జర్నలిస్టులపై చైనా పైశాచికం..
బీబీసీ విలేఖరిని వెంబడించిన వైనం..!

0
729

నయా నియంత షీ జింపింగ్ పాలనలో చైనా ఆగడాలు అంతకంతకూ మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు నోరుమెదిపినా.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే,.. లేదా దేశం దాటిపోయి తలదాచుకోవాల్సిందే. ప్రభుత్వ లొసుగులను బయటపెడితే.. డాక్టర్లయినా, ఇంజనీర్లయినా.. చివరికి జర్నలిస్టులైనా డ్రాగన్ పైశాచికానికి బలికావాల్సిందే. కరోనా గురించి ప్రపంచానికి చెప్పాలనుకున్న డాక్టర్లు, జర్నలిస్టులకు.. చైనా ఏ గతి పట్టించిందో మనం చూశాం. ఇప్పటికీ కొందరు జైల్లలో మగ్గుతుండగా.. మరికొందరు దేశం విడించి పారిపోయారు. ఇంకొందరి ఆచూకీ దొరకడం లేదు. తమ దేశ పౌరులనే వదలని డ్రాగన్.. విదేశీయులను మాత్రం విడిచిపెడుతుందా..! అందునా.. డ్రాగన్ లొసుగుల్ని చూపించాలనుకున్న మీడియాను వదిలిపెడుతుందా..! తాజాగా అదే జరిగింది.

ఉయ్ గుర్ ముస్లింలపై చైనా అణచివేతను ప్రపంచానికి చూపించాలనుకున్న ఓ బీబీసీ జర్నలిస్టును ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించింది. చైనాలో జర్నలిస్టు అసలైన వార్తలు రాస్తే, ఏం జరుగుతుందో చివరికి నాకూ అదే జరిగిందంటూ.. తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని బయటపెట్టారు జాన్ సడ్వర్త్ (John Sudworth) అనే బీబీసీ జర్నలిస్టు. తాను, తన కుటుంబం ఆఖరి నిమిషంలో విమానాశ్రయానికి పరుగులు తీయాల్సివచ్చిందన్నారు. తాము చైనా నుంచి బయల్దేరడానికి సిద్ధమవ్వగానే అక్కడి పోలీసులు తమపై నిఘా పెట్టారని.. తాము ఇంట్లో ఆదరాబాదరాగా సామాన్లు సర్దుకుంటుంటే, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఇంటి బయట కాపు కాశారని తెలిపారు. అంతేకాదు, తనను, తన కుటుంబాన్ని విమానాశ్రయం దాకా వెంబడించిన వైనాన్ని గుర్తుచేసుకున్నారు. చెక్-ఇన్ పూర్తి చేసుకునేవరకూ వాళ్లను వదల్లేదని ఆవేదన చెందారు. జాన్ సడ్వర్త్ భార్య యోన్ ముర్రే కూడా ఐరిష్ వార్తా సంస్థ RTE News లో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. పోలీసులు ఆమెపై కూడా నిఘా పెట్టారు. ఇలా చైనాలో తాను, తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ వీడియో ఫుటేజీ విడుదల చేశాడు సడ్వర్త్. మొత్తానికి, చైనా నుంచి ముప్పు పొంచివుండటంతో సడ్వర్త్ అండ్ ఫ్యామిలీ బీజింగ్ వదిలి తైవాన్ పారిపోవాల్సి వచ్చింది.

అయితే, ఈ ఘటనపై తమకేం తెలియనట్టు.. ఆస్కార్ రేంజి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అసలు చైనాలో ప్రసార సాధనాలకు ఎలాంటి ముప్పూ ఉండదని మొసలి కన్నీరు కార్చింది. సడ్వర్త్ ముప్పు ఎదుర్కొంటున్నట్లు తమకు తెలియదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. సడ్వర్త్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తమ దృష్టికి రాలేదని.. వస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. కానీ, చైనా మౌత్ పీస్ అయిన గ్లోబల్ టైమ్స్ మాత్రం ఎప్పటిలాగే తన అక్కసును వెళ్లగక్కింది. షింజియాంగ్‌ గురించి అపకీర్తి తెచ్చే కథనాలు రాసినందుకు ఎవరైనా వ్యక్తులు సడ్వర్త్ పై కోర్టుకు వెళ్లవచ్చని వ్యాఖ్యానించింది. చైనాలో మీడియాలాగే కోర్టులు కూడా కమ్యూనిస్టు పార్టీ చేతుల్లో కీలుబొమ్మలని చెప్పడానికి.. గ్లోబల్ టైమ్స్ ప్రదర్శించిన నోటి దురుసు చాలు. ఇలా విదేశీ జర్నలిస్టులు ఇబ్బందుల మధ్య చైనాను వదిలి వెళ్లాల్సి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. ప్రస్తుతం అవి సర్వసాధారణమైపోయాయి.

బీబీసీ బీజింగ్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న జాన్ సడ్వర్త్.. కరోనా నేపథ్యంలో చైనా అరాచకాలపై పలు వ్యాసాలు రాశారు. షింజియాంగ్‌ ప్రావిన్స్ లోని రహస్య శిబిరాలు, వూహాన్ ఒ నిశ్బబ్ద నగరం పేర్లతో పలు కథనాలు రాశారు. వీటిలో ఆగడాలను ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు, షింజియాంగ్‌ ప్రావిన్స్ లో ఉయ్ గుర్ ముస్లింల అణచివేతకు సంబంధించి.. సడ్వర్త్ చేసిన రిపోర్టింగ్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడమే కాకుండా.. పలు అవార్డులు కూడా వరించాయి.

ఇదిలావుంటే, విదేశీ జర్నలిస్టుల పట్ల చైనా దాడులపై యూరోపియన్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలికాలంలో చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయని మండిపడింది. గతేడాది చైనా వేధింపులు మొత్తం 18 మంది జర్నలిస్టులు చైనా నుంచి పారిపోవాల్సి వచ్చిందని యరోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోరెల్ తెలిపారు. జర్నలిస్టుల వేధింపులపై ఇప్పటికే ఎన్నోసార్లు చైనా అధికారులకు తెలిపామని.. అయినా ఎలాంటి ఫలితం లేదన్నారు.

అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచ పెద్దన్న పోస్టును కొట్టేయాలని ఉవ్విళ్లూరుతున్న షీ జిన్ పింగ్.. ఇందుకోసం అడ్డదారులు తొక్కుతున్నాడు. నియంతృత్వంలో జర్మనీ నియంత హిట్లర్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ను మైమరిపిస్తున్నాడు. చైనా రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకుని జీవితకాల చైనా అధ్యక్షుడిగా అధికారం చెలాయిస్తున్న ఈ నయా నియంత దాదాపుగా సమాజంలోని ప్రతి అంశాన్నీ తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

18 − 11 =