చైనా గుండెల్లో దీపావళి బాంబు..! విలువ రూ. 75 వేల కోట్లు..!!

0
844

మదపుటేనుగును అదుపు చేసేందుకు జానెడు అంకుశం చాలు. చైనాను నియంత్రించడానికి భారత్ ఇదే సూత్రాన్నే అనుసరిస్తోంది. చైనా లాంటి దుర్మార్గపు దేశంపై యుద్దానికి దిగడం కంటే సరైన సమయంలో ముకుతాడు వేస్తే దానికదే దారికొస్తుంది. అయితే ఇటువంటి ముకుతాడును భారత ప్రజలు పండగ చేసుకుని మరీ డ్రాగన్ ముక్కుకు వేశారు. కొన్నేళ్లుగా దీపావళికి భారతీయులంతా ఆనందంగా టపాసులు కాలుస్తూ.. చైనాకు మాత్రం నిద్రలేని రాత్రులను కల్పిస్తున్నారు. తాజా దీపావళికి ఇది మరోసారి రిపీట్ అయింది.

గతంలో భారత దేశ మార్కెట్లన్నీ చైనా వస్తువులతో నిండిపోయేవి. చీప్ వస్తువులంటూ ప్రజలకు నాణ్యతలేని సరుకులను సరఫరా చేసేది చైనా. ఇక వాటి పనితీరు అయితే చెప్పనక్కర్లేదు. కొనేటప్పుడు ఉండే గ్యారంటీ ఇంటికి తీసుకెళ్లాక ఉండదు. ఇంటికెళ్లిన తర్వాత పని చేస్తాయో లేదో కూడా తెలియదు. అయినా వాటినే కొనాల్సి వచ్చేది. ఇక పండుగల సమయంలో అయితే చెప్పనక్కర్లేదు. దీపావళి వచ్చిందంటే చాలు మట్టి ప్రమిదల నుంచి బాణాసంచా వరకు చైనా వస్తువులతో నిండిపోయేవి. భారత్‎లో దీపావళి వచ్చిందంటే చైనా ఆర్థికానికి బలం చేకూరేది. పండుగ చేసుకునేది మనం అయితే వాటి లాభాలను ఆశించేవాడు చైనావాడు అయ్యేవాడు. ఇదంతా గత పాలకుల కుట్రలవల్లే జరిగింది. 2005 నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ నుండి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‎కు విరాళాలు వెల్లువలా వచ్చి పడటంతో తీసుకున్న డబ్బుకు ప్రతిఫలంగా చైనాకు అనుకూలంగా ట్రేడ్ అగ్రిమెంట్లు జరిగాయి. ఇదే చైనాకు వేలకోట్లను అందించే వ్యాపారంగా తయారైంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే చైనాను కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కొన్ని సందర్భాల్లో చైనాపై విజయం సాధించినా కూడా అనుకున్నంత స్థాయిలో ఈ మార్పు రాలేకపోయింది. దీనికి కారణం అప్పటికే ప్రజలు చైనా చీప్ వస్తువులకు అలవాటుపడిపోవడంతో ఈ మార్పు కాస్తంత కష్టంగా మారింది. అయితే చైనా గల్వాన్ ఘర్షణల తర్వాత డ్రాగన్ కంట్రీ వంకరబుద్ది ప్రజలందరికీ అర్థమైపోయింది. చైనా వస్తువులపై ప్రజల్లో కూడా వ్యతిరేకత రావడం మొదలైంది. ఇదే అదనుగా ప్రధాన మంత్రి కూడా చైనాపై ఆర్థిక యుద్దానికి నాందిపలికారు. ‘వోకల్ ఫర్ లోకల్ దిస్ దివాళీ’ అనే పిలుపునిచ్చారు. దీంతో ప్రజల్లో కూడా ఈ దీపావళి పండుగ రోజు సైనికులకు మద్దతుగా చైనా వస్తువులను బహిష్కరించాలని గట్టిగా భీష్మించుకోవడంతో ఒక్కసారిగా చైనా అమ్మకాలు భారత్ లో తగ్గిపోయాయి. ప్రధాని మోదీ పిలుపుకు భారత వ్యాపారుల సమాఖ్య CAIT కూడా స్పందిస్తూ 2020 సంవత్సరం దీపావళికి చైనా వస్తువులను దిగుమతి చేసుకోబోమంటూ నిర్ణయించుకోవడంతో చైనాకు భారీ దెబ్బ తగిలింది.

ఈ విధంగా మైదలైన బాయ్ కాట్ చైనా ఉత్పత్తుల నినాదం 2020లో దాదాపు 40వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది. చైనా ఉత్పత్తులన్నీ దాదాపు తగ్గిపోయినా,.. ఒకే సారి పూర్తిగా తగ్గించడానికి కుదరదు కాబట్టి 2020లో 40వేల కోట్ల నష్టంతో ఆగిపోయింది. అయితే ఆ తర్వాత అయినా చైనా తన తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గి ఉంటే ఈ నష్టం కాస్తంత అయినా తగ్గేది. కానీ గల్వాన్ విషయంలో అక్కడ నెలకొన్న ప్రతిష్టంభన అలాగే కొనసాగించింది. దీంతో 2021లో భారత ప్రజలు మరోసారి తమ పండుగతో దెబ్బకొట్టారు. 2021లో ఈ నష్టాన్ని మరింత పెంచి 50 వేలకోట్లకు చేర్చారు. కుక్కతోక ఎంత చేసినా వంకరే అన్నట్టు చైనాకు ఇంతటి నష్టాన్ని కలిగించినా ఆ దేశం మారలేదు. దీంతో ఈ సంవత్సరం కూడా చైనాకు దీపావళి గిఫ్ట్ గా భారీ నష్టాన్నే అందించినట్లయింది. ఈ విషయాన్ని భారత వ్యాపారుల సమాఖ్య CAITసైతం దృవీకరించింది. CAIT ఇచ్చిన నివేదికల ప్రకారం 2022లో దీపావళి వ్యాపారం లక్షా యాభై వేల కోట్లకు చేరుకుందని CAIT పేర్కొంది. గత ఏడాదిలాగే ఈసారి కూడా వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ప్రజలు తూచ తప్పకుండా పాటించారని తెలిపింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు గతంలో కంటే ఈసారి మరింతగా తగ్గిపోయిందని CAIT చెప్పింది. ఈసారి దాదాపు 75 వేల కోట్ల ఉత్పత్తుల దిగుమతులు చైనానుంచి నిలిపివేసిందని భారత వ్యాపారుల సమాఖ్య తెలిపింది. అంటే గతేడాదితో పోలిస్తే దాదాపు 25 వేల కోట్లు ఎక్కువగా జరిగింది. దీంతో చైనా ఆధిపత్యానికి మరోసారి భారతీయులు గండి కొట్టినట్లయింది.

కొన్ని దశాబ్దాలుగా చైనా ఎదగడానికి భారత్ ను బాగా ఉపయోగించుకుంది. భారత్ లోని పాలకులకు డబ్బులు ఆశ చూపి ఇక్కడి చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకుంది. దీంతో చైనా చీప్ వస్తువులు భారత్ లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దీంతో భారత్ లోని చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమల వారు భారీగా నష్టపోయారు. చిన్న చిన్న ఉత్పత్తుల తయారీ రంగం భారీగా కుదేలైపోయింది. హస్తకళా ఉత్పత్తులకు కూడా డిమాండ్ తగ్గిపోవడంతో భారీగా ఉపాధి కోల్పోయారు. అయితే నాటి ప్రభుత్వాలు తమ స్వార్థంతో దీన్ని ఆపలేకపోయాయి. కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక చైనా ఆధిపత్యానికి చెక్ పెడుతూ అడుగులు వేశారు. ఒకపక్క బాయ్ కాట్ చైనా నినాదమిస్తూ చైనా వస్తువులకు ప్రత్యామ్నాయ వస్తువులను తయారీకి భారత్ లోని కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తూ వచ్చారు. గోమయంతో దీపాలు, సాంబ్రాణి ధూపం వంటివి తయారీ చేయించడంతో తక్కువ ధరలోనే ఉత్పత్తులను తయారు చేయడం జరిగింది. దీంతో చైనా వస్తువులకు ప్రత్యామ్నాయం కూడా పెరుగుతోంది. అంతేకాదు, గతంలో కుదేలైన కుటీర, మధ్య తరహా పరిశ్రమలు మరింత పుంజుకోవడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను కూడా అందించడంతో మెల్లమెల్లగా పుంజుకోవడం మొదలైంది. దీంతో ప్రతియేటా ఈ ఉత్పత్తులు పెరుగుతూ వచ్చి చైనా నుంచి దిగుమతులు తగ్గిపోతూ వచ్చాయి. దీంతో డ్రాగన్ కంట్రీకి ఈ సారి దాదాపు 75 వేల కోట్ల నష్టం వాటిల్లింది.

అయితే ఇతర దేశాలను ఎదుర్కోవాలంటే యుద్దం మాత్రమే పరిష్కారం కాబోదు. మదపుటేనుగును నియంత్రించడానికి అంకుశాన్ని ఉపయోగించినట్లు భారతీయులు చైనాపై తెలివితో యుద్దం చేస్తున్నారు. ప్రత్యక్ష యుద్దానికి దిగితే భారత్ గెలిచినా,.. ఎంతో కొంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. భారీగా సైనికులు, ఆయుధాలను కోల్పోవాల్సి వస్తుంది. కానీ, భారతీయులు మాత్రం చైనాపై ఎటువంటి నష్టం లేకుండా ఆర్థిక యుద్దాన్ని చేస్తున్నారు. ఒకవైపు పండుగ చేసుకుంటూనే శతృదేశ గుండెల్లో చిచ్చుబుడ్లు పేల్చుతున్నారు. స్వదేశీ వస్తువుల నినాదంతో చైనాకు భారీ నష్టం కలిగిస్తున్నారు. గల్వాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఇప్పటికీ నివాళులు అర్పిస్తూనే ఉన్నారు.

ఇక బాయ్ కాట్ చైనా ఉద్యమం రాబోయే సంవత్సరాల్లో మరింతగా పెరగాలని కుటీర, మధ్యతరహా పరిశ్రమల్లోని వ్యాపారులు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే తమ వ్యాపారాలు ఎక్కువవుతుండటంతో గతంలో కంటే ఇప్పుడు బాగా ఉపాధి కలుగుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని చైనా వస్తువులు కొనడం కంటే పూర్తి నాణ్యతగల స్వదేశీ వస్తువులు కొనాలని కార్మికులు కోరుతున్నారు. ఇక కేంద్రం లోని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి చైనా ఉత్పత్తులను పూర్తిగా తగ్గించాలని పలువురు కోరుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fourteen + 16 =