More

    గాయని వాణీ జయరాం మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు: చెన్నై పోలీసులు

    ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం(78) మృతిపై నెలకొన్న అనుమానాలపై చెన్నై పోలీసులు వివరణ ఇచ్చారు. బెడ్రూంలో కిందపడడంతో తలకు బలమైన దెబ్బతగిలి మృతి చెందినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదన్నారు. వాణి జయరాం మృతిపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో చెన్నై ట్రిప్లికేణి అసిస్టెంట్ కమిషనర్ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్, పోలీసు ఉన్నతాధికారులు ఆమె నివాసానికి వెళ్లి పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో వాణి అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రలో అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు ఆమెకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులు అర్పించారు. వాణి 4 ఫిబ్రవరి 1968న జయరాంను వివాహం చేసుకున్నారు. అదే రోజున ఆమె కన్నుమూశారు.

    శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరాం జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాణి తన ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ఇక ఆమె కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. తెలుగుతోపాటు దాదాపు 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె సింగింగ్ కెరీర్ 1971లో ప్రారంభమవగా నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె పాటలు పాడారు.

    Trending Stories

    Related Stories