More

    బోర్డర్‎లోనే బలగాలు.. బ్రహ్మపుత్రపై ప్రాజెక్టులు.. మారని డ్రాగన్ బుద్ధి

    ఎలుక తోక తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా.. నలుపు నలుపే గాని తెలుపు గాదు అన్నారు మన పెద్దలు. అలాగే, ఎన్ని బరువులు వేలాడదీసినా కూడా కుక్కతోక వంకరే అనేది నానుడు. చైనాను చూసే ఈ సామెతలు పుట్టాయేమోనని అనిపిస్తుంది. భారత్ ఎంత సంయమనం పాటిస్తున్నా.. డ్రాగన్ మాత్రం కుక్క బుద్ధి ప్రదర్శిస్తూనేవుంది. తన బుద్ధి అంతేనని.. ఇకపై మారదని మరోసారి రుజువు చేసింది చైనా.

    ఫిబ్రవరి నెలాఖరు నాటికి భారత్, చైనాలు లద్ధాక్ సరిహద్దు వెంబడి, ప్యాంగాంగ్ సో ప్రాంతాల నుంచి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. అయితే, వెనక్కి తగ్గినట్లే కనిపించినా.. డ్రాగన్ సైనికులు మళ్లీ సరిహద్దుల వెంబడి కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారని అమెరికా మిలటరీ కమాండర్ అడ్మిరల్ ఫిలిప్ ఎస్. డేవిడ్సన్ తెలిపారు. ఇటీవల చట్టసభ సభ్యులతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి మరోసారి తమ బలగాలను భారీ ఎత్తున తరలించేందుకు చైనా ఏర్పాట్లు చేస్తోందన్నారు. అంతేగాక, పలు వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో నిర్మాణాలను కూడా చేపడుతోందని వెల్లడించారు. అయితే, ఈ విషయంలో భారత్ కూడా అప్రమత్తంగానే వ్యవహరిస్తోందన్నారు. చైనా కుట్రలను పసిగట్టి తగిన రీతిలో భారత్ స్పందిస్తుందని అనుకుంటున్నట్లు యూఎస్ కమాండర్ తెలిపారు.

    చైనా దురాక్రమణలకు కళ్లెం వేసేందుకు యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్‌లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. అయితే, అమెరికా-భారత్ దేశాల మధ్య సత్ససంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. బరాక్ ఒబామా చెప్పినట్లు ఈ రెండు దేశాల మధ్య 21వ శతాబ్ధంలో సంబంధాలు ఇంకా మెరుగు పడతాయని తెలిపారు. ఇటీవల భారత్-అమెరికాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయన్న ఆయన.. మిలిటరీ సహకారం, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, సంయుక్త కార్యకలాపాలు లాంటివి వీటిలో ఉన్నాయన్నారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మకంగా అత్యవసరమని తెలిపారు.

    ఇలా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచిపోషిస్తూనే.. చైనా తాజాగా మరో వివాదానికి తెరలేపింది. టిబెట్‌ గుండా భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై.. అరుణాచల్‌ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేసింది. చైనా అభివృద్ధి పేరుతో మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన.. 14వ పంచవర్ష ప్రణాళికకు తాజాగా ఆ దేశ పార్లమెంట్‌ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆమోదించింది. ఈ ఏడాదే బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కమ్యూనిస్టు పార్టీ టిబెట్‌ అటానమస్‌ రీజియన్‌ డిప్యూటీ చీఫ్‌ చె డల్హా వెల్లడించారు. ఈ డ్యామ్‌ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్, ఇతర పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన ఇస్తారని.. గతంలోనే దక్షిణ చైనా మార్నింగ్‌ పోస్టు ఒక కథనాన్ని ప్రచురించింది. అన్నట్టుగానే ప్రాజెక్టును ఓకే చేసింది.

    టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది. బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో ఎన్నో ప్రాజెక్టుల్ని నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కన్నేసింది. అరుణాచల్‌కి సమీపంలో భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైంది. 60 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకొని పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు భారత్‌కి చైనా ఎలాంటి సమాచారం అందించలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై భారత్, బంగ్లాదేశ్‌లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి.

    Trending Stories

    Related Stories