More

    తెలంగాణపై డ్రాగన్ కన్ను..!
    విద్యుత్ గ్రిడ్ కూల్చే యత్నం..

    డోక్లాం‎లో చొరబడితే తన్ని తరిమేశాం. గల్వాన్‎లో కలపడితే కాళ్లు విరగ్గొట్టాం. లద్దాక్‎లో లాడాయికొస్తే లాగి లెంపకాయ కొట్టాం. భారత్ బరిలోకి దిగితే ఎలావుంటుందో చుక్కలు చూపించాం. అంతర్జాతీయ వేదికలపైనా చైనా కుయుక్తులను ఎండగట్టాం. డ్రాగన్ యుద్ధతంత్రానికి ఎక్కడికక్కడ చెక్ పెడుతూనేవున్నాం. ఆర్థిక చొరబాట్లను అడ్డుకుంటున్నాం. దీంతో దిక్కుతోచని బీజింగ్.. కొత్త ఎత్తులు వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు కుటిల ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సైబర్ ఎటాక్‎లను మొదలు పెట్టింది.

    దేశ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో చైనాకు చెందిన హ్యాకర్లు దేశంలోని విద్యుత్‌ గ్రిడ్లు, నౌకాశ్రయాలపై సైబర్‌ దాడులకు ప్రయత్నించారని అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఇటీవలే వెల్లడించింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో.. ఆ దేశ ప్రభుత్వ మద్దతుతో పనిచేస్తున్న కొన్ని గ్రూపులు మన దేశ కంప్యూటర్‌ వ్యవస్థ, డాటా సెంటర్లు, రక్షణ వ్యవస్థను హ్యాకింగ్‌ చేయవచ్చన్న అనుమానాలు ఇదివరకే వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అవే అనుమానాలు నిజమవుతున్నాయి. గతేడాది అంటే.. గల్వాన్ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత.. అక్టోబర్ 12న ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విద్యుత్ సంక్షోభానికి చైనా సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాకు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ తన అధ్యయనంలో తేల్చింది.

    ఇటీవల భారత్ స్టాక్ మార్కెట్ పైనా చైనా సైబర్ దాడిచేసింది. కొన్ని గంటలపాటు ఎన్ఎస్ఈ నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్ సర్వర్లు మొరాయించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే, చైనా పన్నాగాన్ని ముందే పసిగట్టిన భారత్.. విపత్తు నుంచి గట్టెక్కింది. ఇక, స్టాక్ మార్కెట్లపై డ్రాగన్ పన్నాగం పారకపోయేసరికి, ఆ వెంటనే విద్యుత్ గ్రిడ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. గతేడాది ముంబైలో విద్యుత్ వ్యవస్థపై ఎటాక్ చేసినట్టే.. తాజాగా తెలంగాణలోనూ విద్యుత్ సర్వర్లను హ్యాక్ చేసేందుకు చైనా యత్నించింది. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సర్వర్లలోకి చైనాకు చెందిన థ్రెట్ యాక్టర్ హ్యాకింగ్ గ్రూప్ ప్రవేశించి.. విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించింది. 49 సబ్‌స్టేషన్లలోకి చైనీస్ మాల్‌‌వేర్ ప్రవేశించినట్టు గుర్తించిన.. ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని హెచ్చరించింది. చైనాకు చెందిన ‘కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్లు’.. తెలంగాణ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ తోపాటు తెలంగాణ ట్రాన్స్‌కో కంప్యూటర్‌ సిస్టంలతో ‘కమ్యూనికేట్‌’ కావడానికి ప్రయత్నిస్తున్నాయని, విద్యుత్‌ వ్యవస్థ భద్రత దృష్ట్యా సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో అప్రమత్తమైన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ.. వెంటనే టీఎస్ జెన్ కో, టీఎస్ ట్రాన్స్ కో యాజమాన్యాలను అలర్ట్ చేసింది. తెలంగాణ ఎస్ఎల్‌డీసీపై చైనా హ్యాకర్లు దాడికి యత్నించిన విషయాన్ని పసిగట్టిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ విద్యుత్ రంగ సంస్థలకు సూచించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర విద్యుత్ సాంకేతిక విభాగం.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ముప్పు తప్పింది.

    మొదట దాడికి గురైన సబ్‌స్టేషన్లకు, ఎస్‌ఎల్డీసీతో ఉన్న కనెక్షన్‌ను నిలిపివేశారు. ఈ సబ్‌ స్టేషన్లను ఎక్కడికక్కడ ఐసొలేట్‌ చేశారు. సీఈఆర్టీ-ఇన్‌ నుంచి వచ్చిన పలు ఐపీ అడ్రస్‌లను పరిశీలించారు. వీటిలో రెండు ఐపీలపై అనుమానాలు బలపడటంతో వెంటనే వాటిని బ్లాక్‌చేశారు. ఎస్‌ఎల్డీసీ, స్కాడా రక్షణ వ్యవస్థకు సంబంధించిన సర్వర్లలోకి ప్రవేశించే అవకాశం ఉన్న అధికారులు, సిబ్బంది, ఇంజినీర్ల క్రెడెన్షియల్స్‌, పాస్‌వర్డ్‌లను కూడా మార్చివేశారు. చైనా హ్యాకర్లు ఎంతకాలం నుంచి ఎస్‌ఎల్డీసీ రక్షణ వ్యవస్థలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారో తెలియలేదు. ఎస్‌ఎల్డీసీ రక్షణ వ్యవస్థ పటిష్ఠంగా ఉండటం, ఆధునిక టెక్నాలజీని వాడుతుండటం వల్లనే హ్యాకర్లు చొరబడలేకపోయారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ హెచ్చరికలతో ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ నిపుణులను అప్రమత్తం చేశామని సీఎండీ చెప్పారు. వెంటనే నిపుణులు ఎస్‌ఎల్డీసీ కేంద్రాన్ని సునిశితంగా పరిశీలించి సర్వర్లలోకి మాల్‌వేర్‌ ప్రవేశించే ప్రయత్నం జరిగినట్టు గుర్తించారని తెలిపారు. వెంటనే రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశామని, తమ సాంకేతిక విభాగం ఎక్కడికక్కడ మాల్‌వేర్‌ను నిరోధించే చర్యలు తీసుకుంటున్నదని సీఎండీ తెలిపారు. గ్రిడ్‌కు సంబంధించిన అధికారులు, సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించామని, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాదు, ఇంటర్నెట్‌ ఆధారంగా హ్యాకింగ్‌ జరిగే అవకాశాలుఎక్కువగా ఉన్నందున ఆ మార్గాన్ని మూసేశామని తెలిపారు. ఎస్‌ఎల్డీసీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ముఖ్యమైన పైస్థాయి అధికారులకు మాత్రమే కల్పించారు. వీరిలో విద్యుత్‌ సౌధలో పనిచేసే ఇద్దరు ముగ్గురు అధికారులకు ఇంట్రానెట్‌ ద్వారా ఎస్‌ఎల్డీసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి చూసే సదుపాయం ఉన్నది. మరో ముగ్గురు అధికారులకు ఇంటర్నెట్‌ ద్వారా ఎస్‌ఎల్డీసీ వెబ్‌సైట్‌ను పరిశీలించే అవకాశం ఉండగా, ఇప్పుడు ఆ అనుసంధానాన్ని నిలిపివేశారు. హ్యాకింగ్‌, మాల్‌వేర్‌ను గుర్తించడంలోనూ నిపుణులైన ఐటీ సిబ్బందిని రంగంలోకి తీసుకొచ్చారు.

    ఒకవేళ చైనా సైబర్‌ నేరగాళ్ల పన్నాగం ఫలిస్తే.. తెలంగాణలో విద్యుత్ సరఫరా వ్యవస్థను వారు నియంత్రించగలిగేవారు. గ్రిడ్‌ను కుప్పకూల్చేవారు. అదే జరిగితే, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి రాష్ట్రం అంధకారం అయ్యేది. కొన్ని గంటల పాటు కరెంటు నిలిచిపోయివుండేది. ప్రజలు ఇబ్బందుల్లో పడేవారు. మెట్రో రైలు సర్వీసులకు కూడా అంతరాయం కలిగేది. విద్యుత్ ఆధారిత సంస్థలన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదర్కోవాల్సి వచ్చేది. థర్మల్‌ పవర్‌స్టేషన్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయేది. దానిని, పునరుద్ధరించాలంటే ఒకట్రెండు రోజుల సమయం పట్టేది. ఒకేసారి అన్ని యూనిట్లలో ఉత్పత్తిని పునరుద్ధరించడం సాధ్యం కాదు. క్రమేపీ ఒక్కో యూనిట్‌ను స్టార్ట్‌ చేస్తూ.. పూర్తి సామర్థ్యానికి తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్ అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది.

    విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ నుంచి విద్యుత్‌ సరఫరా వ్యవస్థ నిర్వహణ వరకు ప్రస్తుతం అంతటా ఆటోమేషన్‌ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లతో నడిచే కంప్యూటర్‌.. ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలతో మన అవసరాలకు తగ్గట్లు విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్‌ను అనుక్షణం నియంత్రిస్తుంటారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో.. ముందే మాల్‌వేర్‌ లేదా వైరస్‌ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి, సరఫరా వ్యవస్థలను సైబర్‌ నేరస్థులు హైజాక్‌ చేసి గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతేడాది ముంబైలో గ్రిడ్‌ కూలిపోవడం వెనక ఇదే కారణమని చర్చ జరుగుతోంది.

    విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విడిభాగాల్లో మాల్‌వేర్‌ లేదా ట్రోజన్స్‌ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వాటి వాడకం వల్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థపై సైబర్‌ దాడులు జరిగే అవకాశాలున్నాయని గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వ్యూహాత్మకమైన విద్యుత్‌ రంగాన్ని పరిరక్షించడానికి రాష్ట్రాలకు పలు సూచనలు కూడా చేసింది. చైనా పరికరాలు ఎంత ప్రమాదకరమో ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి.

    Trending Stories

    Related Stories