మసీదును కూల్చి వేసి.. లగ్జరీ హోటల్ ను నిర్మిస్తున్న చైనా

0
980

చైనాలో ఇతర మతాల దుస్థితి ఎంతో దారుణంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చైనా ప్రభుత్వం ఆ దేశంలో ఇతర మతాల వారిపై తీవ్ర ఆంక్షలను విధిస్తూ వస్తోంది. ఎంతో దుర్మార్గంగా అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారని.. మైనార్టీలను ఆ దేశంలో ఎంతో వివక్షతో చూస్తూ ఉన్నారని పలువురు బయటకు చెప్పారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నోళ్ళను నొక్కేయడానికి చైనా ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర మతాలకు చెందిన ప్రార్థనాలయాలను కూల్చి వేయడానికి చైనా ప్రభుత్వం వెనుకాడడం లేదు.

జిన్జియాంగ్ హోటాన్ ప్రాంతంలోని ఒక మసీదును కూల్చివేయడానికి చైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూల్చి వేసిన ప్రాంతంలో ఓ కమర్షియల్ సెంటర్ ను ఏర్పాటు చేయడమే కాకుండా ఓ లగ్జరీ హోటల్ ను కూడా నిర్మించాలని అనుకుంటూ ఉందని టెలిగ్రాఫ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ మసీదును 2018 లోనే కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి. హాంప్టన్ సంస్థ ఈ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. 2016 నుండి జిన్జియాంగ్‌లో 16,000 మసీదులను కూల్చివేయడం లేదా ధ్వంసం చేశారని కాన్బెర్రాకు చెందిన ఓ సంస్థ తెలిపింది.

జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో ఒక మసీదును కూల్చివేసిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) అధికారులు అక్కడ బహిరంగ మరుగుదొడ్డిని నిర్మించినట్లు 2020 ఆగస్టులో వార్తలు వచ్చాయి. ఉయ్ఘర్‌ ముస్లింలకు వ్యతిరేకంగా గర్భిణీ స్త్రీలను బలవంతంగా గర్భస్రావం చేయాలని ఆదేశించింది. చైనా దేశవ్యాప్తంగా ఉన్న మసీదుల నుండి అరబ్ శైలి గోపురాలు, ఇస్లామిక్ అలంకరణలు, అరబిక్ లిపిలను కూడా తొలగిస్తున్నారు. నింగ్క్సియా ప్రావిన్స్ రాజధాని యిన్చువాన్ లోని ప్రధాన మసీదు విషయంలో చైనా అధికారులు చాలా మార్పులు చేశారు. యిన్చువాన్ మసీదుకు ఉన్న గోపురం, బంగారు ఇస్లామిక్ తరహా ఫిలిగ్రీ, అలంకార తోరణాలు, అరబిక్ లిపిని మొత్తం మార్చేశారు. ఇలా ఎన్నో ఏళ్లుగా చైనాలో మసీదులపై అక్కడి ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here