వినాయకచవితికి చెన్నై పోలీసుల ఆంక్షలు.. మండిపడుతున్న హిందువులు..!

0
151

తమిళనాడు ప్రభుత్వం, అధికార డీఎంకే నాయకులు హిందుత్వంపై దాడి చేస్తూ ఉన్నారు. మరోవైపు చెన్నై నగరంలో గణేషుడి విగ్రహాలను పెట్టుకోవాలన్నా ఎన్నో ఆంక్షలను విధించారు. గ్రేటర్ చెన్నై పోలీసులు గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశారు. వినాయక చతుర్థి ఉత్సవాల కోసం పోలీసులు జారీ చేసిన 11 మార్గదర్శకాల కారణంగా హిందువుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది.

వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే చోట భూ యజమానులు సంబంధిత స్థానిక సంస్థలు, హైవే శాఖ లేదా ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొంది ఉండాలని తెలిపారు. ఈ పర్మిషన్స్ కోసం ఎంతో మంది తిరుగుతూ ఉండగా.. అనుమతులు మాత్రం ఇవ్వలేదని తెలుస్తోంది.

అగ్నిమాపక శాఖ, విద్యుత్ బోర్డు మొదలైన వాటి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పకుండా తెచ్చుకోవాలని చెన్నై పోలీసులు సూచించారు.

వినాయకుడి విగ్రహాల ఏర్పాటు కోసం ఫారమ్‌లను పూరించడం ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి నుండి అనుమతి పొందాలన్నారు. పోలీసులు చెప్పిన పరిమితులు, షరతులకు కట్టుబడి ఉంటానని హామీ ఇవ్వాలి.

ప్రతిష్ఠించాల్సిన విగ్రహం ఎత్తు ప్లాట్ ఫాం బేస్ నుంచి 10 అడుగులకు మించకూడదు. దీనిపై మండపాల నిర్వాహకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల కిందటే విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చామని.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించే పండుగకు ఇలాంటి ఆంక్షలు విధించడం సరికాదని అన్నారు.

ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల దగ్గర విగ్రహాలను ప్రతిష్టించడం నిషేదించారు.

విగ్రహాల భద్రత కోసం ఇద్దరు వాలంటీర్లను 24 గంటల రొటేషన్‌లో తప్పకుండా నియమించాలనే నిబంధన పెట్టారు.

పూజా స్థలంలో ఏదైనా రాజకీయ పార్టీలు లేదా మత పెద్దలకు మద్దతుగా బ్యానర్లు పెట్టకూడదన్నారు.

వినాయక విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు అనుమతించిన రోజులలో, అనుమతించబడిన మార్గాల్లో మాత్రమే విగ్రహాలను తీసుకెళ్లాలి. శాంతియుతంగా నిమజ్జనం చేయాలి.

వినాయక విగ్రహాలు ప్రతిష్టించిన ప్రదేశాలు, ఊరేగింపు మార్గాలు, ఇమ్మర్షన్ పాయింట్లలో బాణాసంచా పేల్చడం అనుమతించమని చెన్నై పోలీసులు తెలిపారు.

“మత విద్వేషాలు”, “ఇతర మతాల మనోభావాలను కించపరిచేలా” నినాదాలు చేయడం నిషేధించినట్లు గ్రేటర్ చెన్నై పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా వినాయకుడి విగ్రహాల నిమజ్జనం, ఊరేగింపు సమయంలో బాణసంచా కాల్చడం నిషేధంపై కూడా తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. గ్రేటర్ చెన్నై పోలీసులు కొన్ని విషయాల్లో ముందుజాగ్రత్త చర్యలను అమలు చేస్తున్నప్పటికీ.. కొన్ని ఆంక్షల కారణంగా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.