చితికిపోతున్న చైనా.. భారీగా పెరిగిపోతున్న నిరుద్యోగులు..!

0
246

చైనాలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోయింది. ఏప్రిల్ నెలలో దేశంలో 16-24 ఏళ్ల మధ్య వయసున్న వారి నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో 20.4 శాతానికి చేరుకుందని చైనా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ ఇటీవలి కాలంలో కుదేలైపోయింది. ఎన్నో కంపెనీలు దివాళా తీశాయి. పెట్టుబడుల విషయంలో కూడా ప్రపంచ దేశాలు చైనాను వదిలిపెడుతూ ఉండడంతో ఎంతో మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ముఖ్యంగా ఆ దేశ ప్రభుత్వం బడా వ్యాపారుల పట్ల వ్యవహరిస్తున్న వైఖరి కారణంగా అమెరికన్, బ్రిటీష్ మల్టీ మిలియనీర్లు అక్కడ పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే స్థాయికి వచ్చింది.

ఇక త్వరలోనే చైనా విద్యా సంస్థల నుండి భారీగా గ్రాడ్యుయేట్లు వస్తూ ఉండడంతో ఆ దేశంలో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరగనుంది. 11.6 మిలియన్ల మంది విద్యార్థులు కాలేజీ, వృత్తి విద్యా పాఠశాలల నుండి గ్రాడ్యుయేట్ కాబోతూ ఉండడంతో.. అక్కడ యువతకు మరిన్ని కష్టాలు మొదలుకాబోతున్నాయి. అయితే కొత్తగా వచ్చే వాళ్లను పరిగణనలోకి తీసుకోకుండా విడుదల చేసిన గణాంకాలు ఇవి. వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటే చైనాలో నిరుద్యోగం ఇంకా ఎక్కువగానే ఉందని అర్థం అవుతుంది.

చైనా ఆర్థిక వ్యవస్థ పతనానికి కరోనా మహమ్మారి కూడా ఒక కారణమని అంటూ ఉన్నారు. చైనా ప్రభుత్వం జీరో-కోవిడ్ విధానంతో ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ నాన్సీ కియాన్ ఈ ఖబర్‌హబ్ నివేదికలో తెలిపారు. ఈ నివేదికల ప్రకారం చైనా ఆర్థిక పునరుద్ధరణలో ఇతర దేశాల కంటే చాలానే వెనుకబడి ఉంది. అమెరికాలో 2020లో కరోనా మహమ్మారి సమయంలో నిరుద్యోగం రేటు గరిష్ఠంగా 14.85 శాతానికి చేరుకుంది. 2021లో 9.57 శాతానికి తగ్గింది. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ రేటు 6.5 శాతంగా ఉంది. అమెరికా కోలుకున్నప్పటికీ.. చైనా మాత్రం కోలుకోలేకపోతూ ఉంది.16 ఏళ్ల నుండి 24 ఏళ్ల మధ్య వయస్సు వారు పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చైనాలో పని లభించడం లేదు.

చైనాలో ఫ్యాక్టరీల పరిస్థితి కూడా దారుణంగా తయారైందని అంటూ ఉన్నారు. డిమాండ్‌ లు బాగా తగ్గడం, ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్వాహకులపై ఊహించని విధంగా ఒత్తిడి పెంచడంతో అక్కడి పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతూ ఉన్నాయి. అధికారిక పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఐదు నెలల కనిష్ట స్థాయి 48.8కి పడిపోయిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది. సర్వీస్ సెక్టార్ కార్యకలాపాలు మేలో మరింత దిగజారిపోయాయి. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా.. గత మూడు సంవత్సరాల నుండి పుంజుకోడానికి చాలానే ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఇప్పట్లో ఆర్థిక వ్యవస్థ రికవరీ జరగడమన్నది అసాధ్యమనే అంటున్నారు.