More

  చైనా చేసిన దురాగతాల ముందు కరోనా చిన్నది
  – డా. పి. భాస్కరయోగి

  అది 3 జూన్ 1989.. ఇంకా తెల్లారలేదు.. చైనా ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా తియాన్మెన్ స్క్వేర్‎లో విద్యార్థుల దీక్ష ప్రారంభమై నెల రోజులు గడిచింది. బీజింగ్ మిలిటరీ కమిషన్ అధ్యక్షుడు డెంగ్ దయార్ద్రహృదయుడని విద్యార్థులు పొరబడ్డారు. అదే వాళ్లకు శాపమైంది. ఆ రాత్రి వాళ్లకు కాళరాత్రిగా మారింది. నినాదాలు ఇచ్చిన గుండెలు నిద్రలో ఉన్నాయి. హర్రర్ కథల్లో కూడా లేని రాక్షస బల్లుల బాపుల్లా, నల్లటి మేఘాల్లాంటి మృత్యు శకటాలు వాళ్ల మీద పడ్డాయి. ఎర్ర సైనికుల గుళ్ల వర్షం ఒకవైపు.. విద్యార్థుల శరీరాలను ఛిద్రం చేస్తూ ట్యాంకర్లు మరోవైపు. చైనా ఎర్రముక్కు గ్రద్ద మృత్యు తాండవం చేస్తున్నది. మరుగుతున్న రక్తం.. కరుగుతున్న ప్రాణాలు.. హాహాకారాలు పెడుతున్నాయి. మృత్యు రూపంలో చైనా ప్రభుత్వం చేసిన వికటాట్టహాసం చూసి, బ్రతికి బయట పడ్డ కార్మికుడు గొంతెత్తి.. ‘‘ఆఖరికి దేశాన్ని దురాక్రమణ చేసిన జపాన్ రక్కసులు కూడా చైనా ప్రజల పట్ల ఇంత కఠినంగా ప్రవర్తించలేదు’’ అంటూ అరిచాడు. ఇలాంటి దురాగతాలు చైనా చరిత్రలో లెక్కలేనన్ని..!? చరిత్రలో మునుపెన్నడూ లేని చైనా “కమ్మీనా”గాడు ఒక్కసారి శాంతిదూతగా మారడం విడ్డూరమే సుమీ..!? నమ్మకమైన ప్రేమపూర్వక దేశంగా చైనా ఇమేజ్ ను పెంచాలని.. వాళ్ల పితృదేవత మావో సేతుంగ్ ను చంపి పుట్టిన చైనా అధ్యక్షుడు జిన్‎పింగ్ ఇటీవల కోరడం విడ్డూరం. లావోట్జ్ లాంటి జెన్ గురువు ఆత్మ ఏమైనా జిన్‎పింగ్ తలపై ఎక్కి కూర్చున్నదా అని అనుమానం.

  ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న చైనా బొడ్డు లోంచి పుట్టిన కరోనా వైరస్ పై ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. ప్రపంచవ్యాప్త చర్చకు దారి తీసిన ఈ చర్చ చైనాను వేలెత్తి చూపుతున్నాయి. 2019 నవంబర్ నెలలో వూహాన్ వైరాలజీ ఇనిస్టిట్యూట్‎లో.. ముగ్గురు పరిశోధకులు తుమ్ముతూ, దగ్గుతూ తుస్సుమన్నారని ఈ నిఘా నివేదిక నిగ్గుతేల్చింది. 2018 లోనే తమ ల్యాబ్‎లో ఇలాంటి వైరస్ పుట్టించొచ్చు అని పరిశోధనా పత్రాలు తయారు చేసినట్లు ఇంకో నివేదిక వెల్లడించింది. ప్రపంచ తొలి కరోనా కేసు 2019 డిసెంబర్ లో నమోదయినట్లు చైనా ఆవులిస్తూ చెప్పిందని, Covid కు కారణమైన సార్స్ కోవ్-2 పుట్టుక దర్యాప్తు కోసం నత్తల మేనమామ WHO త్వరలో సమావేశం అవుతున్న నేపథ్యంలో ఈ కథనం రావడం విశేషం.

  ముందునుండి డోనాల్డ్ ట్రంప్ ఎంత అరిచి గోల పెడుతున్నా.. చైనా చందమామను తలపై మోస్తున్న WHO.. ఇది సహజంగా ప్రకృతి సిద్ధంగా పుట్టిన వైరస్ అంటూ వంత పాడింది. రక్తబీజుడి కన్నా శక్తివంతంగా సృష్టించిన ఈ వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక, సామాజిక, రాజకీయ మూలాలపై గొడ్డలిపెట్టుగా మారింది. ఇక మన దేశంలో ఇంకా విచిత్రం. “నాలుగు రోజులు నల్ల నీళ్లు రాకున్నా ఎప్పుడు వస్తాయి అన్న వాళ్ళమే గాని, నిన్న ఎందుకు రాలేదని నిలదీసిన వాళ్లం కాదు”. అంత గొప్ప అమాయక అర్బకులం. అంతేకాకుండా.. భారతీయులకు శత్రువులను మర్చిపోగల నైపుణ్యం ఎక్కువ. తైమూర్, అబ్దాలి, గజిని, నాదిర్ష, ఘోరి, ఔరంగజేబులను అవలీలగా మర్చిపోయిన మనం, చైనావాడు పుట్టించిన ఈ చీడపురుగు చేసిన విధ్వంసాన్ని వెంటనే మర్చిపోతాం. అంతేకాకుండా ఇదేదో మనకు క్రమశిక్షణ నేర్పింది అని కెరీరిజం బోధకులూ,.. మృత్యు పరిష్వంగం అంటే ఏమిటో మన కళ్లకు కట్టిందని.. ఆధ్యాత్మికవేత్తలూ, అసలు దేవుడే లేకుండా ప్రపంచం నడుస్తుందని నాస్తికులూ,.. జీవితంలో అనుభవం కరోనా మనకు గుణపాఠంలా నేర్పింది అని సామాజికవేత్తలూ,.. కొత్త పరిశోధనలకు ఆస్కారం కలిగించిందనీ శాస్త్రవేత్తలు,.. మేము ఎంతో చేయాలనుకున్నాం.. కానీ, కరోనా వల్ల చేయలేకపోతున్నామనీ రాజకీయ నాయకులూ, వ్యాపారంలో నష్టం వచ్చిందని కాదు.. ఈ కష్టకాలంలో బ్రతికి ఉన్నామా..! లేదా..? అని ఆలోచించండి అంటూ వ్యాపారవేత్తలూ.. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు. వీళ్లు వ్యాఖ్యాత మల్లినాథ సూరి తాతలు.

  బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, అమెరికా, బ్రెజిల్, ఇజ్రాయిల్.. ఇలా ఎన్నో దేశాల్లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేసింది. ఇప్పుడు మన దేశం వంతు వచ్చింది. ప్రపంచంలోని 700 కోట్ల జనాభాలో 140 కోట్లు గర్భంలో దాచుకున్న భారత్ లో దిన దిన గండం నూరేళ్ళ అయుర్డాయం లా ఉంది. అయితే మన ఉపఖండంలో ప్రపంచంలోనే క్రమశిక్షణకు మారుపేరైన పాకిస్థాన్‎లో కరోనా ఎందుకు తీవ్రంగా లేదో ఆలోచించాలి. లేదా ఇమ్రాన్ ఖాన్ పై ఏమైనా కరుణ చూపాడా అన్నది కోటి డాలర్ల ప్రశ్న..!? అలాగే బర్మా, బంగ్లాదేశ, శ్రీలంక, నేపాల్.. మొదలైన దేశాల్లో కరోనాకు తావీజ్ ఎవడో కట్టినట్లే ఉన్నాడు. మరి, మనకు ఎవ్వడు చేతబడి చేసాడబ్బా..!? అనేది కూడా పరిశోధనాంశమే. ఇంత చేసినా చైనా పైన ఈగ కాదు కదా దాని మలం కూడా పడనివ్వని భారతీయ మీడియా ఎడమ వాటం మడమ తిప్పని యోధులకు లాల్ సలాం. అయినా చైనాగాడి దురాగతాల ముందు ఈ కరోనా దిగదుడుపే..?

  మే 25, 1949లో మావో సెతుంగ్ ప్రజా విముక్తి సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) షాంఘై నగరాన్ని కబ్జా చేసిన వెంటనే.. ప్రతి కుటుంబం పూర్తి వివరాలు ఇవ్వమని ప్రభుత్వం కోరగానే అమాయక ప్రజలు ఎర్ర విప్లవం ఎర్రితో వెంటనే ఇచ్చేశారు. ఈ నివేదికలను ఆధారం చేసుకుని వేలాది మందిని బొక్కలో వేసి కుళ్ళబొడిసి చంపేశారు. విదేశీ గూడచారి అనో.. బూర్జువా అనో.. ప్రభుత్వ వ్యతిరేకి అనో.. మాట వినడం లేదనో.. నేరారోపణ చేసి చిత్రహింసలు చేసి ఒప్పించడం, శిక్ష అమలు జరపడం అనే.. చతుర్విధ దండనలతో భూతల నరకంగా మార్చాడు మావో. “చైనాలో వధ్యశిల ఎక్కిన వాలంటీర్లు” అంటూ నాటి హంగేరియన్ కమ్యూనిస్టు నేత బేలా స్టాస్ బహిరంగంగా చెప్పాడంటే.. అక్కడి నరహంతక పాలన ఎలా ఉందో చెప్పొచ్చు. 1942లోనే మావో చెప్పిన సూక్తి ముక్తావళి వింటే మనకు సమాధానం దొరుకుతుంది. ‘‘రోగికి ముందు చురుకు పుట్టించే ఔషధం ఇవ్వాలి. వాడు బాధతో పెడ బొబ్బలు పెడతాడు. జబ్బు ముదిరిందని భయపడి చెమటలు కక్కుతాడు. అప్పుడు రోగికి చికిత్స చేయడం చిటికెలో పని’’. ఇందులోని రహస్యం గ్రహిస్తే కరోనా రహస్యం కూడా బోధ పడుతుంది. ఈ ప్రణాళికనే మావో అవతారం మళ్ళీ ఎత్తిన జిన్‎పింగ్ 2019 నుండి గట్టిగా అమలు చేస్తున్నాడు.

  మావో యాంగట్స్రి రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేసినప్పుడు రక్తాన్ని వరదలా పారించాడు. పీపుల్స్ ఆర్మీకి ఎదురు తిరిగిన వాళ్లంతా కఠిన శిక్షలకు గురి అవుతారని 23 జూలై 1950లో ప్రకటించి, 21 నేరాలను తీవ్రంగా పరిగణించి.. తమ చేతులతోనే తమ తల్లిదండ్రులను ఉరితీసేటట్లుగా ప్రేరేపించాడు. మావో ప్రభుత్వం సృష్టించిన కమ్యూన్లు వేలాదిమంది ప్రజలను జీవచ్ఛవాలుగా మార్చాయి. చివరకు 1959లో ఆకలి బాధ తీర్చుకునేందుకు చెట్ల బెరడు, దుంపలు ఆహారంగా మారాయి. పుకియాంగ్‎లో క్యాబేజీ, నొన్ కింగ్‎లో ముల్లంగి, క్యారెట్, మంచూరియాలో మొక్కజొన్న, పచ్చగడ్డి.. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో డెలీషియస్ వంటకం ప్రజలు వెతుక్కోవాల్సి వచ్చింది. 1957లో అరెస్టై ఏడేళ్ల కఠిన మావో దండన అనుభవించిన బివోరువాంగ్ 1976లో రాసిన పుస్తకంలో.. తన యమలోక అనుభవాలు గుదిగుచ్చాడు. పశువుల చేత చేసే పనులు ఖైదీల చేత చేయించడమే కాక,1960లో చైనా క్షామంలో జంతువుల్లా పని చేయించి.. కాగితపు గుజ్జు తిని బ్రతకడం ఎలా..? అని ఖైదీలపై ప్రయోగాలు చేశారు. దీనిని శిక్షగా భావించకుండా సోషలిస్టు సమాజ ఆదర్శంగా స్వీకరించాలని చెప్పేవారని రూవ్ వాంగ్ గొల్లున ఏడ్చాడు.

  ప్రజలకు ఎంత ఎక్కువ విజ్ఞానం ఇస్తే వాళ్లలో అంతగా విప్లవభావాలు వెనక్కి పోతాయని మావో చెప్పాడని మనదేశ హిందూ పత్రిక విలేఖరి నారాయణన్ రాసుకొచ్చాడు. అందువల్లనే కొన్నేళ్లపాటు మావో అక్కడ నిర్దాక్షిణ్యంగా విశ్వవిద్యాలయాలను మూయించాడు. 1951లో ఒక్క క్వాంగ్టుంగ్, క్వాంగ్సే రాష్ట్రాలలోనే 2 లక్షల 60 వేల మందిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దారుణంగా హతమార్చింది.. అని ఫ్రాంక్ మోరీస్ (టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకుడు) పేర్కొన్నాడు. మధ్య దక్షిణ ప్రాంతాల్లో 10,60,000 హత్యలు జరిగాయని గణాంకాలు చెప్పిన వాళ్లు ఉన్నారు. సిగ్గు.. సిగ్గు..!? 1959లో టిబెట్‎లో చైనా ఎర్ర సైన్యం జరిపిన దమనకాండలో 65 వేల మంది క్రూరమైన బలి పీఠం ఎక్కారని.. హెడి మాలవీయ పెకింగ్ లీడర్ షిప్; ట్రైచరీ అండ్ బిట్రేయల్‎లో చెప్పాడు. 1966 నుండి 76 మధ్య టిబెట్‎లోని ఆరువేల బౌద్ధారామాలు చైనా పద ఘట్టనల క్రింద దుమ్ములో కలిసిపోయాయని 20 అక్టోబర్ 2000 ఆసియా వీక్ వెల్లడించింది. ఎంత ఘోరం.. ఈ నర మేధాలకు మావో తో పాటు చియాంగు చింగ్ (మావో భార్య) వాంఘాంగ్ వేన్ (డిప్యూటీ ఛైర్మన్) చాంగ్ చున్ చేయావో (డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్) యావెన్ యాన్ (సిద్ధాంత వేత్త).. ఈ దుష్టచతుష్టయం కూడా కారకులే.

  ‘కడుపులో కత్తెర్లు నోట్లో చక్కెర్లు’ ఇవి చైనా వాడి చరిత్రలో నుంచి పుట్టిన సామెతలు. కుట్ర, వంచన, సామ్రాజ్యవాదం, దుష్ట పన్నాగం, కుత్సిత కమ్యూనిస్టు కుతంత్రం.. ఇవన్నీ కలగలిసి పుట్టిన పాపాల భైరవుడి సామ్రాజ్య రూపం చైనా. చాంగ్ కైసేక్ ఫార్మోసాలో నెలకొల్పిన ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొట్టమొదటి దేశం భారత్. నెహ్రూ నుండి మోదీ వరకు ఎంత స్నేహం హస్తం అందించినా.. విష నాగులా మనల్ని కాటేస్తూనే ఉంది. దీనికి కారణం.. వాళ్ళ తాత ముత్తాత లైన మార్క్స్, లెనిన్, స్టాలిన్ నుండి వారసత్వంగా పొంది.. వాళ్ళ పితృదేవత మావో సేటుంగ్ ను రోజూ ఆరాధించే ఈ దుష్ట డ్రాగన్ సామ్రాజ్యవాద కమ్యూనిస్టు మనస్తత్వమే. ఓ ప్రపంచమా.. జాగ్రత్త..!

  – ఇటీవల ‘‘అందరి మనసులూ గెలవా లి’’ అన్న చైనా అధ్యక్షుడు జిన్‎పింగ్ వ్యాఖ్యలను చూసి.. ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి. భాస్కరయోగి రాసిన వ్యాసం

  Related Stories