దు వరకే ఉండేది.

    తర్వాత అక్కడ నుంచి తూర్పు వైపు పర్యటించాలంటే కాలినడకన లేదా జంతువులపై వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ నిర్మించడం వల్ల ఈ దారిని 75 కిలోమీటర్లు బొజయీ గంబాజ్ గ్రామం వరకూ వచ్చేలా పొడిగించారు. అది వఖాన్ మొత్తం పొడవులో మూడో వంతు ఉంటుంది. ఈ రహదారిని గతంలో కిర్గిజ్ సంచార జాతులు ఉపయోగించిన పాత దారిమీదనే నిర్మిస్తున్నారు. ఇప్పుడు బుల్డోజర్లు వచ్చాయి.

    ఒక చిన్న కాలి బాట లాంటిది నిర్మించారు. దీనిపై ఒక పెద్ద రోడ్డు నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చైనా మధ్యాసియా మార్కెట్ రవాణా కోసం రహదారి నిర్మిస్తోంది. ఈ మార్గం పూర్తయితే మధ్యఆసియా మార్కెట్లను చేరుకోవడం చైనాకు సులువవుతుంది. చైనా నిర్మాణాలపై వఖాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వఖాన్ కారిడార్ సౌకర్యాల లేమి ఉన్నా, చైనా రాక వల్ల వఖయా సంస్కృతి నిష్క్రమిస్తుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాకృతిక సౌందర్యం, విశ్వాసాన్ని నింపే పర్వతాలు అన్నీ మాయమైపోతాయన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు వఖాన్ కారిడార్ వాసులు. 2022లో ఈ రహదారి మార్గం పూర్తవుతుంది. తాలిబన్ల రాకతో మరింత త్వరగా పూర్తయినా ఆశ్చర్యం లేదంటారు నిపుణులు.

    పీఓజేకేలోని మరో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం గిల్గిత్-బాల్టిస్థాన్. భౌగోళికంగా గిల్గిత్-బల్టిస్థాన్ కు అఫ్గానిస్తాన్‌, ఇరాన్‌ల‌తో సంబంధాలున్నాయి. ఆసియాలోని బంగారం, రాగి, స‌హ‌జ వాయువు లాంటి వ‌న‌రులు పుష్క‌లంగా ఉండే ప్రాంతాల్లో బ‌లూచిస్తాన్ ఒక‌టి. చైనా ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టుల్లో ఈ ప్రాంతానికి ప్ర‌త్యేక స్థాన‌ముంది.

    ఈ ప్రాంతం ప్రాధాన్యతను చైనా ఎప్పుడో గుర్తించింది. ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ కాలం నుంచీ దీనిపై చైనా దృష్టి ఉంది. చైనా ప‌శ్చిమ స‌రిహ‌ద్దుల‌పై ఎప్పుడూ వ్యూహాత్మ‌క నిఘా ఉంటుంది. ఇరాన్‌, యూరప్ తోపాటు మ‌ధ్య ఆసియాలోని దేశాల‌ను చేరుకునేందుకు ఈ ప్రాంతం చాలా కీల‌కం. ఈ ప్రాంతాల గుండా వాణిజ్య సంబంధాల‌కు చైనా ఎప్ప‌టినుంచో ప్రాధాన్యం ఇస్తోంది. వ్యూహాత్మ‌క కోణంలోనూ చైనాకు ఇది ముఖ్య‌మైన ప్రాంతం.

    ద‌క్షిణ‌ చైనా స‌ముద్రంలో అమెరికా ఎప్ప‌టినుంచో త‌మ నౌక‌ల‌ను మోహ‌రించింది. చైనాకు కీల‌క‌మైన వాణిజ్య మార్గం మ‌ల‌క్కా జ‌ల‌సంధిలో ఈ నౌక‌లు ఉన్నాయి. ఇవి చైనా ప్ర‌యోజ‌నాల‌కు అడ్డుగా మారే అవ‌కాశ‌ముంది. తూర్పువైపు జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, తైవాన్ లాంటి దేశాలు.. చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్నాయి. ప‌శ్చిమాన త‌మ మిత్ర‌దేశం పాకిస్తాన్ ఉంది.

    చైనా వేరే మార్గంలో త‌మ స‌ర‌కుల‌ను త‌ర‌లించాల‌నుకుంటే.. బ‌‌లూచిస్తాన్ అత్యుత్త‌మ‌మైన మార్గం. బ‌లూచిస్తాన్‌లోని గ్వాద‌ర్ నుంచి చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతాల‌ను అనుసంధానిస్తూ దాదాపు మూడు వేల కి.మీ. మేర C-PEC కారిడార్ నిర్మిస్తోంది. ఈ కారిడార్‌తో చైనాకు హిందూ మ‌హాస‌ముద్రం నేరుగా అందుబాటులోకి రానుంది.

    పాకిస్తాన్‌లో తమను బలవంతంగా, చట్టవిరుద్ధంగా కలిపారన్నది చాలా మంది బలూచిస్తాన్ ప్రజల భావన. 1948లో ఈ సమస్య మొదలైంది. బ్రిటీష్ పాలకులు వెళ్లిపోయాక బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ కూడా దీనికి సమ్మతి తెలిపింది. కానీ, ఆ తర్వాత మాట మార్చింది. 1970 నుంచే పాక్‌ గిల్జిట్‌-బల్టిస్థాన్‌ను ‘నార్తర్న్‌ ఏరియాస్‌’ గా ప్రకటించింది.

    గిల్గిత్‌ ఏజెన్సీని, బల్టిస్థాన్‌ను, పక్కనే ఉన్న చిన్న చిన్న రాజసంస్థానాలు- హుంజా, నగర్‌లను విలీనం చేసి ప్రత్యేక పాలనా మండలిగా చేసింది. 2009లో దానికి పరిమిత స్వయం ప్రతిపత్తి కల్పించింది. సుమారు 73వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ ప్రాంత జనాభా దాదాపు 16 లక్షలు. ఒకప్పుడిది షియా ప్రాబల్యప్రాంతం. వీరంతా భారత్ కు మద్దతు ఇస్తున్నవారే! పాకిస్థాన్ ఇటీవలే గిల్గిత్-బల్టిస్థాన్ ను ఐదో ప్రావిన్స్ గా ప్రకటించింది. ఎన్నికలు కూడా జరిపింది.

    ది హిందూ పత్రిక సెప్టెంబర్ 1. 2019న ‘‘How India secretly armed Afghanistan’s Northern Alliance’’ శీర్షికన ఓ కథనాన్ని ప్రచురించింది. 1996 నుంచి 2001 వరకూ భారత ప్రభుత్వం పంజ్ షేర్ తిరుగుబాటు నేత అహ్మద్ షా మసూద్ కు భారత ప్రభుత్వం రహస్యంగా చేసిన సాయం గురించి ఈ కథనం పేర్కొంది. తాజిక్ రాజధాని దుశాన్బే కేంద్రంగా భారీ ఎత్తున వైద్యసాయంతో పాటు ఇతర లాజిస్టిక్ సపోర్ట్ చేసినట్టూ ఈ కథనం వెల్లడించింది. భారత ప్రభుత్వానికి అనేక దౌత్యపరమైన సవాళ్లు ఎదురవుతున్న సమయంలో పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ-కశ్మీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పంజ్ షేర్ తిరుగుబాటు నాలుక్కాలల పాటు నిలదొక్కుకుంటే, పీఓజేకే ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత అహ్మద్ మసూద్, అమ్రుల్లా సాలెహా ద్వయానికి మన దేశం సాయం చేయనుందా? ఇవన్నీ ప్రస్తుతానికి ఊహజనితంగా కనిపించే ప్రశ్నలే అయినా భవిష్యత్తులో వాస్తవ రూపం దాల్చేందుకు ఉన్న అవకాశాలను తిరస్కరించలేం.

    Related Stories