బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపియన్ సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్ధార్థ్ కొద్దిరోజుల కిందట చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల పంజాబ్‌లో పర్యటించినప్పుడు భద్రతా లోపం కారణంగా కాన్వాయ్ దాదాపు 20 నిమిషాలపాటు రోడ్డుపై ఆగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు. సైనా నెహ్వాల్ కూడా మోదీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. సైనా నెహ్వాల్ ట్వీట్ ను రీట్వీట్ చేసిన హీరో సిద్ధార్థ్ ఘాటు పదాలను వాడాడు. సైనా నెహ్వాల్ ప్రధాని భద్రత విషయంలో రాజీ పడితే ఏ దేశం కూడా సురక్షితంగా ఉండదు. ఈ పిరికివాళ్ల దాడిని నేను ఖండిస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది. అయితే సైనా నేహ్వాల్ చేసిన కామెంట్స్ ను సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ.. ‘కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. థ్యాంక్స్ గాడ్.. ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ రిహన్నా’ అంటూ ట్వీట్ చేశాడు.
సిద్ధార్థ్ వాడిన పదజాలంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని ట్విట్టర్ ఇండియాకు లేఖ రాసింది. సిద్ధార్థ్ ప్రతిస్పందిస్తూ తాను ఎవరినీ అగౌరవపరచడం లేదని అన్నాడు. బహిరంగ క్షమాపణ చెబుతూ లెటర్ ను విడుదల చేశాడు. డియర్ సైనా నేనో అసభ్యకరమైన జోక్ చేశానని, అందుకు క్షమించాలని కోరాడు. మీ ట్వీట్‌కు తాను స్పందించిన తీరు, వాడిన భాష సరికాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అది తాను దురుద్దేశంతో చేసిన ట్వీట్ కాదని, మహిళలంటే తనకు ఎనలేని గౌరవమని చెప్పుకొచ్చాడు. తన ట్వీట్‌లో లింగ వివక్ష ఏమీ లేదని, మీరు మహిళ కాబట్టి దాడి చేయాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రమూ లేదని అన్నాడు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెడదామని .. మీరెప్పుడూ నా చాంపియనేనని, తన క్షమాపణలు అంగీకరిస్తారని ఆశిస్తున్నానంటూ ఆ లేఖలో చెప్పుకొచ్చాడు.
పలు ప్రాంతాల్లో సిద్ధార్థ్ పై కేసులు నమోదయ్యాయి.. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిద్దార్థ్ పై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని చెన్నై పోలీస్ కమిషనర్ ధృవీకరించారు. తాజాగా చెన్నై పోలీసులు సిద్దార్థ్ కు సమన్లు జారీ చేశారు. సిద్దార్థ్ పై నమోదైన రెండు ఫిర్యాదుల ఆధారంగా అతడికి సమన్లు పంపామని పోలీసులు తెలిపారు. ఆ వివాదాస్పద ట్వీట్ పై సిద్దార్థ్ వాంగ్మూలం రికార్డ్ చేస్తాము. సిద్దార్థ్ చేసిన ట్వీట్ పై ఒక కేసు నమోదు కాగా, మరొకటి సైనా నెహ్వాల్ తరఫునుంచి పరువు నష్టం దావా కేసు నమోదైంది అని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ తెలిపారు.